మర్యాదను డబ్బుతో కొనలేం:-- యామిజాల జగదీశ్
 రాజు ఆ రోజు రాత్రి మారువేషంలో తన రాజ్యంలో పర్యటించేందుకు బయలుదేరాడు. ఆయన వెంట ఇద్దరు భటులు కూడా ఉన్నారు.
ఉన్నట్లుండి చిమ్మచీకటి కమ్ముకుంది. 
భారీ వర్షం కురిసింది. 
ఆ చీకట్లో భటులకు దూరమై రాజు పక్కదారి పట్టాడు. దారి తప్పాడు.
ఎటు చూసినా కారుచీకటి. అలాగే ఆ చీకట్లో నడుచుకుంటూ పోతున్న రాజుకు కొద్ది దూరం వెళ్ళేసరికి ఓ చిన్న గుడిసె కనిపించింది. ఆ గుడిసెలోంచి ఓ చిన్నవెలుగు. ఆ వెలుగు తనను రమ్మని పిలుస్తున్నట్లు భావించి రాజు ఆ గుడిసెలోకి వెళ్ళాడు.
ఆ గుడిసెలో ఓ మనిషి. 
చినిగిపోయిన  మురికి పట్టిన బట్టలతో కనిపించాడతను. అతను తప్ప ఆ గుడిసెలో మరేదీ కనిపించలేదు. కనీసం ఒక్క సత్తు గిన్నె కూడా లేదు. అతనిలో ఎలాంటి చలనమూ లేదు. కూర్చున్న చోటే కూర్చున్నట్లే ఉన్నాడు.
మారు వేషంలో ఉన్నప్పటికీ రాజులో ఓ విధమైన అహంకారం లేకపోలేదు. తాను రాజునని చెప్పుకోకపోయినా తనకెలాంటి మర్యాద ఇవ్వకుండా ఉన్న ఆ మనిషిమీద రాజుకు కోపం వచ్చింది.
ఏమిటీ...నీ ఇంటికి వచ్చాను. నువ్వు కనీసపు మర్యాద కూడా చూపకుండా ఓ నమస్కారం పెట్టకుండా కూర్చున్నావేంటీ...నీకేదీ పట్టదా అని రాజు అడుగుతాడు.
అయితే అతను జవాబుగా నువ్వే నా ఇంట్లోకి ఆశ్రితుడిగా వచ్చావు....నీకు నీనెందుకు నమస్కారం చెప్పాలి....అన్నాడతను.
రాజుకి ఆ మాటలు చిరాకు తెప్పించాయి. భరించలేకపోయాడు.
రాజు ఎప్పుడు మారువేషంలో నగరంలో సంచరించినా తనతోపాటు ఓ కాసుల మూట కూడా తెచ్చుకుంటాడు.
రాజు ఆ మూటకున్న ముళ్ళు విప్పి ఇదిగో చూడు....నేనెంత పెద్దవాడినో గొప్పోడినో తెలిసిందా....ఇప్పటికైనా నాకు నమస్కారం పెడతావా అంటాడు.
అయితే ఆ మనిషి అందుకు జవాబుగా  పేద వాడిని ఎదుటే ఉంచుకుని ఓ మూట నిండా బంగారు కాసులను నువ్వెలా ఉంచుకున్నావో అర్థం కావడం లేదన్నాడు. అటువంటి నీకు నేనెందుకు దణ్ణం పెడతాను అని అనుకున్నావంటాడు.
రాజు కోపంగా ఆ మూటలోంచి ఓ బంగారుకాసు తీసి అతని దగ్గర విసిరి ఇప్పుడు పెడతావా నమస్కారం అంటాడు.
ఆ బంగారు కాసుని ముట్టుకోకుండా అతనంటాడు....
ఓ మూట నిండా బంగారు కాసులు పెట్టుకుని అందులో ఒకే ఒక్క కాసు నామీదకు విసిరిన నీకు నేనెందుకు దణ్ణం పెడతాననుకున్నావంటాడు.
ఆ మాటతో రాజుకు మరింత కోపం వస్తుంది. తన దగ్గరున్న బంగారు కాసుల్లో సగం అతని ముందు కుమ్మరిస్తాడు. పోనీ ఇప్పుడు చెప్తావా నాకు నమస్కారం అంటాడు రాజు.
అప్పుడతను ఓ చిన్ననవ్వు నవ్వి అంటాడిలా....
ఇప్పుడు నా దగ్గర నీదగ్గరున్నంతా ఉంది. ఇద్దరం సమానమే...అటువంటప్పుడు నీకెందుకు నేను దణ్ణం పెట్టాలి.....ఇద్దరం ఒక్కటే అంటాడతను.
ఆ మాటలతో రాజు కోపం తీవ్రరూపం దాల్చింది. తన దగ్గరున్న మిగిలిన బంగారు కాసులనూ అతనికే ఇచ్చి ఇవన్నీ నీకే...ఇప్పటికైనా చెప్తావా నమస్కారం అంటాడు రాజు.
ఇప్పుడతను నవ్వుతూ ఇప్పుడు నీ దగ్గర చిల్లిగవ్వ లేదు. నా దగ్గరేమో ఓ బంగారు కాసుల మూట ఉంది. ఇప్పుడు నువ్వే నాకు దణ్ణం పెట్టాలి అంటాడతను.
రాజుకు నోట మాట రాలేదు.
ఎంతగా ఇచ్చినా మనిషి హృదయం తృప్తి చెందదు.
.మర్యాదను ఏదో డబ్బుతో పొందాలనుకోవడం ఏ మాత్రం సరికాదు. ఒకవేళ పొందినా అందులో భక్తితోనో అణకువతోనో కూడిన మర్యాద ఉండదు.
నిజమైన ప్రేమతో చూపిన మానవత్వానికే ఎక్కడైనా ఎప్పుడైనా గౌరవం, మర్యాద లభిస్తాయి. 
అప్పుడే ఇచ్చిపుచ్చుకోవడంలోని మర్యాదకు ఓ సంస్కారం ఉంటుంది. అదే అసలైన మర్యాదవుతుంది.

కామెంట్‌లు