దిడ్డి తలుపులు మాయం!:- దోర్బల బాలశేఖర శర్మ


 


హోలీ పండుగ అనగానే నాకు నా చిన్ననాటి సంఘటనలు గుర్తుకొస్తాయి. అవి ఎంతగా నాపై ప్రభావం చూపాయంటే, రంగులాటకు దాదాపు పూర్తిగా నేను దూరమయ్యేంతగా. హోలీ, కామ దహనాల వేడుకలు అప్పట్లో (ఇప్పటికీ కొంతమేర) ఎలా పక్కదారి పట్టాయో చెప్పడానికి నా ఈ అనుభవమే ఒక ఉదాహరణ. (ఈ ఫొటోలో.. రామాయంపేటలోని మాదికాని, మా ఒకప్పటి పెరటి, ప్రస్తుత ద్వారం).

అప్పుడు నాకు పదేళ్లలోపు వయసే. అటు బాల్యానికీ, ఇటు కౌమారానికీ మధ్యలోని సున్నితమైన కాలం. ఆ రోజు తెల్లవారితే హోలీ. అంటే, రాత్రి కామ దహనం. పండుగలు, పరమార్థాల గురించి నాకు పెద్దగా తెలియని చిన్నతనం. అమ్మ పిల్లలందరికీ (నాతోపాటు అన్న, పెద్దతమ్ముడు, చెల్లె, చిన్నతమ్ముడు.. మొత్తం ఐదుగురం) దీపాలు పెట్టీ పెట్టడంతోనే (దాదాపు రాత్రి 7 గంటలకల్లా) అన్నాలు పెట్టి, కొత్త ఇంటి వరండాపై అందరికీ ఒకేచోట పక్క బట్టలు పరిచి, పెద్ద దోమతెర కట్టేది. మరో గంట, గంటన్నరలో అమ్మ కూడా పని ముగించుకొని వచ్చి మాతోపాటే నడుం వాల్చేది. దాదాపు రాత్రి 9 గంటలకల్లా అందరం గాఢ నిద్రలోకి వెళ్ళేవాళ్ళం. ఉన్నట్టుండి నాకు ఏవో మాటలు, అరుపులు వినపడుతున్నాయి. "అయ్యో... పంతులు వాళ్ళ దిడ్డి తలుపులు...." అంటున్నారెవరో. ఇదంతా నిద్రలో ఉన్న నాకు 'కలలోలా' అనిపించింది. తెల్లవారి లేచాక, తెలిసింది, రాత్రి 10- 11 గంటల వేళ మా బావి పెరటి దిడ్డి తలుపులను తీసుకెళ్లి కాముట్లో పారవేశారని! వీధిలోని పలువురు చాలాసేపు అరిచినా మేమెవరమూ లేవలేదట. అవి బాగా పాతబడి ఉన్నందున కొంతమంది యువకులు అత్యుత్సాహంతో అలా చేశారట. ఆ తర్వాత ఎన్నాళ్లపాటు పెరడు ద్వారం తలుపులు లేకుండా ఉందో నాకు గుర్తులేదు.

ఇంచుమించు ఇదే వయసులో అనుకుంటాను. ఆ రోజు ఊళ్ళో హోలీ పండుగ. రంగులు చల్లుకోవడానికి వెళతామంటే అమ్మ పాత అంగీ, లాగు తొడుక్కోమనేది. కొన్నాళ్ళు ఇలా సరదాగా వీధిలోని పిల్లలం రంగులు చల్లుకున్నాం. పగలు 12 గంటలకల్లా ఇంటి ముందుకు పెద్ద ఊరేగింపు వచ్చేది. రకరకాల రంగులు (ఎడ్లబండి కందెనతోసహా.. నలుపు, తెలుపు, ఎరుపులవి) పూసుకొని, భయంకరమైన ముఖాలతో 'హోలిక్క బౌడ, హోలల్ల బౌడ' అని గట్టిగా అరుస్తూ, అనేక మంది కొట్టడానికి వస్తున్నట్టుగా ఉరికురికి వస్తూ, కనిపించిన వాళ్లకేకాదు, ఇళ్లలో వాళ్లను పిలిచి మరీ, ఒక్కోసారి ఇళ్లలోకి దూరి కూడా, రంగులు చల్లి, ముఖాలకు పూసి, తమలో కలుపుకుంటూ వెళ్లేవారు. మేం ఇంట్లోంచే భయం భయంగా చూసేవాళ్ళం. ఆ తర్వాత హోలీ రంగులు చల్లుకోవడం అంటేనే నాకు అనాసక్తి ఏర్పడింది.

ఏదైనా, ఎవరికైనా ఇష్టపడి చేసేది సంబరం. కానీ, మన అనుమతి లేకుండా,  బలవంతాన వస్తువుల్ని ఎత్తు కెళ్లడం, ఆట పట్టించడం ఆధ్యాత్మికత, భక్తి భావన కాదన్న సంగతిని తెలియ జేయడానికే ఈ నాలుగు మాటలు.