మారిన మనిషి:--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి. మొబైల్: 9908554535.


  సర్వాపురం జమీందారు కొడుకు  పెద్ద దొంగ. కాని వాడిని దొంగ అని చెప్పడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. జమీందారుకు భయపడి అందరూ నోరు మూసుకున్నారు. జమీందారుకు ఈ సంగతి తెలియదు .

           ఒక రోజు పారుగూరి నుండి సోమయ్య మిత్రుడు  రామయ్య తన  భార్యతో సహా సోమయ్య ఇంటికి వచ్చాడు. ఆ రాత్రే రామయ్య భార్య యొక్క మెడలోని  బంగారు గొలుసు పోయింది. రామయ్య ఆ రాత్రి దొంగను చూశాడు. కానీ అతడిని పట్టుకునే లోపే దొంగ పారిపోయాడు .రామయ్య తన మిత్రుడైన సోమయ్యతో ఈ విషయం చెప్పాడు. సోమయ్య అది మా జమిందారు కొడుకు పనేనని చెప్పాడు.

        అప్పుడు రామయ్య సోమయ్యకు ఒక ఉపాయం చెప్పాడు. సోమయ్య మరునాడు జమీందారు ముందర గ్రామస్తులు అందరినీ సమావేశపరిచి అత్యంత నిజాయితీపరునిగా తమ జమీందారు కొడుకును సన్మానిద్దామని  అన్నాడు. జమీందారు ముందర ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. వెంటనే సోమయ్య జమీందారు కొడుకుని పిలిచి గొప్పగా సన్మానించాడు. 

         సన్మానం తర్వాత ఇంటికి వెళ్ళిన సోమయ్యకు రామయ్య భార్య యొక్క బంగారు గొలుసు అతని ఇంట్లోనే కనిపించింది. వెంటనే రామయ్యను పిలిచి ఈ సంగతిని చెప్పాడు. తన పథకం పారినందుకు రామయ్య ఎంతో సంతోషపడ్డాడు.