గుట్టు:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

కాకమ్మా కాకమ్మా
కబురులు ఏంటమ్మా
ముచ్చటలూ మాకింకా
ముచ్చటగా చెప్పమ్మా!

నీవు కూసిన ఇంట
చుట్టాలే వస్తారట
నీకెట్లా తెలుసునట?
ఆకబురూ చెప్పమ్మా
గుట్టంతా విప్పమ్మా!

ఆ ఇంటిమీది కాకి
ఈ ఇంటిమీద వాలొద్దని
అంటారు కొందరు
కారణమూ ఏమిటో మరి?
కాస్తంతా చెప్పమ్మా
గుట్టంతా విప్పమ్మా!

నల్లగున్నావని నిన్ను
తమ ఇంటికి రావొద్దని
అన్నవారే తిరిగి
కాకిపిండం ఆరగించుమని
పిలిచి పిలిచి మరీ అడుగుతారే
ఏమిటో ఈ మనుషులు
కాస్తంతా చెప్పమ్మా
గుట్టంతా విప్పమ్మా!

ఊరిని శుభ్రంచేసే
స్వఛ్ఛభారత్ కోసం
బ్రాండ్ అంబాసిడరువు
నువ్వు అవునా కాదా?
ఆ ముచ్చట చెప్పమ్మా
గుట్టంతా విప్పమ్మా!!!

కామెంట్‌లు