అన్నదమ్ములు: - ఎం. బిందు మాధవి

 "ఈ ఎండాకులు ఊడవలేక సస్తన్నానమ్మా! సెట్టు ఆరిదయితే, ఎండాకులు, సెత్త మనదా" అని చీపురుతో సమానంగా నోటితో కూడా ఝాడిస్తున్నది, దొడ్డి బాగు చేస్తున్న మంగి.

"చూస్తూ ఉంటే మేస్తూ పోయిందని" మనం ఎంత అరిచినా చీమ కుట్టినట్టుండదు ఆ లలితమ్మకి! ఏటా నాలుగైదు వందల కాయలు కాస్తుంది చెట్టు. వాళ్ళ వాళ్ళందరికీ పంపిస్తుంది కానీ, అయ్యో 'అక్కయ్యా ఈ ఏడు మా చెట్టు కాయలతోనే మీరు ఆవకాయ, మాగాయలు పెట్టుకోండి ' అనంటుందేమో అని చూస్తా! ఊహు( అసలు చేతులు రాందే! మహ దొడ్డ ఇల్లాలే" అని "పోనీలేవే ఇవ్వళ్టికి ఊడ్చెయ్యి. రేపు చెట్లు కొట్టే వాడిని పిలిచి మన దొడ్లోకి వచ్చిన కొమ్మల్ని శుభ్రంగా నరికించి పారేస్తా, అప్పటికి కానీ తిక్క కుదరదు" అన్నది లీల.
గోడ మీద నించి వాళ్ళకి వినపడాలని గట్టిగా అరుస్తున్న లీల-మంగిల సంభాషణ విన్న లలితమ్మ మరింత గట్టిగా " ఆ( ఎవరెరగని భాగోతం! మొన్న పొద్దున్నే, ఇంకా తెల్లారకుండానే, వాళ్ళ మనిషిని చెట్టెక్కించి వాళ్ళవైపు కాచిన కాయలన్నీ కోయించిన సంగతి నాకు తెలియదనుకుంటున్నది. నేనేనా అంత చేతులు ముడుచుకు కూర్చుంది? కొమ్మలు నరికించనీ చూస్తా ఈవిడ సంగతి. ఏదో పెద్దావిడ అని చూస్తున్నా" అని అటు నించీ మరింత మసాలా దట్టించి నాలుగూ దులిపి పారేస్తున్నది లలిత.
"అన్నయ్యా, వీళ్ళ మూలాన మనకి మనశ్శాంతి లేకుండా పోతున్నది, ఏం చేద్దాం" అన్నాడు మధు అన్నయ్య వాసుతో.
"వాళ్ళే పోట్లాడుకుంటారు, మళ్ళీ వాళ్ళే గోడ దగ్గర నుంచుని తమ పిల్లల ప్రతిభా పాటవాల గురించి ఒకరితో ఒకరు గొప్పలు కురిపించేస్తుంటారు. మనం వినీ విననట్టు, చూసీ చూడనట్టు ఉంటేనే మంచిది" అన్నాడు వాసు.
*******
వాసు, మధు అన్నదమ్ములు. తల్లిదండ్రులు ఇచ్చిన స్థలంలో పక్క పక్కన ఇళ్ళు కట్టుకున్నారు. మౌలికంగా వారిద్దరి మధ్య తగాదాల్లేవు.
చదువులు చెప్పించటంలో, ఆస్థుల పంపకాల్లో తల్లిదండ్రులు ఆ అవకాశం ఇవ్వలేదు. పినతల్లి, పెత్తల్లి పిల్లలు తోటి కోడళ్ళయితే అన్నదమ్ముల మధ్య పొరపొచ్చాలు రాకుండా కలిసి మెలిసి ఉంటారని లీలని, లలితని కోడళ్ళుగా తెచ్చుకున్నారు.
అత్తమామలు ఉన్నంత కాలం అందరూ అన్యోన్యంగానే ఉన్నారు.
పిల్లలు పుట్టి, పెద్దవాళ్ళయ్యాక క్రమేణా తల్లుల మధ్యలో చిన్న చిన్న చిలిపి తగాదాలు మొదలయి, అవి నెమ్మదిగా వేళ్ళూనుకోవటం మొదలయింది.
******
ఇలా దాని మీద పెట్టి, దీని మీద పెట్టి రాజుకుంటున్న మాటల యుద్ధాల్లోకి భర్తలని కూడా లాగి, తమ ఆధిక్యతని చూపించుకుంటూ ఇంకో మెట్టు పైకెక్కారు.
"మీరు మీ తమ్ముడి మీద కేసు పెడతారా లేదా? మా మేన మామ కొడుకు రామ్మూర్తి రేపు పని మీద మనింటికి వస్తున్నాడు. వాడు హై కోర్టులో ప్రాక్టీసు చేస్తున్నాడు. మంచి పేరు కూడా ఉన్నది. వాడు కేసు తీసుకుంటే ఓడిపోవటమంటూ ఉండదు. వాడికి విషయమంతా చెప్పి, కోర్టులో దావా వెయ్యమంటాను" అన్నది లీల.
"అతను లలితకి కూడా మేన మామ కొడుకే కదా! నీ తరఫున వాదించి నీకు న్యాయం చేస్తాడని నమ్మకమేమిటి? అయినా ఇంత చిన్న విషయానికి కోర్టుల దాకా ఎందుకే" అన్నాడు వాసు.
"అయితే మీకు తెలిసిన లాయర్ ప్రభాకర్ ఉన్నాడు కదా! అతనితో కింది కోర్టులోనే ఒక వకాలత్ ఫైల్ చేయించండి" అన్నది పంతంగా.
మరునాడు ఉదయం వాసు ప్రభాకర్ ని కలిసి విషయం అంతా చెప్పి, "కేసు ఫైల్ చేసే దాకా ఊరుకునేట్లు లేదండి మాయావిడ. ఇంటి పోరు భరించలేకుండా ఉన్నాను, మీరే ఏదో దారి చూపించాలి" అన్నాడు.
ఎండన పడి వచ్చిన వాసు చెప్పిన విషయం అంతా విన్న లాయర్ ప్రభాకర్, అన్నదమ్ములుగా వాసు మధుల మధ్య ఉన్న ఆత్మీయత తెలుసుకుని, వాసుకి అతిధి మర్యాదలు చేసి "ఎందుకొచ్చిన గొడవండీ! ఇలాంటి వాటికి కోర్టులకెళితే ఓ పట్టాన తెమలవు. హాయిగా కాయలు కోయించి ఇద్దరూ చెరి సగం తీసుకుంటే సరిపోతుంది కదా! ఈ మాత్రానికి కోర్ట్ ఫీజులు, నోటీసులు అవసరమా" అన్నాడు.
అప్పుడే అటుగా వచ్చిన కామేశ్వరమ్మ గారు " ఇదిగో నాయనా పెద్ద దాన్ని చెబుతున్నా విను. రామాయణంలో రామ రావణ యుద్ధ సమయంలో రావణుడు వేసిన "శక్తి" అస్త్రానికి మూర్ఛపోయిన లక్ష్మణుడిని చూసి దు:ఖం ఆపుకోలేకపోయిన రాముడు
"దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా:
తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదర:"
[ప్రతి దేశంలోను భార్యలు దొరుకుతారు. ప్రతి దేశంలోను బంధువులు దొరుకుతారు. కానీ సహోదరుడయిన భ్రాత లభించు దేశమేదీ కనబడదు.]
అని రాముడు దీనంగా విలపిస్తాడు. ఏ సీతా దేవి జాడ కనిపించక కంటికి మంటికి ఏక ధారగా రోదించి, వానరుల సహాయంతో, సముద్రం మీద వారధి కట్టి లంక మీద యుద్ధానికి వచ్చి, ఎంతో మంది మిత్రులని, వీరులని యుద్ధంలో రాముడు పోగొట్టుకున్నాడో, ఆ సీత కంటే కూడా ప్రియ సోదరుడయిన లక్ష్మణుడే తనకి ముఖ్యమని చెప్పటాన్ని బట్టి, అన్నదమ్ములు ఎలా ఉండాలో మనం రోజూ మాట్లాడుకునే, పూజించే రామాయణం చెబుతున్నది.
భౌతికమైన చెట్టు చేమల కోసం, క్షణికమైన ఆవేశానికి పోయి అన్నదమ్ములిద్దరూ గొడవ పడకండి. మా అబ్బాయి చెప్పినట్టు, నువ్వే కాయలు కోయించి తమ్ముడిని, మరదలిని ఇంటికి పిలిచి వాళ్ళ చేతిలో పెట్టు. కోపతాపాలు అవే సర్దుకుంటాయి. పని మనుషులకోసం రక్త సంబంధాలు చెడగొట్టుకోకండి. నువ్వే ఆ పనిమనిషిని పక్కకి పిలిచి, మీ ఆవిడకి తెలియకుండా దాని చేతిలో పది రూపాయలు పెట్టి ఎండాకులు ఏరించెయ్యి. ఇదో పెద్ద విషయమా" అన్నారు.
బ్రహ్మోపదేశం అయిన జ్ఞాని లాగా వాసు " అంతేలేమ్మా, అట్లాగే చేస్తానని కామేశ్వరమ్మగారికి నమస్కరించి ఇంటి దారి పట్టాడు.