ఇక ఇక---బెక బెక.:-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్.

మెడలో వేలాడుతున్న తప్పెటపై దరువువేస్తు అడవి అంతా తిరుగుతున్న కోతిబావ 'ఇందుమూలంగా తెలియజేయడమేమనగా! మన అడవిలో రాజవైద్యులు నక్కమామ గారు వయసుపైనపడటంతో తన పదవినుండి తప్పుకోబోతున్నారు. కనుక ఖాళీ అవుతున్న రాజవైద్యపదవికి రేపు ఉదయం మూరెడు ఎండఎక్కిన అనంతరం ఎంపిక జరగబోతుంది. ఉత్సాహము, బాగావైద్యము తెలిసినవారు రాజవైద్య పదవి ఎంపికలో పాల్గొనవచ్చునహొ 'అని దండోరా వేయసాగాడు.
మరుదినం రాజవైద్యపదవికి మూడు యువ వైద్యనక్కలు వచ్చాయి.
'నాయనలారా రాజుగారికి ఉదయం నిద్రలేచినప్పటినుండి విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారు.మీరుముందుగా రాజుగారికి వైద్యంచేయండి'అన్నాడు పాతరాజవైద్యుడు.
మొదటి నక్క రాజుగారి చెవికింద భాగాన నాడి పట్టుకు పరిక్షించి కళ్ళు,నాలుకా చూసి 'ఇది ఇక ఇక అనేవ్యాధి,తెల్లజిల్లేడు ఆకు నిప్పులపై వేడిచేసి నుదుటిపైవేసి కట్టుకడితే చాలు తలనొప్పి తగ్గిపోతుంది' అన్నాడు.
రెండో నక్కకూడా సింహా రాజుగారిని పరిక్షించి 'ఇది బెక బెక అనేవ్యాధి.కరక్కాయను నీటిచుక్కలు చల్లుతూ అరగదీసి ఆరసాన్ని తేనెలో కలిపి తీసుకుంటే తగ్గిపోతుంది'అన్నాడు.
మూడవనక్క రాజుగారికి వద్దకువెళ్ళి'ప్రభూవులకు విశ్రాంతి కావాలి. తమకు నచ్చిన పదార్ధాలతో కడుపునిండుగా భోజనం చేసి, గాలిబాగావీచే ప్రదేశంలో హాయిగా నిద్రపొండి. తమరు నిద్రలేచేసరికి తలనోప్పి ఉండదు'అన్నాడు.
'అదేమిటి వ్యాధిగ్రస్తులను పరిక్షించకుండానే మందు వేయకుండానే ఎలాతగ్గుతుంది'అన్నాడు పాత రాజ వైద్యుడు.
' అయ్య తమకు తెలియనిదికాదు రోగి ప్రాధమిక లక్షణాలు తీసుకునే మనం వ్యాధి నిర్ధాణచేయాలి. ఇది ఇక ఇక -బెకబెక కాదు.అసలు తలనొప్పి వ్యాధికాదు.అది ఆప్రాణికి అలసిఉన్నావు విశ్రాంతి అవసరం అనే హెచ్చరిక మాత్రమేఆతలనొప్పి! ప్రతిప్రాణి తమస్ధాయి పనులలో మానసిక వత్తిడికి లోనౌతారు.అప్పుడు ఇలాంటి హెచ్చరికలు వారి శరీరం తెలియజేస్తుంది. అంతే భయపడనవసరం లేదు.ఏదైనా వ్యాధి సోకినవారు వైద్యుడు లేక వైద్యసిబ్బంది పరివేక్షణలో ఉండాలి.సింహరాజు గారు తమనిద్రలో ఏదైనా కలవరింత చెందుతారేమో,లేదంటే మరేదైనా జ్వరంవంటివి వస్తే తలకు జ్వరం ఎక్కకుండా వారి నుదిటిపై చల్లటినీటిలో తడిపిన వస్త్రం వేయాలి,చన్నిటితొ శరీరం అంతాతుడవాలి.కనుక వారు నిద్రలేచేవరకు పరివేక్షకుడిగా ఇక్కడే ఉండటం వైద్యుడిగా నాబాధ్యత' అన్నాడుమూడవనక్క.
నవ్వుతూ లేచిన సింహరాజు ' నక్కగారు నిజంగా నాకు తలనోప్పిలేదు. మీరోగానికి ప్రాధమిక దశ పరిశీలన, వైద్యవిధానం,ఆలోచించేతీరు అమోఘం  వైద్యపదవికి మిమ్మలను ఎంపిక చేస్తున్నాం' అన్నాడు.తృప్తిగా తల ఆడించాడు పాత రాజవైద్యుడు.