నేను, నాదీ అనేదే మరచిపోయిన శిష్యుడు:-- యామిజాల జగదీశ్

 ఆయన ఓ ఆశ్రమ గురువు. ఆయన వద్దకు ఓ నలుగురు యువకులు వచ్చి తమను శిష్యులుగా పరిగణించమని విన్నవించుకున్నారు. గురువు సరేనంటూ "మీరు మీ మీ ఇళ్ళకు వెళ్ళి ఒక్కో చెంబు తీసుకురండి. ఆ చెంబు తప్ప ఆశ్రమంలో మిగిలినవన్నీ ఉపయోగించుకోవచ్చు" అన్నారు. 
నలుగురూ యువకులూ తమ తమ ఇళ్ళకు వెళ్ళో తలో చెంబు తెచ్చుకున్నారు. 
రోజులు గడుస్తున్నాయి. 
గురువుగారిపై వయోభారం పడటంతో ఆశ్రమానికి తన తదనంతరం ఓ గురువుని నియమించాలనుకున్నారు. నలుగురినీ సమావేశపరచి మీకు కావలసినవన్నీ నేర్పాను. నాకిక ఓపిక లేదు. కనుక మీకో చిన్నపాటి పరీక్ష పెడుతున్నాను. అందులో ఎవరు నెగ్గితే వారే ఈ ఆశ్రమానికి గురువవుతారు అన్నారు.
అలాగేనన్నారు నలుగురు శిష్యులు.
మీరిక్కడికి వస్తున్నప్పుడు ఒక్కో చెంబు తీసుకొచ్చారు కదా. అది తీసుకురండి అన్నారు గురువుగారు. 
నలుగురిలో ముగ్గురు మాత్రం వెంటనే లోపలకు వెళ్ళి ఎంతో పదిలంగా దాచుకున్న తమతమ చెంబులను తీసుకొచ్చి గురువుగారికి ఇచ్చారు. 
ఒకడు మాత్రం గురువుగారి ఎదుటే నిల్చున్నాడు.
"నీ చెంబు ఏదీ" అడిగారు గురువు.
అప్పుడు అతను "గురువుగారూ మన్నించండి. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో ఆ క్షణమే నేనూ నాదీ అనే విషయాన్ని మరచిపోయాను. నా ఇల్లు, నా వస్తువు అని వేటిని చెప్పుకోగలను. ఇక్కడివి ఏదైనా అందరిదీ అనే భావమే నాకే ఏర్పడింది. కనుక నా చెంబు అనేది ఇంకెక్కడ" అన్నాడు.
అప్పుడు గురువు అతనినే ఆశ్రమానికి తదుపరి గురువుగా నియమించారు.