మాట తీరే ఓ ఔషధం!:-- యామిజాల జగదీశ్

 మాటతో సగం తగ్గిపోతుంది అనగానే "ఏం తగ్గిపోతుం"దనేగా మీ ప్రశ్న. 
వస్తున్నా విషయానికి.... 
ఇటీవల మా ఆవిడకి ఆరోగ్యం బాగులేక ఓ ఆయుర్వేద వైద్యుడి దగ్గరకు వెళ్ళాం. ఆయన బాగా పరిచయస్తుడే. మొదట్లో రీజనబుల్ రేట్స్ తో మందులిస్తూ ఉండేవారు. కానీ గత ఏడాది కరోనా మొదలైనప్పటి నుంచి ఆయన మందుల ధరను పెంచేసారు. అయినా అలాగే రెండు నెలలకోసారి వెళ్ళొస్తుండేవాళ్ళం. తర్వాత కొంత కాలం మానేసాం. మరొక సమస్య రావడంతో ఓ రెండు నెలల క్రితం వెళ్ళినప్పుడు కొన్ని రకాల మందులిచ్చి వేలల్లో డబ్బులు తీసుకున్నారు. 
ఇక లాభం లేదనుకుని మా ఇంటి పరిసరాలలోనే ఉన్న హోమియోపతి వైద్యుడి దగ్గరకు వెళ్ళాం. మేము వెళ్ళేసరికి ఆయన ఒక్కడే ఉన్నాడు. తను సమస్య చెప్పుకుంటే ఆయన అడగాల్సినవి అడిగాడు. తను చెప్పింది. పది రోజులకు సరిపడా రెండు రకాల మందులు, ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు. అయిదు వందలు తీసుకున్నారు. మరుసటిరోజు నుంచీ ఆయన ఇచ్చిన మందులు వేసుకోవడం మొదలుపెట్టింది తను. అయితే రెండో రోజే మరో కొత్త సమస్య రావడంతో ఉండలేక తను ఫోన్ చేసింది. అయితే అసలేమాత్రం గుర్తులేదన్నట్లుగా మాట్లాడి వస్తే చూద్దాం అని ఒకింత దురుసుగా మాట్లాడాడట. దాంతో మా ఆవిడ మరెవరినైనా చూద్దాం అనగానే నాకు తెలిసిన ఓ హోమియో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాను. నిజానికి నాకాయనతో పెద్దగా పరిచయం లేదు. ఒక్కసారే మాట్లాడాను. అదెలాగంటే కొంతకాలం క్రితం నేనొక డ్రై ఫ్రూట్స్ అమ్మే షాపులో పని చేసాను. ఆ షాప్ కా పక్కనే ఈ డాక్టర్ క్లినిక్ ఉంది. ఓరోజు బాదం పప్పులు కొనడానికి వచ్చినప్పుడు మా ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. ఆయన వద్దకు వచ్చే పేషంట్లు కొందరితో మాట్లాడి ఆయన ఎలా వైద్యం చేస్తాడని అడిగాను. అందరూ చాలా పాజిటివ్ గా మాట్లాడారు. పేషంటుకి రిలీఫ్ ఇచ్చే విధంగా వైద్యం చేస్తాడండి అన్నారు. 
ఆ మాట నా మనసులో బలంగా నాటుకుపోవడంతో మా ఆవిడను తీసుకెళ్ళాను. మేం వెళ్ళేసరికి క్లినిక్ లో ఆయన ఒక్కరే ఉన్నారు. అన్నట్టు ఆయన పేరు చెప్పలేదు కదూ....ఆయన పేరు ప్రదీప్. 
మమ్మల్ని చూడగానే కూర్చోమని చెప్పి మా ఆవిడని సమస్య చెప్పమంటే తను చెప్పసాగింది. ఆయన అంతా విన్న తర్వాత తల్లీ అని, అమ్మా అని పలకరిస్తూ ఆయన ధోరణిలో కొన్ని ప్రశ్నలు వేసి మా ఆవిడ నోటంట సమస్యేమిటో రాబట్టసాగారు. అయితే ఆయన వేసే ప్రశ్నలు ఎంత మృదువుగా ఉన్నాయో చెప్పలేను. ఎంత మధురంగా ఉన్నాయో మాటల్లో చెప్పలేను. శ్వాసకు సంబంధించిన సమస్యలు ఎలా తలెత్తుతాయోనని ఓ పాఠం చెప్పినట్లుగా విడమరచి చెప్పిన తీరు మమ్మల్నెంతగానో ఆకట్టుకుంది. ఓ శ్రేయోభిలాషిలా మాట్లాడారు. డాక్టరుని దేవుడిగా పరిగణించేగా పేషంట్లు వెళ్ళేది. అయితే ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తన దగ్గరకొచ్చేవారికి ముందుగా ఉపశమనం కలిగించడం ఎలా అని ఆలోచించి అందుకవసరమైన మందులతో చికిత్స మొదలుపెడతానని, డబ్బులతో మనుషులను చూడనని చెప్పారు. మూడు సమస్యలూ పరిష్కరిస్తానని, అయితే ఒకటి తగ్గాక మరొకటిగా చికిత్స చేస్తానని, కొంత కాలం మందుల వాడకం తప్పదని వివరంగా చెప్పారు. ఆయన మాటల మధ్యలో ఆయన తల్లీ అనడం అమ్మా అనడం ఎంతో ఆనందంగా అనిపించింది. మధ్యలో ఆయనకో ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్లో అవతలి పేషంట్ తోనూ అమ్మా అనే మాట్లాడటం విని "ఈయన అందరితోనూ ఇలాగే మాట్లాడుతారు" అని అనుకున్నాను. మాటలన్నీ ఆయ్యాక ఓ నాలుగు రకాల మందులిచ్చారు. అవి ఎలా వాడాలో విడమరచి చెప్పారు. ఏ మందులిచ్చారో రాసిచ్చారు. 
అంతకుముందు మేము ఓ డాక్టర్ దగ్గరకు వెళ్ళామన్నాం కదా. ఆ డాక్టర్ ఏం మందులిచ్చారో చెప్పండని అడిగారు. ఆయన మాకు చీటీ ఏదీ ఇవ్వలేదనగానే "అదేంటీ, ఆయన రాసివ్వాలిగా. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లోనే ఓ నిబంధన ఉంది. డాక్టర్ తప్పనిసరిగా చీటీ రాసివ్వాలి" అన్నారు డాక్టర్ ప్రదీప్. సరే అదలా ఉంచండి అంటూ తను ఇచ్చిన మందులను ఎలా వేసుకోవాలో మరోసారి వివరించి ఓ నాలుగైదు రోజుల తర్వాత కలవండి అన్నారు. ఒకవేళ రావడానికి వీలులేకుంటే ఫోన్ చేసి చెప్పినా చాలన్నారు. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ లో మాట్లాడనని, మరెప్పుడైనాసరే నిర్మొహమాటంగా కాల్ చేయవచ్చని చెప్పారు. నమ్మకంతో మందులు వేసుకో తల్లీ అన్నారు.
అనంతరం ఆయనకు థాంక్స్ చెప్పి క్లినిక్కులోంచి బయటికొచ్చాం. 
బయటకు రావడంతోనే తను "ఎంత చక్కగా మాట్లాడారో కదా? ఆయన మాటలతోనే సగం ఉపశమనం కలిగినట్టుంది. మనసుకెంతో హాయిగా ఉంది" అని చెప్పింది. అప్పుడనుకున్నా "ఏ పేషంటుకైనా డాక్టర్ మాట తీరే ఓ ఔషధమని, ఆయన ఇచ్చే మందులు రెండోదేనని!"


కామెంట్‌లు