ఆంగ్లదేవతా' జోహార్ ' నీకు.నువ్వు భారతావని మీద కాలు
మోపి నప్పటినుంచీ ఈ పవిత్ర భూమి రూపురేఖలు మారిపోయాయి.
వేష భాష ఆహార వ్యవహారాల్లో విపరీత ధోరణులొచ్చాయి.
నువ్వు ఈ పుణ్య వేదభూమికి కొన్ని మేళ్లు చేసినా , నష్టాలే
అధికంగా సంభవించాయి.
యువత నూతన పోకడలతో ఈ దేశ సంస్కృతి, సంప్రదాయాల్లో పెనుమార్పు లొచ్చాయి. నాగరిక పేరుతో వేష
భాష నడక అన్నీ మారిపోయాయి.పాశ్చాత్య పోకడలు
ప్రారంభమయాయి.
దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు తెలుగు గడ్డ మీద
కూడా విపరీత ధోరణులు ప్రారంభమయాయి.పుట్టిన పిల్లల
పేర్లు, వారి తిండి , ధరించే బట్టల్లో అంతా ఆధునికతే కనబడుతోంది.
ఆడుకునే పసివయసులో మూడు సంవత్సరాల నుంచే
నర్సరీ , ఎల్ కెజి , సీనియర్ కేజి చదువులు వచ్చి తెలుగు
అక్షరాలు అ ఆ ఇ ఈ ల బదులుగా ఎబిసిడి ఆంగ్ల అక్షరాలు
వచ్చాయి. అమ్మానాన్నలు బదులు మమ్మీ డాడీలు వచ్చారు.
ఆప్యాయంగా అత్త, మామయ్యలు మారి ఆంటీ అంకుల్ అయారు.
తిండి విషయంలో మజ్జిగ ,తర్వాణి రూపురేఖలు మారి
బూస్టు హార్లిక్స్ తర్వాత కాఫీ , టీ లు , కూల్ డ్రింక్స్ , హాట్
డ్రింక్స్ వచ్చాయి.ఇడ్లీ, వడ, దోశ బదులు పిజ్జ , బర్గర్ , సాండ్
విచ్ , ఐస్ క్రీములు చోటు చేసుకున్నాయి.
పల్లె గ్రామాల్లో కూడా ఆంగ్ల మాధ్యమ చదువులు మొదలై కాన్వెంట్ స్కూల్ బస్సులు ఇళ్ల ముందుకు వస్తున్నాయి.
రైతు కూలీజనం సహితం ప్రభుత్వ పాఠశాలలు కాదని తమ
పిల్లల్ని ఆంగ్ల మాధ్యమ చదువులకే ప్రాధాన్య మిస్తున్నారు.
ఆంగ్ల భాషలో మాట్లాడే పిల్లల్ని చూసి మురిసిపోతున్నారు.
ఇంట్లోని కుటుంబ సబ్యులు అమ్మ భాష వదిలి ఆంగ్ల భాషలోనే
తమ పిల్లలతో సంభాషణలు జరిపి ఆనందిస్తున్నారు.
చదువుకున్న యువత ఉపాధి పొందాలంటే ఆంగ్లమే ప్రాధాన్యత సంతరించుకుంది.ఇలాంటి ఎన్నో దృష్టాంతరాలు
అనేకం.
ఒకప్పుడు బాలల మనోరంజకానికి కథల పుస్తకాలు చందమామ, బాలమిత్ర , బుజ్జాయి వంటి బాల సాహిత్య
మాస పత్రికలుండేవి. ఇప్పటి ఆంగ్లమాధ్యమ పిల్లలకు
మాతృభాష చదవడం తెలియక బాలల పుస్తకాల్లో రంగుల
బొమ్మలు చూడటానికి పరిమిత మయారు. వారికి ఆంగ్లంలో
వచ్చే కామిక్స్ , కార్టూన్ బుక్సే గతి.
ఇంట్లో వయసు మళ్లిన పెద్దలు చదువుకుంటున్న పిల్లల్ని
పిలిచి గ్లాసుతో నీళ్లు తెమ్మంటే అర్థం కాదు. అదేమాట
ఆంగ్లంలో " బ్రింగ్ గ్లాస్ ఆఫ్ వాటర్"అంటే పరుగులు పెడతారు.
ఎవరైనా నీ మాతృభాష ఏదంటే ముద్దుగా 'తెలుగు'అంటారు.
వాడుక భాష మాత్రం ఆంగ్లం ఉంటుంది. 'అమ్మ -నాన్న' మాటల్ని
తెలుగులో రాయమంటే కళ్లు ఎళ్ల బెడతారు. ఇదీ ప్రస్తుత
అమ్మ భాష తీరు.
సుమతీ శతకం , వేమన శతకం , భాస్కర శతకం , పెద్దబాల
శిక్ష, ఎక్కాల పుస్తకాలు మూలన పడ్డాయి. గ్రామీణ సంప్రదాయ
ఆటలు కబడ్డీ, ఖోఖో , కోతికొమ్మచ్చి, తొక్కుడు బిళ్ల , గుడు
గుడు గుంజం , చెమ్మచెక్క చేరడేసి మొగ్గ ఆటలు పోయి విదేశీ
క్రీడలు క్రికెట్, హాకీ , టెన్నీస్ , షటిల్ , గోల్ఫ్ వంటి ఆటలకు
ప్రాధాన్యత పెరిగింది.
తెలుగు సంవత్సర వేడుకల స్థానంలో ఆంగ్ల సంవత్సర
ఆడంబరాలు అధికమయాయి. ప్రాంతీయ సంప్రదాయ
వస్త్రధారణ పంచలు , ధోవతులు , కమీజు పైజమాలు, చీరలు,
లంగా పరికిణీలు మారిపోయి ప్రత్యామ్యాయంగా ప్యాంట్లు , జీన్స్ , టి షర్టులు , సూట్లు , స్కర్టులు ప్రత్యక్ష మయాయి.
శాస్త్రీయ సంగీతం మరుగున పడి పాప్ , జాజ్ వంటి పాశ్చాత్య సంగీతం , ప్రాచీన భారత నాట్యకళలైన భతరనాట్యం, ఒడిస్సీ ,కథక్ , మణిపురి మరిచి రాకెన్ రోల్ ,
బ్రేక్ ,జుంబాక్లబ్ డ్యాన్సులు ప్రచారాని కొచ్చాయి.
ప్రాచీన ఇతిహాసాలు రామాయణ, మహాభారతం , భాగవత
గ్రంథాలు తెలుగు సాహిత్య కారులు , వాగ్గేయ కారులు , సంగీత
విధ్వాంసుల జీవిత చరిత్రలు కొందరు మహనీయుల కృషి
ఫలితంగా కనుమరుగై పోకుండా మిగిలి ఉన్నాయి.
విదేశీ చదువులు , ఉధ్యోగాల వ్యామోహంతో మాతృ దేశాన్ని,
ముసలి తల్లిదండ్రుల్ని వదిలి పరాయి దేశాల్లో స్థిరపడుతున్నారు.వృద్ధులైన అమ్మానాన్నల్ని వృద్ధాశ్రమాలకు
అప్పచెబుతున్నారు. వారి అంత్య క్రియలకు కూడా హాజరు
కాలేకపోతున్నారు.
ఇదంతా నాగరిక ఆధునిక పోకడల పలితమే.అంతర్జాల
ప్రభావం నేటి యువతను పెడదారులు పట్టిస్తోంది. సాయంకాలమో రాత్రప్పుడు వాకిట్లో మంచాల మీద అమ్మమ్మలు , నాయనమ్మలు పిల్లల్ని పక్కన కూర్చో పెట్టుకుని
పేదరాసి పెద్దమ్మ చందమామ కథలూ చెబుతుంటే ' ఉ' కొట్టి
వినేవారు.
నేడు టీ.వీ ల్లో వస్తున్న కార్టూన్ సినిమాలు , వీడియో గేములు , మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు.పిల్లల చదువులు కూడా అంతర్జాలంలోనే కొనసాగుతున్నాయి.
కొందరు తెలుగు బాల సాహిత్యాభి మానులు పిల్లల కోసం
కథలు , గేయాలు , కవితల రచనలు చేస్తుంటే ఇంగ్లీష్ చదువుల
రోజుల్లో మీరు రాసే తెలుగు పుస్తకాలు ఎవరు చదువుతారని
హేళనగా మాట్లాడుతున్నారు.
ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తెలుగు అమ్మభాషగానే
మిగిలిపోతుందేమో? తెలుగు సంస్కృతి, సంప్రదాయం, సంగీత
సాహిత్యాభివృద్దికి ప్రతి ఒక్కరు కృషి చేస్తే తేనెలొలుకు తెలుగు
భాషకి వెలుగు సిద్దిస్తుంది.
మధురాతి మధురం మన మాతృభాష అనే భావన మనందరి
మదిలో మెదలాలి. అప్పుడే మాతృభాషకు మహర్దశ పడుతుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి