నిజాయితీ గెలిచింది (కథ)-సరికొండ శ్రీనివాసరాజు


 ధనంజయ కొత్తగా దానిమ్మ తోట పెట్టాడు. అతని కృషి వల్ల దానిమ్మ తోట విరగ కాసింది. తోటలోని కాయలను అమ్ముకొని రావాలి. ఎవరు ఎక్కువ లాభాలకు అమ్ముకొని వస్తే వారిని తన తోటపనికి మరియు ఆ కాయలు అమ్ముకొని వచ్చే పనికి నియమిస్తానని ప్రకటించాడు. ఇది విని రంగయ్య అనే వ్యక్తి ముందుకు వచ్చాడు. ధనంజయ రంగకు య500 పళ్ళు 10వేల రూపాయలకు అమ్మాడు. వాటిని అమ్ముకుని రమ్మన్నాడు. రంగయ్య ఒక్కోపండుకు నలభై రూపాయల ధర చెప్పాడు. తగ్గించమని బేరం చేస్తే అవి ఇక్కడ ఎక్కడా దొరికే దానిమ్మలు కావని, ఒక ప్రముఖ ప్రాంతం పేరు చెప్పి, అక్కడ నుంచి తెప్పించామని, మిగతా ప్రాంతాల దానిమ్మల కంటే తమ దానిమ్మలు ఎక్కువ బలాన్ని ఇస్తాయని చెప్పి జనాల్ని బుట్టలో వేసి అమ్ముకొని వచ్చాడు. 


       రమణయ్య అనే మరొక వ్యక్తి వచ్చాడు. అతడు ధనంజయ ఇచ్చిన 500 దానిమ్మలను తీసుకు వెళ్ళాడు. అతడు కాయకు 50 రూపాయలు చెప్పాడు. వామ్మో! ఇంత ధరనా? తగ్గించమని అడిగిన వారితో " నీ ఇష్టం ఉంటే కొను. లేకపోతే వెళ్ళి మరో చోట కొనుక్కో" అని తల బిరుసుగా మాట్లాడాడు. చాలామంది కొనకుండానే వెళ్ళిపోయారు. గోపాల్ అనే మరో వ్యక్తి ధనంజయ ఇచ్చిన 500 దానిమ్మలను తీసుకు వెళ్ళాడు. ఇతడు కూడా తీయని మాటలు చెబుతూ మరింత ఎక్కువ ధరకు అమ్మసాగాడు. బాగా బేరం చేసిన వారికి వారు అడిగినట్లే ధర తగ్గించి పాడై పోయిన పళ్ళను కలిపి అమ్మాడు. తన తెలివితేటలను ధనంజయకు చెప్పుకున్నాడు. 

       శివయ్య అనే మరో వ్యక్తి రంగయ్య ఇచ్చిన పళ్ళను తీసుకుని వెళ్ళి పండుకు మరీ ఎక్కువ ఆశపడక న్యాయమైన లాభానికి పళ్ళను అమ్మినాడు. ఎవరైనా బేరం చేయబోతే తనకు ఎక్కువ చెప్పి, తగ్గించడం చేతకాదని, న్యాయమైన ధర ఇదని వినయంగా చెప్పడమే గాక తను చెప్పిన ధరకే నాణ్యమైన పళ్ళను అమ్మినాడు. పైగా ఆ దానిమ్మలు ఆరోగ్యానికి ఎలా దోహదం చేస్తాయో వివరిస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ అమ్మినాడు. అతని మాటతీరుకే చాలామంది అతని దగ్గర దానిమ్మలను కొన్నారు. ఇవన్నీ రహస్యంగా గమనించిన ధనంజయ మోసకారులను, దురుసు స్వభావం కలవారిని పక్కన పెట్టి, నిజాయితీ, మంచి మనసు గల శివయ్యను తోటమాలిగా నియమించాడు.