ఓ యువకుడి జీవితాన్ని మార్చిన ఆరోజు రాత్రి!:-- యామిజాల జగదీశ్

 అది అమెరికా నుంచి ఇంగ్లండ్ వెళ్తున్న నౌక. ఆ నౌకలో ప్రయాణిస్తున్న వారిలో ఓ డాక్టర్ ఉన్నారు. కానీ తాను డాక్టరని ఆయన ఎవరికీ చెప్పుకోలేదు. ఓ పక్కన కూర్చున్నారు. అదే నౌకలో ఓ దంపతులుకూడా ప్రయాణిస్తున్నారు.
ఈ నౌక ఇప్పటికి నాలుగో రోజు ప్రయాణంలో ఉంది. మరొక్క రోజులో అది గమ్యస్థానం చేరుకోబోతోంది. ఆ తర్వాత నౌక దిగి వెళ్ళిపోతే ఎవరి దారి వారిదే. 
ఇందాక చెప్పుకున్న దంపతులు డాక్టర్ వంకే చూస్తున్నారు. ఇద్దరూ గుసగుసలాడు కుంటున్నారు. 
"మాట్లాడండి...ఇప్పుడిక మాట్లాడకుంటే ఇక రేపసలు కుదరదు. ఎవరికి వారు వెళ్ళిపోయే హడావుడిలో ఉంటారు" చెప్పింది భార్య. 
అదీ సబబే అనుకుని భర్త డాక్టర్ దగ్గరకు వెళ్ళి "మీరు...." అని పలకరిస్తాడు. 
డాక్టర్ "మీరెవరూ" అని అడుగుతాడు. 
"నన్ను గుర్తుపట్టలేదా? సరేకానివ్వండి. మీకు ఇరవై అయిదేళ్ళ క్రితం నాటి ముచ్చట చెప్తే నేనెవరో మీకు తెలియొచ్చు" అన్నాడు.
అప్పటికీ డాక్టర్ ఆయనెవరో గుర్తుకు రాలేదు.
అప్పుడిక లాభం లేదని తిన్నగా ఆనాటి సంఘటన చెప్పడం మొదలుపెట్టాడు. 
అది అర్ధరాత్రి. ఓ పోలీస్ ఈ డాక్టర్ ఇంటికి వెళ్ళి తలుపుతడతాడు. అప్పుడే డాక్టర్ కోర్స్ పూర్తి చేసుకుని చికిత్స చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్న కాలమది. ఇంత రాత్రి పూట తనకోసం ఎవరొచ్చారనుకుని తలుపు తెరచి చూడగా గుమ్మంలో పోలీస్ కనిపిస్తాడు. 
"మీరు వెంటనే నాతో రండి...." అనగానే డాక్టరు తన కిట్ తీసుకుని పోలీస్ వెంట బయలుదేరుతాడు. డాక్టర్ తనకెంతో కొంత డబ్బులు దొరుకుతాయిలా అనుకుంటాడు మనసులో.
ఓ మురికివాడలో ఉన్న ఓ ఇంటికి డాక్టరుని తీసుకుపోతాడు పోలీస్. ఆ ఇంట ఓ యువకుడు అపస్మారకస్థితిలో ఉండటం చూస్తాడు. 
ఆ గదిలో ప్రాణం తీస్ వాయువు వ్యాపించి ఉండటాన్ని గ్రహించిన డాక్టర్ అక్కడికక్కడ ఆ యువకుడికి ప్రథమ చికిత్స చేయడానికి పూనుకుంటాడు. దాదాపు ఓ గంట తర్వాత ఆ యువకుడిలో చలనం వస్తుంది. 
అమ్మయ్య, ఆ యువకుడిని కాపాడినట్టే అనుకుని "ఎవరూ కంగారుపడకండి" అంటాడు డాక్టర్.
యువకుడి వయస్సు పద్దెనిమిదేళ్ళు. ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు డాక్టర్.  
అతను చెప్పడం మొదలు పెడతాడు. తాను మేనమామ దగ్గర ఉంటున్నానని, ఆయన దగ్గర ఏడు పౌండ్ల పది షిల్లింగులు దొంగిలించానని, అయితే తన దొంగతనం ఎక్కడ తెలిసిపోతుందోనని భయపడి ఇంట్లో సిలిండర్ మూత తీసేసానని, ఆ వాయువుతో ప్రాణం పోతే బాగుంటుందనుకున్నానని యువకుడు చెప్పాడు. 
ఇదంతా విన్న పోలీస్ "నిజానికి ఇతని మీద నేను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినందుకు కేసు పెట్టాలి. కానీ కేసు పెడితే అతని జీవితం పాడైపోతుంది కనుక ఇతనికో అవకాశం ఇచ్చి మందలించి విడిచిపెట్టెస్తాను. కేసు పెట్టబోను" అంటాడు. 
ఇంతలో ఆ ఇంటి యజమానురాలైన ఓ మహిళ యువకుడితో "నువ్వు రెండు మూడు నెలలు అద్దె కట్టకపోయినా పరవాలేదు. నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు.నీ తప్పు తెలుసుకుని ఈరోజు నుంచైనా నీలో మార్పురావాలని కోరుకుంటున్నాను" అంటుంది.
అనంతరం డాక్టర్ "బాబూ! నీ అవసరంకోసం మీ మామయ్య దగ్గర తీసుకున్న డబ్బులు ఏడు పౌండ్ల పది షిల్లింగులూ నేనిస్తాను. ఆయనకిచ్చేసే" అని ఆ డబ్బులు యువకుడికి ఇస్తాడు. నువ్వు మంచి యువకుడికి ఎదగాలి అని వెళ్ళిపోతాడు డాక్టరు.
అనంతరం ఆ యువకుడు తన తప్పు సరిదిద్దుకుని కష్టపడి చదివి పైకొస్తాడు. న్యాయవాది అయ్యాడు. ఓ ఇంటివాడవుతాడు. తప్పులు చేసి పట్టుబడి శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలయ్యే యువకుల జీవితాలను చక్కదిద్దే ఓ హోమ్ ప్రారంభిస్తాడు. తన సదాశయంతోఎందరో యువకులను సన్మార్గంలో నడిపిస్తాడు. వారి జీవితాలలో వెలుగులు నింపుతాడు. 
తన జీవితంలో మార్పుతీసుకొచ్చిన సంఘటనలన్నింటినీ చెప్పి అతను "నన్ను ఆరోజు మీరు, ఆ పోలీసు, ఇంటియజమాను రాలుగానీ ఆదుకున్నందువల్లే ఈరోజు ఇలా బతగ్గలుగుతున్నాను. మీరిచ్చిన ఏడు పౌండ్ల పది షిల్లింగులు తిరిగీ మీకివ్వడం కోసం ఎంతగానో ప్రయత్నించానండి. కానీ మీరెక్కడుంటారో కనుక్కోలేకపోయాను. మీరు చేసిన సాయాన్ని ఇంతకాలంగా గుండెల్లో మోస్తూనే ఉన్నానండి. కాదనక ఈ డబ్బులు తీసుకోండి. ఈ ఇరవై అయిదేళ్ళల్లో నాలో శారీరకంగా వచ్చిన మార్పుతో మీరు నన్ను కనిపెట్టలేకపోయారు. కానీ నేను మిమ్మల్ని గుర్తించానండి" అంటాడు. 
అప్పుడు ఆ డాక్టర్ "నేను నా జీవితంలో ఎంతో డబ్బు నష్టపోయాను. కానీ నేను ఆరోజు రాత్రి సరైన వ్యక్తికే ఏడు పౌండ్ల పది షిల్లింగులిచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను" అనడంతో ఈ కథ ముగుస్తుంది. 
ఈ కథను కొయంబత్తూరుకి చెందిన ఫ్రొఫెసర్ జయంతశ్రీ బాలకృష్ణన్ గారు చెప్పగా విన్నాను. ఓ ఇంగ్లీషు రచయిత ఈ కథ రాశారు. ఆమె ఆ రచయిత పేరు చెప్పారు కానీ నాకర్థం కాక ఇక్కడ చెప్పలేకపోయాను. ఆవిడ ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో చెప్తుంటారు. ప్రతి ఒక్కరిలోనూ మంచిని ఆశించే గొప్ప వక్తగా వినుతికెక్కిన ఆమెకు నా నమస్సులు. 

కామెంట్‌లు