రత్నగర్భయై సంపదలనిచ్చి
జలజీవాల అస్తిత్వానికి ఆలవాలమై
మేఘాలకు ఆవిరులుగా జలాలనిచ్చి
ఎన్నెన్నో సృష్టిరహస్యాలకు సాక్షీభూతమై
ఎన్ని సుడిగుండాలు,బడబాగ్నులు
తనను అల్లకల్లోలం చేసినా
తెల్లని పాలనురుగుల నవ్వులను రువ్వుతూ
లోతెంతో తెలియని తన ఉదధిలో
సంపదల నెన్నింటినో దాచి
మానవాళి మనుగడకు సాధనమై
ఆహ్లాదాన్ని,ఆనందాన్ని
పంచుతూ
అనంతమైన బాధలను తాను మింగుతూ
నిరంతరం విరామం లేకుండా
అలలతో కెరటాలను సృష్టించి
తీరాన్ని ముద్దిడుతూ,తిరిగి తనలోకే తాను వెనుదిరిగుతూ
మూలాలను మరువని కడలి
నిరంతర పనితనమే నీ నుంచి
నేర్చుకోవాల్సింది
నావికులకు భూమికవై నీ యెదపై సలక్షణంగా,
సురక్షకంగా గమ్యాన్ని చేర్చుతావు
కల్లోల సమయంలో ఉగ్రరూపం దాల్చి
తీరాలు దాటి,అంతా ఏకం చేస్తావు
నీ రక్షణే మానవాళికి మనుగడ
సాగరమై,నాగరికతకు అస్తిత్వమై
నీవుండిన జాడనే చరిత్రవుతుంది
కాలుష్యంతో,దోపిడితో నిన్ను
నాశనం చేస్తున్నా,నోరువిప్పి చెప్పలేని అశక్తత నీది
నింగి నీకు అండై,ప్రకృతి నీకు దండై
అహర్నిశం శ్రమిస్తూ,బద్ధకస్తులకు పాఠం నేర్పుతూ
చిరంజీవివై వెలుగొందుతుంటావు
తల్లిలా అన్ని కడుపులోనే దాచుకుంటావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి