గానకళ ప్రత్యేకం:- యామిజాల జగదీశ్

 హాస్యానికి,, కార్టూన్ లకు ప్రత్యేక పత్రికలు ఉన్నట్లే సంగీతానికంటూ తెలుగులో ఓ పత్రిక ఉండినట్టు ఇటీవలే తెలిసింది. ఆ పత్రిక పేరు గానకళ. ఇది మాసపత్రిక. మునుగంటి శ్రీరామమూర్తి సంపాదకత్వంలో ఈ పత్రిక వెలువడుతుండేది.
యాభై తొమ్మిదేళ్ళ క్రితం 1962 జూన్ నెలలో గానకళ తొలి సంచిక పాఠకల ముందుకు వచ్చింది. ఇందులో వసంతరావు వేంకటరావుగారు, విద్వాన్ పాలెపు వేంకటరత్నంగారు, బాలాంత్రపు రజనీకాంతరావుగారు, రామఋషి సత్యనారాయణ శర్మగారు, రాగశ్రీగారు (ఇది కలంపేరు, అసలు పేరు తెలీలేదు), మంగిపూడి రామలింగశాస్త్రిగారు రాసిన వ్యాసాలతోపాటు హంస, యతీంద్ర, విహారి అనే కలం పేర్లతోనూ మరో మూడు రచనలు ఇందులో ఉన్నాయి. విడి ప్రతి వెల నలబై పైసలు. ఏడాది చందా (పోస్టేజీతోసహా) అయిదు రూపాయలు.
వసంతరావు వేంకటరావుగారు స్థూలంగా మానవ జీవితం రెండు విధాలు. శరీరానికి సంబంధించినది భౌతికం, ఆత్మకు సంబంధించినది ఆధ్యాత్మికం అంటూ తమ వ్యాసాన్ని ప్రారంభించి గానము, గాయకులు అనే శీర్షికతో తమ వ్యాసం అందించారు.  గాయకులు ఎటువంటి వారంటే అంటూ ఓ నాలుగు పద్యాలలో చెప్పుకొచ్చారు.
శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారి గురించి విద్వాన్ పాలెపు వేంకటరత్నంగారు సమర్పించిన వ్యాసంలో నాయుడుగారి ఘనతను పేర్కొన్నారు. ప్రభుత్వం వారు నాయుడుగారికి ప్రసాదించిన పద్మశ్రీ బిరుదు అన్ని విధాల సముచితమని తెలిపారు. ఇక బాలాంత్రపు రజనీకాంతరావుగారు అన్నమాచార్యులవారి సంకీర్తన లక్షణాన్ని వివరించారు. అన్నమాచార్యులవారు తెలుగు గేయానికీ, సంకీర్తన పద్ధతికీ పద కవిత్వానికీ ఆదిపురుషుడని ఆయన అభివర్ణించారు. అన్నమాచార్యుల వారి రాకతో ఆంధ్ర దేశ చరిత్రలో రెండు ప్రధాన ఘట్టాలకు దారి తీసిందని, ఒకటేమో అంతవరకూ సామాన్య జనాదరణ మాత్రమే పొంది ఉన్న దేశి తెనుగు గేయాలకు తొలిసారిగా అన్నమ్మయ్య ద్వారానే సాహిత్య గౌరవం లభించిందని, రెండవది వైష్ణవ భక్తి భావ ప్రచారంతో కలిసి వచ్చిన సంకీర్తన పద్ధతి అన్నమాచార్యుల మూలాన్నే ప్రాతిపదిక ఏర్పాటు కావడం అని చెప్పారు.
కామఋషి సత్యనారాయణ వర్మగారు వీణాచార్య శ్రీ తుమురాడ సంగమేశ్వర శాస్త్రి గారిపై వ్యాసం రాశారు. సంగమేశ్వర శాస్త్రి బొబ్బివి వాస్తవ్యులు. సంగమేశ్వరశాస్త్రి గారి వీణా వాయిద్యాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రత్యక్షంగా విన్నారట. కాకినాడలోని శ్రీ రామసమాజం గురించి రాగశ్రీగారు, శ్రీ మదానంద గజపతి మహారాజుగారి గురించి ప్రొఫెసర్ ఎం. ఆర్. శాస్త్రిగారు, శ్రీ రాజావారు ప్రతినిత్యము రాజకీయ వ్యవహారాలను మంత్రికి అప్ప చెప్పి కేవలం తమ మాతృశ్రీ వారి ప్రతినిధిగా, ఆవశ్యకమైన పత్రాలపై సంతకం చేసి వీణ రమణయ్య దాసుగారి ఇంటికి వెళ్ళి వారికి వికట తానములను పురమాయించి అభ్యాసం చేసే వారట. ఓమారు రైలులో రమణయ్య దాసుతోపాటు ప్రయాణించి వీణను వాయిస్తూ 1500 వృత్తములను వాయింపచేసారని ఈ వ్యాసంలో ఇచ్చారు. ఈ రాజు కౌముదీ గ్రంథాన్ని కొంతవరకూ రాశారట. ఈయన ఆజానుబాహువు. స్ఫురద్రూపి. లలిత స్వభావుడు. మృధుమధుర భాషా ప్రియుడు. ధీరోదాత్తుడు. కవి. గాయక రసిక శిఖామణి.
ఆకాశవాణిలో వచ్చిన వివిధ సంగీత కార్యకత్రమాలపై హంస పేరుతో ఓ విమర్శ ఇచ్చారు.
1966లో ఈ పత్రిక విడి ప్రతి వెల యాభై పైసలు. సంవత్సర చందా ఆరు రూపాయలుగా పెంచారు. ఇందులో నెరవు పై ఓ వ్యాసం ఉంది. కీర్తనాదులలోని సంపూర్ణార్థ ప్రతిపాదకమైన సాహిత్య వాక్యాన్ని అది పల్లవి అయినాసరే అనుపల్లవి అయినా సరే, చరణములలోనిదైనాసరే రసరస్ఫోరకంగా రాగ రసోత్పాదకంగా ప్రస్తరించి సంగతులతో పాడే ప్రక్రియనే నెరవు అంటారని ఇచ్చి ఇది తమిళ భాషా పదం నుండి రూపొందిందని చెప్పారు. ఈ వ్యాసాన్ని ఎస్. రామశాస్త్రిగారు రాశారు. ఈ సంచికలో శ్రీ చిట్టిబాబుగారి వీణావాయిద్య సంగీత కార్యక్రమ ఫోటో వేశారు.
        కాకినాడ నుంచి వెలువడిన తొలి సంచికకు డాక్టరు శ్రీపాద పినాకపాణివారు “త్యాగరాజాది దివ్య గాయకులు అమరగానం చేసి విడిచిన దేశమే అయినా సంగీత కళకు సంబంధించిన చర్చలూ, విమర్శలూ, వ్యాసాలూ మొదలైన విషయాలతో ఈ పత్రిక తీసుకురావడం ముదావహ”మని తమ శుభాకాంక్షల సందేశంలో తెలిపారు. విజయవాడలోని ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ హోదాలో ఎమ్. బాలమురళీ కృష్ణగారు కూడా ఈ పత్రికకు శుభాశ్శీస్సులు అందించారు.
 
-