కష్టే...ఫలే....!!:- ------శ్యామ్ కుమార్, నిజామాబాద్.

 కష్ట పడిన వాడుత ప్పక,సుఖపడతాడు,అన్నది
అనుభవంతో పెద్దలు చెప్పిన మాట ! ఈ సూత్రం
ఎప్పుడూ,ఎక్కడా, అర్ధం మారలేదు. దానికి నేనే
గొప్ప ఉదాహరణ.
నేను ఆ రోజుల్లో అంటే- 9వ తరగతి- చదువుతున్నాను .మాకు ఎన్ని ఆటలు ఆడినా ఎన్ని పాటలు పాడి నా  ఒక లోటు కనిపించేది. అది ఏంటంటే   ఏదైనా కొనుక్కొని తిందాం అనుకుంటే మాకు డబ్బులు ఉండేవి కావు. సైకిల్ మీద అమ్ముకుంటూ పోయే పల్లీలు బఠానీలు  కానీ , రోడ్డు పక్కన కూర్చుని చిన్న  గంప లో అమ్ముకునే  తినుబండారాలు కానీ,  గుప్తా దుకాణంలో పై వరుసలో పెట్టిన గాజు సీసాల్లో కనిపించే పల్లీ పట్టీలు నువ్వులు పట్టీలు ఊరించే వి.  మిఠాయిల బండి దగ్గర నిలబడి చూసేవాళ్ళం.  సాయంత్రం పూట వేడి వేడి మిర్చి బజ్జీలు పకోడీలు నోరూరించేవి కానీ డబ్బులు ఏవి ?   మా ఇంట్లో మా
 నానమ్మ    నాకు రోజుకు రెండు పైసలు ఇచ్చేది. అది కూడా 9వ తరగతి వచ్చిన తర్వాతే. అప్పుడు మా స్నేహితుడు సుధాకరు ఒక బ్రహ్మాండమైన ఐడియా చెప్పాడు. మా ఇంటి ముందు ఒక కట్టెల మండి ఉండేది .అది వాళ్ళ అమ్మ నడిపించేది .దాన్ని అంజమ్మ కట్టెల మండి అనేవారు. ఆవిడ పని వాళ్ళని పెట్టి బండెడు కట్టెలు నరికించి అమ్మేది అవి రకరకాల సైజుల్లో అమ్ముడు పోయేవి. అయితే ఆ అంజమ్మ కొడుకు సుధాకర్ అన్న మాట . వాడు ఏమన్నాడు అంటే ఒరేయ్ మనం రోజూ కట్టెలు కొట్టి డబ్బులు సంపాదించవచ్చు అన్నాడు. అది ఎంత అంటే ఓక  బండి కట్టెలు చిన్నచిన్నగా కొట్టి కొట్టి వేస్తే  నాలుగు రూపాయలు. అంజమ్మ ఇచ్చే డబ్బులు మనం ఎంజాయ్ చేయవచ్చు అని ఆలోచనలోపడ్డాను. అన్ని కట్టెలు కొట్టడం ఒకరితో కాదు కాబట్టి ముగ్గురం కలిసి పంచుకుందాం అనుకున్నాం.వెంటనే సుధాకర్ వెళ్లి వాళ్ళ అమ్మ కు చెప్పాడు వాళ్ళ అమ్మ నవ్వి సరే అంది .
మరుసటి రోజు నేనూ,  సుధాకర్ , శర్మ, వినోద్ నలుగురo ఉదయాన్నే టిఫిన్ చేసి మొదలుపెట్టాం .మాకు దాదాపుగా  ఆ కట్టెలు కొట్టడానికి పది రోజులు పట్టింది .     అర చేతుల కి బొబ్బలు కట్టి వేళ్లకు 
         అంతా చర్మం     వూడిపోయి  నానా   బాధలు పడ్డాం.  పది రోజులు కట్టెలు నలుగురు కలిసి కొడితే తలా   ఒక్క   రూపాయి వచ్చింది. ఇది మన వల్ల అయ్యే పనికాదు అని డిసైడ్ అయ్యాను.  మళ్లీ ఇంకో ఆలోచన వచ్చింది మా ఇంటి దగ్గరలో ఒక అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ పెట్టారు. అందులో వెళ్లి పని అడిగాను అక్కడ ఉన్న వారు నవ్వి ఏం చేస్తారు మీరు అన్నాడు .ఏపనైనా చేస్తాము అన్నాం .అయితే సరే ప్యాకింగ్ సెక్షన్ కు రండి అంటూ తీసుకెళ్లారు.  అక్కడ మేము చేసే పని ఏమిటంటే 12 అగ్గిపెట్టెల డబ్బాలు కలిపి ఒక ప్యాకెట్ చేయాలి పేపర్ తోటి దానిమీద స్టిక్కర్ అంటించాలి. అలా రెండు వందల ప్యాకెట్లు చేస్తే 25 పైసలు ఇస్తా అన్నాడు. సరే ఇది ట్రై చేద్దాం అనుకుని మరుసటి రోజు మొదలు పెట్టాం అయితే మాకు సరైన శిక్షణ కానీ దానిలో మెలకువలు తెలియక పోవడం వలన ఆ రోజు 50 చేశాం అంటే ఆరు పైసలు వచ్చింది అప్పుడు ఆ ఫ్యాక్టరీ ఓనర్ ఏమన్నాడు అంటే మీరు చాలా స్పీడ్గా చేయాలి రోజుకు మీరు కనీసం 200 చేస్తే బాగుంటుంది అన్నాడు.మరుసటి రోజు ఎవ్వరూ  రాలేదు. అయినప్పటికీ  నేను మాత్రం వెళ్లా.   నేను  చాలా చాలా కష్టపడి ఒక నెల రోజులు పని చేసా. అయితే రోజుకి 150 డబ్బాలు చేయగలిగాను.  అలా రోజుకి దాదాపుగా పదిహేను  పైసలు   సంపాదించాను. ఇవన్నీ  వేసవి సెలవుల్లో చేసిన పనులు.  ఈ రకంగా చిన్నప్పటినుంచి ఏదో  పని చేసి ఖర్చులకు డబ్బులు సంపాదించుకోవాలి అనే ఆలోచన మొదలైంది. ఈ పనుల్లో నాకు వచ్చిన డబ్బులు చాలా తక్కువే . నిరుత్సాహం కలిగింది కానీ సంతోషం కలిగింది. ఆ డబ్బులను నా  ట్రంకు పెట్టెలో దాచుకున్నాను.  వాటిని ఖర్చు పెట్టాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది.  అప్పుడప్పుడూ కొన్ని తీసి ఖర్చు పెట్టుకుంటూ మిగిలిన  వాటిని చూసుకుంటూ మురిసే వాణ్ని.
అలా నా మొదటి సంపాదన  చూశాను. కష్టపడి సంపాదించిన డబ్బుతో వచ్చే ఆనందం వేరు. 
ఆ ..ఆనందానికి కొలబద్ద లేదుసుమా ..!