ఉత్తమ సంప్రదాయం!: దోర్బల బాలశేఖర శర్మ

 ప్రజాస్వామ్యానికే నాలుగో స్తంభం వంటి జర్నలిజం ఇవాళ ప్రత్యేకించి మన దేశంలో, ఇంకా తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన  అన్ని రంగాల వలెనే పచ్చదనాన్నంతా రాల్చేసుకొని మోడుబారి పోయిందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆశ్చర్యకరంగా, పూర్తి నిజాయితీ, నిబద్ధత, నిష్పాక్షిక గుణాలతో కూడిన లబ్ధప్రతిష్టులైన, నిఖార్సయిన పలువురు పాత్రికేయులను గౌరవించుకోవడం ద్వారా ఈ శ్రీ ప్లవ నామ ఉగాది కొత్త సంవత్సర ఆగమన వేళ ఈ రంగంలో సరికొత్త ఆశలను చిగురింపజేసే ఉజ్వల ఘట్టం ఒకటి హైదరాబాద్ నగరంలోని రవీంద్రభారతి వేదికపై ఇటీవల (7.4.2021) జరిగింది. అందులో నేను మిగిలిన వారితోపాటు ప్రతిష్ఠాత్మకమైన 'ఉత్తమ పాత్రికేయ శిరోమణి' అవార్డు అందుకోవడం నాకైతే ఇంకా నమ్మబుద్ధిగా లేదు. ఎందుకంటే, నేనంటే ఏమిటో, నా వృత్తిధర్మ నిర్వహణ ఎలాంటిదో తెలిసిన వారికి, ముఖ్యంగా నా ఫేస్ బుక్ మిత్రులు, ఆత్మీయలు, శ్రేయోభిలాషులకు వేరే చెప్పనవసరం లేదు. ఇది 'కలా, నిజమా' అన్నంత అనూహ్య సందర్భం. 

ఒకప్పుడు విలేకరులను చూసి సమాజంలో అవకతవకలు, అక్రమాలకు పాల్పడే వారంతా భయపడేవారు. ఇప్పుడు జర్నలిస్టులమని చెప్పుకోవడానికే సిగ్గు పడవలసిన దుస్థితి. కారణాలు బహిరంగమే. 'పత్రికా రంగం ఇంతలా కుళ్ళిపోవడానికి ఎవరు కారణం?' జర్నలిస్టు సమాజమే సింహావలోకనం చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం వాస్తవిక వార్తలు, వ్యాఖ్యల కోసం ప్రజలు సోషల్ మీడియాపై ఆధార పడవలసి వస్తుందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నిష్పాక్షిక వార్తా రచన, ఆదర్శవంతమైన పాత్రికేయం బాగా కరువై పోయిన ఈ నేపథ్యంలో చీకట్లో చిరుదివ్వెలా కొందరు ప్రజాస్వామ్య ప్రియులు ఉత్తమ విలువలతో కూడిన అవార్డుల సంప్రదాయాన్ని నిజమైన పాత్రికేయుల కోసం ఇంకా కొనసాగిస్తుండటం అభినందనీయం. 
'ఎవరు ఉత్తములు?' అన్నది నిర్ణయించడంలోనే మనం ఇచ్చే ఉత్తమోత్తమ తీర్పు ఆధారపడి ఉంటుంది. నా ఒకప్పటి సహచర సీనియర్ జర్నలిస్ట్, ప్రస్తుత విలక్షణ పత్రిక 'కళ' ఎడిటర్, అన్నిటికీ మించి మానవీయ మనస్కుడు మా మహమ్మద్ రఫీ ఎంపికకు న్యాయనిర్ణేతగా వ్యవహరించడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నది సుస్పష్టం. గత పదేళ్లుగా వస్తున్న ఆనవాయితీలో భాగంగానే ఈ సంవత్సరం 'ఉత్తమ పాత్రికేయుల'ను రఫీ నిష్పాక్షిక పంథాలో ఎంచుకోవడం ఎంత ముఖ్యమో, ఆయనకు ఆ మేరకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన ఆ మూడు సంస్థల (శృతిలయ ఆర్ట్స్, సీల్ వెల్ కార్పొరేషన్, కోవిద సహృదయ ఫౌండషన్) అధిపతులు అవలంబిస్తున్న ఉత్తమాభిరుచీ అంతే ప్రధానం అన్నది ఇక్కడ గమనార్హం.
1961లో ఆనాటి శ్రీ ప్లవ నామ సంవత్సరం నాకు జన్మనిస్తే, 20 ఏళ్ల వయసులో 1981లో నేను 'ఈనాడు విలేకరి'గా రామాయంపేటలో చేరాను. ఒక అధికారి అవినీతి వార్త రాసిన నేరానికి నాపై చేరిన 9 నెలల్లోనే హత్యాయత్నం జరిగింది. విలేకరిగా అప్పట్లో నా నిబద్ధత ఎలాంటిదో చెప్పాలంటే, నేను సంచి పట్టుకుని రేషన్ షాపుకు కూడా వెళ్ళేవాన్ని కాదు. అలా, ఇంటి పనులు ఏవీ చేసేవాన్ని కాదు. నేను రాసిన అనేక అవినీతి, అక్రమార్కులకు చెందిన వార్తల మూలంగా సదరు బాధితులు నన్నేమీ చేయలేక, నాన్నను, అన్నను (ప్రభుత్వ టీచర్లు ) దూరప్రాంతాలకు బదిలీ చేయడం వంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడేవారు. నిజమైన, నిఖార్సయిన జర్నలిస్ట్ జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి నా ఐదేళ్ల ఆ కాలం నిదర్శనం. ఆ తర్వాత, ఉదయం, వార్త, ఇప్పటి నమస్తే తెలంగాణ పత్రికలలో చేరడం, రిపోర్టింగ్ నుంచి ఫీచర్ రైటింగ్ కు మళ్లడంతో... ఈ కాలపు జర్నలిజం రుగ్మతలు నన్నంటుకోలేదు. ఈ 2021లో వస్తున్న శ్రీ ప్లవ సంవత్సరంలో, నాకు అరవై ఏళ్లు వస్తున్న వేళ, నన్ను 'ఉత్తమ పాత్రికేయుడి'గా ప్రపంచానికి పరిచయం చేయడం ( రఫీ పుణ్యమాని) నేను మరిచిపోలేని అనుభవం. వేలు, లక్షల వరహాలు విలువ చేసే అపురూప గౌరవమిది. అందుకే, ఈ నాలుగు మాటలు.