అంతరంగం ( జీవితానుభవాలు --మిలిటరీ జీవితం) కందర్ప మూర్తి , హైదరాబాద్.

 రిక్రూటింగ్ ఆఫీసు వద్ద  నేను కూడా అందరి మాదిరి వరుసలో నిలబడితే ఒక మిలిటరి ఉధ్యోగి చదువు సర్టిఫికెట్లు
పరీక్ష చేస్తే  తర్వాత  రైటింగ్ ఫిజికల్ మెడికల్ టెస్టులు పూర్తయిన  పిదప వివిధ టెక్నికల్ నాన్ టెక్నికల్ బ్రాంచ్ లకు సెలక్టు చేసి డాక్యుమెంట్లు తయారు చేసి దేశంలోని మిలిటరీ ట్రైనింగ్  సెంటర్లకు పంపుతున్నారు.మాకు హిందీ రానందున
 వచ్చీరాని ఇంగ్లీషుతో పని జరుగుతోంది.
     డాక్యుమెంట్లు తయారుచేసే  మిలిటరీ ఉధ్యోగి తెలుగు
తెలిసిన తమిళ్ సుబేదారు గారు నన్ను చూసి సన్నగా బక్కగా
ఉన్నానని అదీగాక నేను పి.యు.సి లో  బై.పి.సి సబ్యక్ట్లు
 చదివానని తెలిసి ఆర్మీ మెడికల్ కార్ప్స్(A.M.C) లో నర్సింగ్
అసిస్టెంట్ (మేల్ నర్స్) గా సెలక్టు చేసి హైదరాబాద్ ట్రైనింగ్
సెంటర్ (సౌత్)కు పంపుతున్నానని వచ్చీరాని తెలుగు లో
చెప్పేరు.
      హైదరాబాద్ అనగానే మన తెలుగు ప్రాంతం కనక  అన్నీ
చూడొచ్చు అనుకున్నాను.అత్యవసర పరిస్థితుల్లో దక్షిణాదిన
 హైదరాబాదులో  ఆర్మీ మెడికల్ సెంటర్ పెట్టేరు. ముఖ్య హెడ్ క్వార్టర్ సెంటర్ ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఉంది.
      గబగబా అందుబాటులో ఉన్న బట్టలు ముఖ్య వస్తువుల్ని
ఎయిర్ బేగ్ లో సర్దుకుని జేబులో ఉన్న డబ్బులతో రిక్రూటింగ్
ఆఫీసుకు రాగానే హైదరాబాద్ వెళ్లడానికి  రైల్వే వారంటు తయారు చేసి దారి ఖర్చులకు డబ్బు ఇచ్చి హైదరాబాద్ చేరగానే  నాంపల్లి స్టేషన్  ప్లాట్ ఫారం మీద ఏఏ సెంటర్లకి
 వెళ్లే వారి కోసం ఇంగ్లీషు తెలుగులో రాసిన బేనర్లు ఉంటాయని
 చెప్పి గ్రూపులుగా రైల్వేస్టేషన్లో వారి మనిషి ట్రైన్ ఎక్కించాడు.
     అంతదూరం ప్రయాణం చెయ్యడం అదే తొలిసారి. మిగత
నాతో ఉన్నవారు వేరు వేరు మిలిటరీ ట్రైనింగ్ సెంటర్లకు సెలక్టు
అయారు.ట్రైన్లో రాత్రంతా ప్రయాణం చేసి ఉదయం హైదరాబాద్
 నాంపల్లి స్టేషనుకు చేరుకున్నాము.
       ప్లాట్ ఫారం మీద మిలిటరీ పోలీసులు మమ్మల్ని గుర్తుపట్టి
  మా మూవ్ మెంటు ఆర్డర్సు ప్రకారం  బేనర్లతో ఉన్న టేబుళ్ల
 వద్దకు పంపేరు. అక్కడి మిలిటరి సిబ్బంది మాకు చాయ్
తాగించి  స్టేషన్ బయట ఉన్న మిలిటరీ లారీలలో కూర్చోబెట్టి
 లంగర్ హౌస్ దగ్గర ఉన్న మెడికల్ మిలిటరీ సెంటర్ కి ఉదయం
పది గంటలకు చేర్చారు.
.
     దక్షిణాది ఉత్తరాది నుంచి సెలక్టై  వచ్చిన వేరు వేరు ట్రేడ్ ల రిక్రూట్సుతో  మైదానం సందడిగా ఉంది. చుట్టూ కొన్ని బంగ్లా
పెంకుల బేరక్సు వరసగా కనబడుతున్నాయి. దగ్గరలో పెద్ద
పేరేడ్ మైదానం చెట్లు కనబడుతున్నాయి.
    అంతా కొత్త. కొత్త ప్రదేశం , కొత్త మనుషులు. దేశంలోని వివిధ
రాష్ట్రాల యువకులు హీరోల్లా  హైర్ స్టైల్  ఫేషన్ దుస్తులతో
 సూట్ కేసులు ఎయిర్ బేగ్ లు ఎవరు ఏ భాష మాట్లాడు
తున్నారో తెలియక అయోమయం అనిపిస్తోంది.
     మిలిటరీ సిబ్బంది హిందీలో మాట్లాడుతు  ఇటుఅటు
తిరుగుతున్నారు. లారీలు దిగిన యువకుల్ని వారి లగేజీలను
 ఒక చోట పెట్టమని అరుస్తూ గ్రూపులుగా చేసి బేరక్స్ వద్ద గల
 చెట్ల కింద కర్ర కుర్చీల మీద కూర్చో బెడుతున్నారు.
  అక్కడ సిద్ధంగా ఉన్న సివిల్ బార్బర్లు ఒక్కొక్క హీరో హైర్ కట్
 యువకుడికి  చైనా కటింగ్ అంటే నడి నెత్తి మీద మధ్యలోకొంత జుత్తు ఉంచి సైడ్లు మొత్తం సాఫ్ చేస్తున్నారు. వెంటనే మరోచోట
  పలక మీద వారి సర్వీస్ నంబరు రాసిన పలక మెళ్లో వేలాడ
దీసి  ఫోటోగ్రాఫర్ తో  ఫోటో  తీయిస్తున్నారు.అదే ఫోటో వారి
గుర్తింపు కార్డు (పే బుక్ )మీద ఉంటుంది. బార్బర్ కటింగ్ తర్వాత వారివారి ముఖాలు చూసుకుని ఏడుపు ముఖం
 పెట్టుకున్నారు సినీ హీరో హైర్ స్టైల్ యువకులు.
                  *               *                *
        (    మిగతా ముచ్చట తర్వాత):