గీత నిజంగా బాపు గీసిన గీత లాగే చక్కగా చూడ ముచ్చటగా ఉంటుంది. పొందికైన వస్త్ర ధారణ, మూర్తీభవించిన ముగ్ధత్వం ఆమె స్వంతం. నల్లటి బారాటి జడ, తీర్చి దిద్దినట్టున్న కను ముక్కు తీరు..చూడగానే ఆకట్టుకునే సోయగం!
మాటలో నడకలో పొందిక! చూడగానే ఆడపిల్లలకే పలకరించి స్నేహంచెయ్యాలనిస్తుంది. ఇక మగ పిల్లల మాట చెప్పాలా!
అప్పుడప్పుడు కాలేజికి పరికిణి-వోణి వేసుకెళ్ళేది. చుడిదార్లు, జీన్ ప్యాంట్స్ ధరించే ఈ రోజుల్లో అలా సంప్రదాయ వస్త్ర ధారణలో వచ్చే గీత అందరికీ ఆసక్తి కలిగిస్తుందనటంలో ఆశ్చర్యం ఏముంది?
గీత కాలేజికి రావటం మొదలుపెట్టిన రోజే అభిషేక్ దృష్టిలో పడింది. అభిషేక్ గీతకి సీనియర్. వారం పది రోజులు ఆ అమ్మాయిని ఆసక్తిగా గమనించి, నెమ్మదిగా ఆ రోజు లైబ్రరీ లో మాట కలిపాడు. సీనియర్ ని అని పరిచయం చేసుకుని, లెక్చరర్స్ అందరికీ తనంటే బాగా గౌరవమని, చదువులో ఏదయినా సహాయం కావాలంటే సంకోచించకుండా తనని సంప్రదించమని చెప్పాడు.
అలా అడపా దడపా మాట కలుపుతూ దగ్గరయ్యాడు.
"రేపు సెకండ్ సాటర్ డే, హాలిడే కదా! సినిమాకెళదాం, స్పెషల్ క్లాస్ ఉందని ఇంట్లో చెప్పిరా" అన్నాడు.
అభిషేక్ చేసిన ఈ ప్రతిపాదనలో ఏదో తేడా ఉన్నట్టనిపించింది గీతకి.
విషయం ఇంట్లో చెప్పటం అవసరమా కాదా అని తనలో తనే మధనపడసాగింది. "అసలు ఈ పరిచయాన్ని కొనసాగించాలా, వద్దా? కట్ చేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయి" అని తన రూం లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నది.
అసహనంగా కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతున్న గీత, వయసులో ఉన్న ఆడపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండే బామ్మ దృష్టిలో పడింది.
మధ్యాహ్న భోజనాలయ్యాక, "అమ్మా గీతా వత్తులు అయిపోయాయి చేసుకోవాలి. అలమార్లో పైన పత్తి ఉంది ఇలా పట్టుకురా" అని పిలిచింది బామ్మ కామేశ్వరమ్మగారు.
గీత పత్తి ఉన్న తాటాకు బుట్ట పట్టుకొచ్చి బామ్మ ముందు కూర్చుంది. "ఏమిటి ఏదో ఆలోచిస్తున్నావు? అంతా బాగానే ఉందా? నాతో చెప్పటానికి మొహమాటం దేనికి" అన్నది.
"బామ్మా నువ్వు నా ఫ్రెండ్ వి కదా! నేను చెప్పేది విని నీ అభిప్రాయం చెప్పు" అని తను కాలేజికి వెళ్ళటం మొదలు పెట్టిన రోజు నించి, ఇంట్లో అబద్ధం చెప్పి సినిమాకెళదాం రమ్మని నిన్న అభిషేక్ ఆహ్వానించటం వరకు అన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది.
తన అనుమానం నిజమయిందనుకున్న బామ్మ
"పరువంలోకి వచ్చిన ఆడపిల్లలకి ఇలాంటి అనుభవాలు సహజమే! చదువుల కోసం బయటికి వెళ్ళక తప్పదు. అందులోనూ ఆడా మగా కలిసి చదివే చోట ఇలాంటి వాటికి అవకాశం ఎక్కువ. ఇప్పుడయితే బస్టాండులల్లో, ఇంటి చుట్టు పక్కలా కూడా కాస్త కంటికి నదరుగా కనపడే అమ్మాయిల కోసం మగ పిల్లలు వలేసి గాలిస్తూ ఉంటారు."
"అది వారి తప్పని పూర్తిగా అనలేము. ఆ వయసు లక్షణం అది! అవకాశం దొరికితే వదులుకోరు. మంచితనం నటించి, సహాయం చేస్తున్నట్టుగా మాటల గారడి చేసి దగ్గర అవుతారు. సినిమాలతో మొదలయి, ఆడపిల్లలు వారి దారిలోకి వచ్చాక ఇంట్లో వారికి తెలియకుండా పెళ్ళి చేసుకుందాం వచ్చెయ్యమని ప్రోత్సహిస్తారు".
"మంచిదయింది నాతో చెప్పావు. అందరం ఆ వయసు దాటి వచ్చిన వాళ్ళమేగా! సరే ఇప్పుడు నీకు రామాయణంలో ఇలాంటి పరిస్థితి ఎదురయిన అమ్మాయిల కధ చెబుతా విను."
*****
"బ్రహ్మ దేవుడి కుమారుడయిన "కుశుడు" అనే రాజుకి నలుగురు కొడుకులు. అందులో ఒకడయిన కుశనాభుడు ధర్మాత్ముడు, రాజర్షి. ఆయనకి ఘృతాచి అనే అప్సర స్త్రీ ద్వారా ఉత్తమమయిన నూరుగురు కుమార్తెలు కలిగారు. యవ్వనంలో ఉన్న వాళ్ళు ఆభరణాలు ధరించి అన్ని అలంకారాలు చేసుకుని వన విహారం చేస్తున్నప్పుడు, వాయు దేవుడు వారిని చూసి మోహించి
"అహం వ: కామయే సర్వా భార్యా మమ భవిష్యధ,
మానుషస్త్యజ్యతాం భావో దీర్ఘమాయురవాప్స్యధ"
"చలం హి యౌవనం నిత్యం మానుషేషు విశేషత:,
అక్షయ్యం యౌవనం ప్రాప్తా అమర్యశ్చ భవిష్యధ"
[నేను మిమ్మల్నందరింక్ నా భార్యలుగా చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను వివాహం చేసుకుంటే, మీకు మనుష్యత్వం పోయి దీర్ఘాయువు లభిస్తుంది. యౌవనమనేది తాత్కాలికం. అందులోనూ మనుష్యులకి అది ఇంకా తక్కువ కాలమే ఉంటుంది. నాతో వివాహం వల్ల మీకు యౌవనము శాశ్వతంగా ఉండిపోతుంది అని చెప్పాడు]
"ఓ సురోత్తమా నీవు అన్ని ప్రాణులలోను సంచరిస్తుంటావు. నీ శక్తి, ప్రభావము మాకు తెలుసు. కానీ నువ్వు మమ్మల్ని అవమానిస్తున్నావు."
"కుశనాభ సుతా: సర్వాస్సమర్ధస్త్వాం సురోత్తమ,
స్థానాచ్చ్యయితుం దేవం రక్షామస్తు తపోవయం"
[నీవు దేవతవే అయినా నిన్ను నీ అధికార స్థానం నించి తొలగించగల సమర్ధత మాకున్నది. కానీ మా తపశ్శక్తి ని రక్షించుకోవటానికి మేము ఆ పని చెయ్యట్లేదు]
అని చెప్పి
"మా భూత్స కాలో దుర్మేధ: పితరం సత్యవాదినం
అవమన్య స్వధర్మేణ స్వయం వరముపాస్మహే!"
[దుర్బుద్ధి గల ఓ వాయు దేవా సత్యవాది అయిన మా తండ్రిని కాదని స్వేచ్ఛానుసారముగా, మేమే స్వయంగా వరుని పొందే కాలము ఎన్నటికీ రాకుండు గాక]
"పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హి స:
యస్యనో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి"
[మాకు తండ్రియే ప్రభువు, దేవత; మా తండ్రి మమ్ములను ఎవరికిచ్చి వివాహం చేస్తే అతనే మా భర్త కాగలడు] అన్నారు.
"అది విన్న వాయుదేవుడు కోపం వచ్చి ఆ కన్యల అవయవాల్లో ప్రవేశించి వాటిని దుర్బలంగా చేసేశాడు. దానితో వారు గూని వారుగా అయిపోయి నిలబడే శక్తి లేక దొర్ల సాగారు."
"వారికి కలిగిన ఆ పీడ తెలుసుకున్న కుశనాభుడు మిమ్మల్ని ఇలా చేసిన అధర్మ పరుడెవరు అని అడగంగానే, సర్వ వ్యాపి అయిన వాయుదేవుడు ధర్మం తప్పి మమ్మల్ని ఇలా చేశాడు అని చెబుతారు."
"అప్పుడు కుశనాభుడు తన కుమార్తెలకి తండ్రి పట్ల కల గౌరవానికి, అంత ఉపద్రవం వచ్చి వారి శరీరం వంకరలు తిరిగిపోయే పరిస్థి వచ్చినా వారు చూపించిన ఓర్పుకి, క్షమాగుణానికి మెచ్చుకుని వారిని బ్రహ్మదత్తుడనే ఉత్తమమయిన రాజుకిచ్చి వివాహం చేశాడు. దేవేంద్రుడితో సమానమయిన శక్తి గల ఆ బ్రహ్మ దత్తుడు వారి కరం గ్రహించగానే వారికున్న అవకరం, గూని తొలగిపోయి మళ్ళీ మునుపటి అందంతో, యౌవనంతో ప్రకాశించారు."
******
"తల్లిదండ్రుల డబ్బుతో చదువుకుంటూ, వారి సంపాదనతో కొన్న ఖరీదయిన బట్టలు వేసుకు తిరుగుతూ, వాహనాలు మీద షికార్లు కొట్టే పిల్లలకి తమ కాళ్ళ మీద నిలబడి ఒక రూపాయి సంపాదించేవరకు వారి సమర్ధత ఏమిటో వారికీ తెలియదు, వెంట తిరిగే ఆడపిల్లలకీ తెలియదు."
"అందుచేత పై పై ప్రలోభాలకి లొంగకుండా, చదువు మీద ధ్యాస పెట్టి ముందు ఒక అర్హత సంపాదించుకోవాలి."
"ప్రలోభాలు, ఆకర్షణలు కలిగించేవారు తక్కువేం కాదు. ఎంత వరకు అవి నమ్మాలి అనే విచక్షణ ముందు నేర్చుకోవాలి."
"ఆకర్షణలు, వ్యామోహాలు ఎవరు కలిగించినా తల్లిదండ్రులు..కుటుంబం పట్ల బాధ్యత తెలిసిన పిల్లలు, ఆడ కానీ...మగ కానీ, క్రమశిక్షణ, కట్టుబాటు తప్పకుండా ప్రవర్తించగలిగితే తాత్కాలిక సమస్యలు ఎదురయినా చివరికి మంచే జరుగుతుంది అని ఈ కధ వల్ల అర్ధమవుతుంది."
"అదే రామాయణంలో బంగారు లేడిని చూసి దాని అందానికి ఆకర్షితురాలయిన సీతా దేవి అది ఎలాగయినా తెచ్చిమ్మని రాముడిని కోరింది. బంగారు లేడి అనేది సృష్టికి విరుద్ధమని, అది రాక్షస మాయ కావచ్చు అని లక్ష్మణుడు ఎంత చెప్పినా వినిపించుకోకుండా సీత దాని కోసం పట్టు బట్టింది. పైగా లక్ష్మణుడికి దురుద్దేశ్యం అంటగట్టి అనరాని మాటలు అని ఆశ్రమానికి దూరంగా అతన్ని పంపించి ఆపదలో చిక్కుకుంది."
"అంటే ఆకర్షణ కలిగినప్పుడు, మనిషి విచక్షణ కోల్పోయి అసహజంగా, అసంబద్ధంగా ఆలోచించి కోరి ఆపద కొని తెచ్చుకుంటాడు."
"కాబట్టి ఇతరులు వ్యామోహం కలిగించినప్పుడు, వివేకం పోగొట్టుకోకుండా ఆలోచించి విచక్షణతో నిర్ణయం తీసుకోమని మనకి చరిత్ర, మన సాహిత్యం నేర్పుతున్నది."
******
"ఆ రోజులు వేరు. కానీ అలా తపశ్శక్తి సాధించే అవకాశం ఈ రోజుల్లో లేదు కాబట్టి ఈ కాలంలో ఆడపిల్లలు దుర్బుద్ధి కల మగ పిల్లలకి బలవ్వకుండా స్వీయ రక్షణ విద్యలయిన 'కరాటే', 'తైక్వాండో' నేర్చుకోవాలి."
"కేరళలో "కలరియపట్టు" అనే ఒక స్వీయ రక్షణ యుద్ధ విద్య ఉన్నది. ఈ విద్యలు నేర్చుకోవటం ఇప్పుడు తప్పని పరిస్థితి వస్తున్నది. జీవితాలు పాడు చేసుకోకుండా ఆత్మ విశ్వాసంతో బ్రతకటానికి అవి ముఖ్యం!"
"నడు నువ్వు కూడా మన పార్క్ పక్కన ఉన్న మహిళా సంస్థలో కరాటే క్లాసులో చేరుదువుగాని" అన్నది బామ్మ.
"బామ్మా నువ్వెంత ఎడ్వాన్స్ డో! అందుకే నీకు చెప్పాను. ఇప్పుడు నాకు ఎంతో ధైర్యంగా ఉన్నది" అని బామతో పాటు తనూ నాలుగు వత్తులు చేసి టీవీ చూడటానికి వెళ్ళింది.
"విచక్షణ":-ఎం. బిందు మాధవి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి