"పిల్లలే దేవుళ్ళు". మినీ కథ:-పి.చైతన్య భారతి:


 ఒక ఊరిలో ప్రభుత్వ బడిలో 200 మంది విద్యార్థులు,10మంది ఉపాధ్యాయులు ఉండేవారు.పిల్లలు రోజూ వేళకు బడికి వచ్చి ఉపాద్యాయులు చెప్పే పాఠాలను శ్రద్దగా వింటూ,ఆట పాటల్లో ,చదువులో ముందంజలో ఉండేవారు.విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంట చేయుటకు ఇద్దరు ఆ గ్రామస్థులే వచ్చి వండి వడ్డిస్తూ ఉండేవారు.

     అలా రోజులు గడుస్తున్న కొద్దీ వారిలో స్వార్థ బుద్ది పెరిగి,పిల్లలకు వండే భోజనంలో తగిన ప్రమాణాలు పాటించకుండా చేసేవారు.ఉపాధ్యాయులు ఎంత చెప్పినా వారిలో మార్పు గగనమయ్యేది.

   పెద్ద పిల్లలు కూర బాగా లేదని వారికి ఎదురు తిరిగితే వారిపై శాపనార్థాలు పెట్టేవారు.

   ఉపాధ్యాయులు తరగతి పనుల్లో ఉన్నప్పుడు వారి కళ్ళు గప్పి ,కూరలు తీసి దాచుకొని ,వాటిల్లో నీళ్లు పోసి వడ్డించడo చేసేవారు. ఉపాధ్యాయులకు కోపం వచ్చి వారిని తొలగించారు.

   కొంతకాలం తర్వాత ఆ తొలగించిన ఇద్దరిలో ఒకామెకు ఒక్కతే మనుమరాలు. అందాల బొమ్మ.అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అనుకోకుండా తీవ్రమైన జ్వరం బారిన పడి ఆసుపత్రికి వెళ్ళే లోపల చనిపోయింది.దానితో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగి పోయింది. కొన్ని రోజులకు ఆ వంటామే బడికి వచ్చి బోరుమని ఏడ్చింది.

   అప్పుడు ఉపాధ్యాయులు ఇలా చెప్పారు.'చూడమ్మా నీవు ఎన్ని సార్లు చెప్పినా పిల్లలకు సరిగా భజనం వండి పెట్టడానికి నీ మనసు ఒప్పలేదు.పసిపిల్లల కడుపు కొట్టి,స్వార్థ బుద్ధితో నీవు లాభ పడాలని చేసావు.మన బడిలో నిరుపేద పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం వారికి ఇచ్చిన విధంగా వారికి వండి పెట్టడం మన ధర్మం.ఒకరికి అన్యాయం చేయాలని చూస్తే ఏదో రూపంలో అదే మనకు తిరిగి వస్తుంది."అని చెప్పగా ఆమె తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం చెందింది.ఇంకెప్పుడు అలా చేయనని వాటికి మాటిచ్చింది.


*నీతి:చేరపకురా చెడేవు.


కామెంట్‌లు