ఇష్టం !!:-కె ఎస్ అనంతాచార్య

ఈ  భావన ఎలా జన్మిస్తుందో  
బంధమై చుట్టుకొని  మాలికలా గుబాలిస్తుందో ?
మూలమెవరికి
అంతు పట్టటం లేదు     !
నిర్వచనానికి పదాలు తడబడుతున్నాయి!

వాక్యాలు కుదరలేదు 
పద్య పాదాలు గతి తప్పుతున్నాయి
వ్యాకరణం  రణం చేస్తోంది
ఇష్టానికి  అనుమతులు లేవు 
హద్దులు చీల్చుకుంటూ వచ్చి పొద్దుపొడుపు మీద
విచ్చుకున్న మనసు పత్రం

కనుబొమలెగరేసి
 కాటుకతో కబురంపే 
నయన సందేశం ! 

వేళ్ళకు అద్దుకున్న
గోరింటాకులో మూటగట్టుకున్న 
మురిపాల ముదిత విన్నపం 

తోడుగ నిలిచి కలబడే 
హక్కుల  జండా మీది
సూర్యుడి చిత్రపట సోపానంలోని
 వెలుగు నిచ్చెన

వేసే అడుగు మీద 
చేసే మువ్వల సవ్వడిలో
ప్రతిధ్వనించే పడతి పద
కింకిణీ రవాలు

కలల రాత్రి మీద వెన్నెల 
సోయగాల్లో చంద్రుడి 
దోబూచులాటలో సిగ్గు పడ్డ ఎర్ర బుగ్గలు

ఎదిరి చూపుల మీద
విసుగు పాటతో
హృదయ నివేదనం  

ఆరాధన, ఆత్మీయత
తపన,తనుకులాట
ముడి వేసుకొని  వచ్చిన  కుచేలుడికి పరమాత్ముని
అటుకుల మూట

రంగు నల్లకలువే 
రూపం తోసిరాజి
లెక్కలహద్దులు దాటి తెప్ప మీద తేలియాడే  అంతరాత్మ సోయగం 

అభివ్యక్తులు
ఆరున్నోక్కరాగలలో  వినపడే జయదేవుడి అష్టపది ఇరువురి పరస్పరాధిత ఇష్టపది

మెప్పుకోలు, ఒప్పుకోలుకు తలలు వంచక  
రాజీలేని మనసు రంగులరాట్నం మీద పలికే చిలుక


కామెంట్‌లు