ఓటమి నించి గెలుపు: - ఎం. బిందు మాధవి

 ప్రకేత్ ఈ మధ్యన కొంచెం డల్ గా ఉంటున్నాడు. ఎక్కువగా ఎవ్వరితోను మాట్లాడట్లేదు.
ఆ రోజు స్కూల్ నించి వచ్చి ఆటలకి వెళ్ళకుండా, రూంలో ఒంటరిగా చీకట్లో కూర్చున్నాడు.
బామ్మ కామేశ్వరమ్మగారు మనవడు స్కూల్ నించి వచ్చే టైమయిందని పాలు కలిపి ఎదురుచూస్తున్నారు. ఇంతలో గ్యాస్ సిలిండర్ వచ్చిందని బెల్లు మోగితే తలుపు తీసి సిలిండర్ ఇచ్చి, డబ్బు తేవటానికి రూం లోకి వెళ్ళినప్పుడు, స్కూల్ నించి వచ్చిన ప్రకేత్ రూం లోకి వెళ్ళటం ఆవిడ గమనించలేదు.
స్కూల్ బట్టలు విప్పేసి, మంచానికి అడ్డం పడి ఆలోచిస్తున్నాడు.
కామేశ్వరమ్మగారు మనవడింకా రాలేదనుకుని కంగారుగా అటు ఇటు తిరుగుతూ, పక్కింటావిడతో "ఏమండి పిల్లాడింకా రాలేదు. మీ వాడొచ్చాడా"అనడిగారు.
"వచ్చాడండి. మీ ప్రకేత్ కూడా వచ్చాడు, చూడలేదేమో" అన్నది ఆవిడ.
కంగారుగా లోపలికొచ్చి, తన రూంలో లైట్ వేసుకోకుండా మంచానికి అడ్డంగా పడుకున్న ప్రకేత్ ని చూసి "ఏం నాన్నా, ఒంట్లో బాగాలేదా" అని నుదుటి మీద చెయ్యి పెట్టి చూసి "లే లేచి పాలు తాగు. ఏం జరిగింది. స్కూల్లో ఏమైనా గొడవయిందా? టీచర్ ఏమన్నా అన్నారా" అని ఆదుర్దాగా అడిగారు.
"బామ్మా పోయిన నెల అసైన్ మెంట్ లో నాకు సైన్స్ లో తక్కువ మార్క్స్ వచ్చాయని టీచర్ అందరి ముందు హేళనగా మాట్లాడారు. ఈ సారి ఎలాగయినా మంచి మార్కులు రావాలని కష్టపడి చదివాను. కానీ పరీక్ష టైం కి చదివింది గుర్తు రాక సమాధానాలు వ్రాయలేకపోయాను. ఇప్పుడు కూడా మార్కులు తగ్గాయని, టీచర్ మొద్దబ్బాయి అని నలుగురిలో అన్నది" అని ఏడుస్తూ చెప్పాడు.
"ఓష్ ఇంతేనా! ముందు లేచి కాళ్ళు చేతులు కడుక్కుని పాలు తాగు. మనం కాసేపు "చైనీస్ చెక్కర్" ఆడదాము. పార్క్ కి నాతో పాటు వచ్చే కుముదిని గారని చెప్పానే..వారబ్బాయి సైన్స్ ట్యూషన్ చెబుతాడేమో అడుగుతాను. నువ్వేమి తెలివి తక్కువ వాడివి కాదు. పాఠం సరిగా అర్ధం కాక ఇబ్బంది వచ్చి ఉంటుంది" అని చైనీస్ చెకర్ బోర్డ్ మీద ఇద్దరికీ మార్బుల్స్ సర్దింది.
ఆట మొదలు పెట్టినా, ప్రకేత్ ఇంకా మామూలు అవక ఆలోచిస్తున్నాడు. గమనించిన కామేశ్వరమ్మగారు "ఇదిగో పండూ నీకు రామాయణం తెలుసా" అనడిగారు. "తెలుసు బామ్మా"అని టూకీగా రాముడుశివ ధనుర్భంగం చేసి సీతని పెళ్ళి చేసుకోవటం, పట్టాభిషేకానికి ముందు మంధర మంత్రాంగం వల్ల కైకేయి రాముడిని వనవాసానికి పంపి భరతుడికి పట్టాభిషేకం చెయ్యమనటం, రాముడు అడవికి వెళ్ళటం ...దశరధుడు ఆ కారణం వల్ల చనిపోవటం, అడవిలో రాముడు అనేకమంది రాక్షసులని చంపటం, మాయలేడిని కోరిన సీత కోరిక తీర్చటానికి వెళ్ళిన రాముడు, ఒంటరిగా ఉన్న సీతని రావణుడు ఎత్తుకెళ్ళటం, హనుమ సముద్రం దాటి వెళ్ళి సీత జాడ కనుక్కోవటం, తరువాత జరిగిన రామ రావణ యుద్ధం గురించి చెప్పాడు.
"కానీ రామాయణంలో పిల్లలు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. అప్పుడప్పుడు అవి నీకు చెబుతాను. విను. నీకు రాముడికి అస్త్ర విద్యలు నేర్పిన గురువు ఎవరో తెలుసా?"అనడిగింది.
"విశ్వామిత్రుడు" అన్నాడు. "ఆ విశ్వా మిత్రుడి గురించి తెలుసా" అనడిగి చెప్పటం మొదలు పెట్టింది.
"విశ్వా మిత్రుడు ఒక రాజు. ఒకసారి అడవిలో వేటకి బయలుదేరి చాలా దూరం వెళ్ళిపోయి, జంతువులని వేటాడీ వేటాడీ అలసిపోయి దగ్గరలో ఉన్న వశిష్ఠ ఆశ్రమానికి వెళతాడు. అక్కడ విశ్వామిత్రుడి సేనలకందరికీ అతిధి మర్యాద చెయ్యటంలో వశిష్ఠుడికి సహాయం చేసిన "శబల" అనే కామధేనువు సంతతి ఆవుని చూసి దాన్ని తనకి ఇచ్చెయ్యమనీ, రాజుని కాబట్టి రాజ్యంలో అన్నిటి మీద తనకే అధికారం ఉంటుందని వశిష్ఠుడితో గొడవపడి ఆయనతో యుద్ధం చేసి భంగపడి, తన నూరుగురు పుత్రులని పోగొట్టుకుని తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు."
"అప్పటి నించీ వశిష్ఠుడికి అంత శక్తి, తపస్సు వల్ల కలిగిందని గ్రహించి సదాశివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. అలా దివ్యమైన ధనుర్విద్య మొత్తం అన్ని అంగాలతో శివ ప్రసాదంగా పొందుతాడు."
"అసలే గర్విష్ఠి అయిన విశ్వామిత్రుడు, శివప్రసాదంగా పొందిన తన ధనుర్విద్యని అంతా ఉపయోగించి అనేక అస్త్రాలని వశిష్ఠుడి ఆశ్రమ ప్రాంతంలో వేసి ఆ ప్రదేశాన్నంతా సర్వ నాశనం చేస్తాడు. ఆయన ఇంకా కోపం చల్లారక బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తున్నప్పుడు వశిష్ఠుడు తన బ్రహ్మ దండంతో అన్నిటినీ నిర్వీర్యం చేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు, వశిష్ఠుడి శక్తి అంతా అతని బ్రహ్మ దండంలో ఉన్నదని, ఎలాగయినా అది సాధించాలని, అది తపస్సుతో మాత్రమే సాధ్యమని తపస్సు చెయ్యటానికి వెళతాడు."
"అలా తపస్సు చేసి సంపాదించిన శక్తితో, వశిష్ఠుడు తిరస్కరించిన "త్రిశంకు" అనే రాజుని శరీరంతో స్వర్గానికి పంపే ప్రయత్నం చేసి ఆ శక్తినంతా పోగొట్టుకుంటాడు. అలా మళ్ళీతన ధ్యేయమయిన బ్రహ్మర్షి పదవి కోసం మళ్ళీ తపస్సు చేసి మధ్య మధ్యలో కలిగే అనేక ఆటంకాలని దాటుకుంటూ, ప్రతి సారీ తనకి కలిగే చపలత్వాలు, ఆవేశం..కోపం కారణంగా తన తపశ్శక్తినంతా పోగొట్టుకుంటూ మళ్ళీ ప్రయత్నం చేసి చివరికి బ్రహ్మర్షి పదవిని వసిష్ఠుడి ద్వారానే పొందుతాడు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు జరిగినా అనుకున్నది సాధించే వరకు పట్టుదల వదలకూడదన్నమాట"!
"రామాయణం ఒక కధే కదా! ఇలా ఎవరయినా మనుషులు అన్నేళ్ళు తపస్సు చెయ్యగలరా" అనడిగాడు ప్రకేత్.
"రామాయణం కధ అనుకున్నా, చరిత్ర అనుకున్నా, నిజమనుకున్నా అది మనకి ఎన్నో విషయాలని నేర్పిస్తుంది. అనుకున్న లక్ష్యం సాధించేవరకు అవిశ్రాతంగా కృషి చేస్తూనే ఉండాలి. మధ్యలో అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అవమానాలు ఎదురవుతాయి. అంత మాత్రాన నిరుత్సాహ పడకుండా పట్టుదలతో అనుకున్నది సాధించేవరకు ప్రయత్నం చేస్తూ ఉంటే విజయం తప్పక దొరికే తీరుతుంది అనేది ఈ కధ ద్వారా తెలుసుకోవచ్చు" అని కామేశ్వరమ్మగారు మనవడితో ఆట ఆడుతూనే అందులో మెళుకువలు నేర్పుతూ విశ్వామిత్రుడి కధ చెప్పి, అతన్ని నిరుత్సాహపడకుండా ధైర్యం చెప్పి తనకి తెలిసిన వారి దగ్గర తెలియని పాఠాలు చెప్పించుకునే ఏర్పాటు చేసింది.
బామ్మ చెప్పిన కధతో స్ఫూర్తి పొందిన ప్రకేత్ శనాదివారాలు కుముదిని గారి అబ్బాయి దగ్గరకి వెళ్ళి తనకి కొరుకుడు పడని పాఠాలు చెప్పించుకుని, కష్టపడి చదివి ఆ సంవత్సరం ఫైనల్ పరీక్షల్లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు.