ఆడ ఉడుత - అరిసెల వంట (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

           ఆడ ఉడుతకు అరిసెల మీద ఆశ పుట్టింది.
        "ఏమయ్యో! కాసిని కట్టెలు ఏరుకురా అరిసెలువండుతాను" అన్నది మగ ఉడతతో. 
        మగ ఉడుతకు కోపం వచ్చింది.
        “ఏమే ఆడ ఉడత!  మొగుడునని చూడకుండా నాకే పని చెబుతావా?" అని పక్కనే ఉన్న పప్పు గుత్తి విసిరింది. 
       అది ఆడ ఉడుత తలకు తగిలింది.
       “ఓరి నాయనో చంపాడు రా ఈ మతిలేని మొగుడో" అంటూ ఆడ ఉడుత పరుగెత్తింది. 
       పోయింది పోయినట్టుగానే ఉంది.
       ఎంతకూ రాలేదు.
       మగ ఉడుతకు కాలు చేయి ఆడలేదు.   
        ఆందోళన కలిగింది. 
        అగపడిన వారందరిని అడిగింది.
        అత్తవారి ఇంటికి వెళ్ళింది. 
        అక్కడ కూడా లేదు.
         ఏమి చేయాలో తోచక తల పట్టుకుంది. 
         ఆడ ఉడుత తల్లిదండ్రులు అల్లుడితో పాటు బయలుదేరారు. 
         నూతులు, గోతులు వెదికారు.
         ఎక్కడా లేదు.
         చివరికి ఇంటికి చేరారు. 
         ఇంటిలో మంట వెలుగుతుంది.
         "ఇంట్లో ఎవరా వంట చేస్తుంది" అని మగ ఉడుత తొంగి చేసింది. 
        ఆడ ఉడుత అరిసెలు వండుతుంది.   
        "ఎక్కడికి వెళ్ళావే" అని అడిగింది మగ ఉడుత. 
         "ఇంకెక్కడికి... కట్టెలకి" అంది పెళ్ళాం. 
         "చంపావు కదే. ఇరుగో మీ అమ్మా నాన్నలు" అన్నది మగ ఉడుత. 
        ఆడ ఉడుత ఎగిరి గంతేసింది. 
        అమాంతంగా వచ్చి అమ్మానాన్నలను వాటేసుకుంది.
        వండిన అరిసెలన్నీ వారికే పెట్టంది. 
         మిగిలిన అరిసెలను మూట కట్టి పంపింది. 
          మొగుడుకి ముక్క కూడా పెట్టలేదు.
          గుటకలు మింగుతూ గుడ్లురిమి చూసింది మగ ఉడుత.
         నిజమే మరి పని చేయని వానికి తినే అర్హత ఎక్కడిది?
కామెంట్‌లు