రాలిన పువ్వు -బాల గేయం (మణిపూసలు ):--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

గ్రీష్మo పు  తాపమే 
రాలినది పుష్పమే 
కుమిలినవి  మొక్కలూ 
వేసెనుగ జగడమే !

ఏమయ్య భానుడా 
సెగలిచ్చు వీరుడా 
తగదయ్య ఇదినీకు 
పూలేవి రాయుడా !

బోసిగా ఉన్నాము 
రాణించ కున్నాము 
రంగుల్ల మా పూలు 
రాలిపో తున్నాము!

గులాబీ అడిగింది 
చేమంతి చెరిగింది 
మరువమే మహమాడి 
సంపంగి ఏడ్చింది!

మల్లెపూ లొక్కటే 
మనసార నవ్వుటే 
విరజాజి గుప్పెడుగ 
పరిమళం వీచుటే !

మొగలిరేకులు గూడ
మౌనముగ తాముండ
ఋతువులో ధర్మమని 
వివరించ బోతుండ!

గయ్యిమని అరిచాయి 
గగ్గోలు పెట్టాయి 
తక్షణము న్యాయమే 
కావాలి అన్నాయి!

మేఘుడికి నవ్వొచ్చి 
ఒకతునక జారొచ్చి 
అరుణాస్తమయములో 
పువ్వువలె అమరిచ్చి!

చూసారా మొక్కలూ 
పడు వాన చుక్కలూ 
అప్పుడే పూలన్ని 
మరివేయు మొగ్గలూ!

కామెంట్‌లు