పుస్తకనేస్తo - అందరి ఆనందములే ---- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
గొడ్లకాడ బుడ్డోడుకి మాపటిదాకా తోడు 
అంగన్వాడీ అయ్యోరమ్మ ఇచ్చిన 
అచ్చరాల పుస్కo,పలక 
తోటల్లో కాయలేరే పన్నెండేళ్ల 
లచ్చిమికి కాలక్షేపం సందమామ బొమ్మలపుస్తకం 

ఇంటెడుపని ఇంచక్కా
ఊర్మిళానిద్రనో కాంభోజరాజు కథనో 
పాడుకుంటా చేసే బామ్మకి 
నాల్గు మెతుకులు తిని 
వంట వసారాలో చల్లగాలికి 
తుంగచాపమీద పీట తలకింద 
పెట్టుకొని.. 
ఏనుగుల వీరాస్వామయ్య గారి 
కాశీయాత్ర చరిత్ర చదువుతూ 
మళ్ళీ కాఫీల దాకా కునుకు !

అనుకోని ప్రయాణంలో 
విసుగొచ్చేసింది విశ్వనాధకి 
బ్యాగ్ లో అగాథాక్రిస్టీ నవలతో 
బోలెడు సస్పెన్స్,టైమ్ పాస్!

ప్రక్క పల్లెలో టీచర్ ప్రభావతి 
లీజర్ పిరియడ్ లో అబ్బూరి 
ఛాయాదేవి తనమార్గంలో నే.. 
వైవిధ్యం కోరే సుచిత్రకి 
పరవస్తు లోకేశ్వర్ "సిల్క్ రూట్స్ "ఉండనే ఉంది !

ఎవరికి మింగుడు పడని 
కొత్త పీజీ కుర్రాడు.. 
చేతిలో.. 
"అతడు అడవిని జయించాడు"  
పక్కన ఉన్న పద్మశ్రీ చదువుతుంది "తండ్రులు -కొడుకులు "ఇ. తుర్గేనివ్ రచన 
సోవియట్ రష్యా కన్నీటికథ!
అందరికి ఆనందం ఇచ్చే.. 
పుస్తకం నిత్య భూపాలరాగం!కామెంట్‌లు