ప్రశ్నల్లో సూక్ష్మం:- కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445


  తల్పగిరి రాజు సింహసేనడు జనరంజకంగా పరి పాలన సాగిస్తున్నాడు.ఆయనకు ఒక్కతే కూతురు మందాకిని.ఆమె విద్యలలో దిట్ట.మంచి తెలివి గలది.ఒక్కొక్క సారి రాజ కార్యాలలో  సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు చూపి రాజ సభలో అందరి మన్నలను పొందేది.

       ఇలా ఉండగా మందాకిని యుక్తవయస్కురాలైంది.తగిన వరుణ్ణి చూసి మందాకినికి వివాహం చెయ్యాలని సింహసేనుడు నిశ్చయించాడు.ఈ విషయం మందాకనికి సింహసేనుడు చెప్పాడు.

         "నాన్నా, వివాహం చేసుకుంటాను కానీ, నేను తల్పగిరి విడిచిపోను,దీనిని మీరు అర్థం చేసుకోండి"అని చిరు నవ్వుతో చెప్పింది.

      "నాన్నా,నేను స్వయం వరంలో పాల్గొన్న వరులను కొన్ని ప్రశ్నలు అడుగుతాను,నాకు సంతృప్తిగా సమాధానాలు చెప్పిన వారినే పెళ్ళాడుతాను"అని చెప్పింది.

      "నీ ఇష్ట ప్రకారమే చేద్దాం,ముందర నేను స్వయం వరంలో పాల్గొన బోయే వరులకు కత్తి యుద్ధం,భారత,భాగవత,మొదలైన పురాణాల్లో గల విజ్ఞానం గురించి పరీక్షలు పెడతాను,నాకు నచ్చిన వారిని నీవు నీ ప్రశ్నలు అడిగే ఏర్పాటు చేస్తాను"అని చెప్పాడు.

       "మంచి ఆలోచన నాన్నా, అలాగే కానివ్వండి"అని తన సంసిద్ధత తెలియచేసింది మందాకిని.

       సింహసేనుడి స్వయంవర చాటింపు విని అనేక మంది రాజ కుమారులు,ధనవంతుల కుమారులు వచ్చారు.

      రాజుగారు పెట్టిన పరీక్షలలో నెగ్గిన ముగ్గురు రాజ కుమారులు మందాకిని ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ఎంపిక అయ్యారు.

       "నేను ఎప్పటికీ తల్పగిరిలోనే ఉండి పోవాలి,నా వయస్సు ఎప్పటికీ తరగి పోకూడదు...ఈ ప్రశ్నలకు జవాబులు మీ దగ్గర ఉన్నాయా?" అని అడిగింది

     ఈ ప్రశ్నలలోని సూక్ష్మాలను ఇద్దరు రాజ కుమారులు గ్రహించ లేక పోయారు.అవి పిచ్చి ప్రశ్నలుగా భావించి వారు వెళ్ళి పోయారు.

       మూడో రాజ కుమారుడు ప్రసన్న కొంత సేపు ఆలోచించి మందాకిని ప్రశ్నలకు జవాబులు ఈ విధంగా చెప్పాడు.

       "మీరు ఎప్పటికీతల్పగిరిలో ఉండాలంటే ప్రజలకు శాశ్వతంగా మేలు చేసే పనులు చేయాలి,తద్వారా మీ మంచి పనులు సదా తలచు కుంటూ మీరు ఇక్కడే ఉన్నట్టు భావిస్తారు!మీరు చేసిన మంచి పనుల వలన ప్రజల హృదయాల్లో శాశ్వతంగా జీవిస్తారు.మీరు చేసిన మంచి పనులను గురించి తరతరాలుగా చర్చించుకుంటారు.అంతేకానీ మీ వయస్సును గురించి చర్చించరు.ఈ విధంగా వారి దృష్టిలో మీ వయస్సు పెరగదు!"అని చిరునవ్వుతో చెప్పాడు ప్రసన్న.

       అతని సమాధానాలు మందాకినికి ఎంతో తృప్తి నిచ్చాయి.సింహసేనుడు కూడా ప్రసన్న తెలివికి,సూక్ష్మాన్ని గ్రహించే శక్తిని మెచ్చుకుని ఒక శుభ ముహూర్తాన మందాకిని,ప్రసన్నలకు ఘనంగా వివాహం జరిపించాడు.

             


కామెంట్‌లు