కష్టార్జితం:-డి.కె.చదువులబాబు.ప్రొద్దుటూరు.కడపజిల్లా.9440703716.

 కొత్తపేటలో నందయ్య అనే రైతు ఉన్నాడు. నాలుగు ఎకరాలపొలం అతని జీవనాధారం.ఎంతోకష్టపడి తనకూతురు రమకు ఒకమంచి సంబంధం చూశాడు. పట్నంవెళ్ళి కూతురుకు అందమైన హారం కొన్నాడు.హారంపెట్టెను సంచిలో ఉంచుకుని ఊరికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఇదంతా గమనించిన దొంగ నందయ్యను వెంబడించాడు.వాడి కబుర్లు విని వాడూ తన ఊరికి వస్తున్నాడని నమ్మాడు నందయ్య. మార్గమధ్యలో ఇద్దరూ ఒక చెట్టు క్రింద విశ్రమించారు.
నడకతో ఎండకు అలిసి ఉన్న నందయ్య చల్లని గాలికి నిద్రలోకి జారుకున్నాడు. అవకాశంకోసం ఎదురుచూస్తున్న దొంగ మెల్లిగా సంచిని తీసుకొని వెళ్ళిపోయాడు. మెలుకువ వచ్చిన తర్వాత లేచి చూస్తే సంచిలేదు.తనతో వచ్చిన మనిషి లేడు. ఎండలో,వానలో ఎంతో కష్టపడి పొలం పండించుకుని,తినీతినక పొదుపు చేసుకున్న ధనంతో కొన్న నగ పోవడంతో చాలా బాధపడుతూ ఇల్లుచేరాడు.
దొంగ పట్నం చేరుకుని నగ అమ్మడానికి నగలదుకాణానికి వెళ్ళాడు. తన చెల్లెలు అమల కోసం నగలు కొనడానికొచ్చిన రక్షణఅధికారి రంగయ్య పాతదొంగను గుర్తుపట్టాడు.బంధించి భటులకు అప్పగించాడు.రక్షణాధికారి రంగయ్య ఊరు కొత్తపేట.ఉద్యోగరీత్యా పట్నంలో ఉంటున్నాడు.అతని అమ్మానాన్న , చెల్లెలు అమల కొత్తపేటలోనే ఉంటున్నారు. అమల వివాహం దగ్గరలో ఉంది. తాను కొన్న నగలతో కలిపి దొంగనుండి తీసుకున్న హారాన్ని కూడా తీసుకెళ్ళి చెల్లెలికిచ్చాడు రంగయ్య.
అమల వివాహం ఘనంగా జరిగింది. వివాహం పూర్తయ్యాక అమల స్నానానికెళ్ళాలని నగలను తీయసాగింది. పెరడులో చెట్టుమీదున్న కోతి నగలను గమనించి పరుగున వచ్చింది. అమల చేతిలోని హారాన్నిఎత్తుకెళ్ళింది. ఆహారం నందయ్యది.తర్వాత కోతిని గుర్తించడం ఎవరికీ సాధ్యం కాలేదు. హారాన్ని తీసుకెళ్ళిన కోతి నందయ్య ఇంటి పెరట్లోని చింతచెట్టెక్కిహారాన్ని అటూఇటూ కొరికి చూసి,చెట్టుపై వదిలేసి వెళ్ళిపోయింది. ఉదయమే నిద్రలేవగానే హారాన్ని తల్చుకుని కూతురు పెళ్ళి ఎలా అని కుమిలిపోతున్న నందయ్యతో  "ఎలా జరగాల్సిఉంటే అలా జరుగుతుంది.వెళ్ళి చింతాకు కోసుకురండి. వంటచేస్తాను"అంది నందయ్య భార్య.
చింతాకు కోసం చెట్టెక్కిన నందయ్యకు హారం మెరుస్తూ కనిపించింది. అది తాను కొన్న హారమని గుర్తుపట్టాడు. హారాన్ని తీసుకుని చెట్టు దిగివచ్చి భార్యకిచ్చాడు. ఎక్కడో దొంగ ఎత్తుకెళ్ళిన హారం తన ఇంటిలోని చెట్టుమీదకు ఎలా వచ్చిందో వారికి అర్థం కాలేదు. 'ఇది మన కష్టార్జితం. మనం కష్టపడి సంపాదించుకున్నది ఎవరు తీసుకెళ్ళినా తిరిగి మనకే దక్కుతుంది. అంతా భగవంతుడి లీల' అనుకున్నారు ఇద్దరూ.

కామెంట్‌లు