*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౯౮ - 98)

 కందము :
*శిరమున రత్నకిరీటము*
*కరయుగమున శంఖచక్ర | ఘనభూషణముల్*
*ఉరమున వజ్రపు పతకము*
*సిరినాయక అమరదాల్తువు | శ్రీహరి కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
నువ్వు లక్ష్మీ దేవి నాయకుడవు, భర్తవు అయిన విష్ణుమూర్తివి.  రత్నాలు, వజ్రాలు పొదిగిన కిరీటాన్ని తలపైన పెట్టుకుంటావు.  ఎంతో గొప్పవైన శంఖు చక్రాలను రెండు చేతులలో ధరిస్తావు.  మణి మాణిక్యాలు, కౌస్తుభము మొదలగు విలువైన వస్తువులతో తయారు చేయబడిన ఆభరణాలను శరీరము పైన ధరిస్తావు. అందగాడివి, కృష్ణా!!! ...అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*ఏమి తక్కువయ్యా, నీకు.  సర్వసంపదలూ ఈయగల లక్ష్మీ దేవికి భర్తవు నువ్వు.  అలంకార ప్రియుడవు.  నుదుటను కస్తూరి తో దిద్దిన తిలకం పెట్టుకుని, కౌస్తుభ మణిని గుండెలపై వుంచుకుని, నెమ్మేనిపై చందనాలు అలదుకుని, అనేక విధాలైన మణులతో కూడిన హారాలను మెడలో ధరించి,  గోపగోపికలు నీ చుట్టూ తిరుగాడుతున్న నిన్ను చూచి, నీ అందాన్ని, అతిశయాన్ని, పొగడడానికి గాని వర్ణించడానికి గాని నాకు సాధ్యం కాదు కదా, వకుళకుమారా.  నా వంటి దైవమూ, నా ఇంటి దైవమూ అయిన నిన్ను ఏమని వర్ణించగలను, స్వామీ.  నీ వర్ణన కూడా నీ దయతోనే జరగాలి కదా, వెన్నలదొంగా!!!*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు