పొట్టాపతి:-సముద్రాల శ్రీదేవి 9949837743

 రెక్కాడితే కానీ డొక్కాడదు
కాలు కదపనిదే కడుపు నిండదు
రాత్రి కప్పుకున్న దుప్పటి
ఎన్ని చిరుగులు వున్నా,
పొద్దు జాడ కమ్ముకోగానే
పొట్టాపతి కోసం పడే పాట్లు 
 లెక్కచేయవు ఇన్ని అగచాట్లు
పొగ వూదిన గొట్టం నుండి 
ఎగిసిన పోయిలోని మంటలు
ఆరని ఆకలి జ్వాలలుగా 
కణం కణం రవ్వల్లా రువ్వుతున్న 
జీవనం.
నేల  కంచములో వడ్డించుకు తిన్న బాధల మెతుకులు
జోలె లోని చిరుగుల కన్నాలే
కన్నుల కాలువ  దాటని 
నీరై  మది మత్తడి కింద
రహస్యంగా  దాచుకుంది.
భారంగా వాలిన రెప్పల అలికిడి
భుజాల బరువును  కొలిచిందేమో
మోయలేని  భవ సాగరపు 
బిందువుని కనుదోయి చివర్ల
భారాన్ని దించాలని ప్రయత్నిస్తుంది.
చిరునవ్వుల పెదవి  పదవి పీఠంపై మహారాజులా 
ఓటమి నెఱుఁగని 
ఆత్మ స్టైర్యమై
కూర్చుంది
నర్మ గర్భస్థ దేహం
 ఆక్టోపస్ లా  శరీర అంగాలన్నింటితో  శ్రమించినా   ఫలితం అందని జీవన వైరుధ్యం
 ఫలం నోటికి దొరకని దురదృష్ట
సాఫల్యం
నాలుగు వెళ్లే కదా నోటి ముద్ద పెట్టేది,
నాలుగు కాలాలు చల్లంగ చూస్తే 
నాలుగు రోజులు గడచిపోదా
అన్న ధీమానే , పొద్దున్నే 
పొద్దును మూటగా గట్టుకొని
 వెళుతుంది  బతుకు పయనం


కామెంట్‌లు