దైర్యే సాహసే విజయం :-కంచనపల్లి ద్వారకనాథ్, చరవాణి: 9985295605

                “నాన్నా ...మీ    సైకిల్ నేను తుడుస్తాను “   అన్నాడు రాజు . “ఒరేయ్ ... వద్దురా అది నీ వల్ల కాదు .మీద  పడేసుకుంటావ్ ..ఇలాంటి పనులు   చేయవద్దని ఎన్ని సార్లు చెప్పినా  వినవా ?  అన్నాడు రాజువాళ్ళ  నాన్న.  
అక్కడినుoడి వెళ్లిపోతున్న రాజు మనసులో “నాన్న ఎప్పుడు యింతే ఏ పని చేస్తానన్నా నీకు రాదు ,నీవు చేయలేవు ..అంటుంటాడు ..ఎందుకో అర్థం  కాదు” అనుకున్నాడు .
   రాజు వాళ్ళ అమ్మ “రాజు .. ఆ నీళ్ళ బక్కెట  కాస్త తెచ్చి పెట్టరా “ అంది.  “అలాగే అమ్మ  తెస్తున్నా”  అంటుండగా వాళ్ల నాన్న “  ఒరేయ్ ... నీవు అంతా బరువు మోయలేవురా  ...నేను  అమ్మకి పట్టు కెళ్ళి ఇస్తాలే నీవు పోయి చదువుకో “ అన్నాడు . 
   పెరట్లో రాజు గాలిపటం ఎగిరెస్తున్నప్పుడు  అది  అక్కడే   వున్న చెట్లో  ఇరుక్కొపోవడంతో   రాజు   తీసుకువాలని  చెట్టు ఎక్కడం చూసిన వాళ్ళ నాన్న చూసి  హడావిడిగా అక్కడకు వచ్చి  “ ఒరేయ్ .. నీ వల్ల కాదు కానీ నేను తీసి ఇస్తాను  .ఇప్పుడు ఆ చెట్టు ఎక్కి  పటాన్ని తీసుకోవడంలో ఏదైనా జరిగితే ఇంకేమైనా వుందా ? “ అంటూ పటాన్ని తానే  తీసి ఇచ్చాడు . పటం దొరికిందన్న సంతోషం కన్నా రాజులో  ఏదో తెలియని బాధతో ‘  నాన్న ఇంతే ఏ పని నన్ను   చేయనీయడు ‘  అని మనసులో  అనుకుంటూ     నిరుత్సాహ పడ్డాడు . 
  రాజు వాళ్ళ  నాన్నకు ఆ రోజు ఆఫీసు సెలవ కావడంతో “ నాన్నా  ఈ రోజు  మీకు సెలవు కదా క్యారమ్స్ ఆడుదామా ?  “ అని రాజు అడగగానే “ఆ( ... అలాగే ఆడుదాం అంటూ క్యారమ్ బోర్డు ముందు ఇద్దరు కూర్చుని ఆడసాగారు . రాజు  ఆడు తున్నప్పుడల్లా వాళ్ళ నాన్న “ రాజు ..ఆ కాయ ను  స్ట్రైకర్  అక్కడపెట్టి కొట్టు ..ఈ కాయను ఈ యాంగిల్లో పెట్టి కొట్టు” అని ఆటముగిసే వరకు రాజుకి   చెప్పడంతోటే  ఆరోజు ఆటముగిసింది .  
   రాజుకి అప్పుడప్పుడు వాళ్ళ నాన్న రోజు  చెప్పే      , నీవు ఆ పని చేయలేవు , ,నీ వల్ల కాదు జాగ్రత్తలు అన్న   మాటలు విని విని “ అసలు మా నాన్న నాకు   జాగ్రత్తలు   చెపుతున్నాడా ? లేదా నన్ను  ఒక   అసమర్ధుడు అనుకుంటున్నారా ?  అన్న సందేహం రాసాగింది   .
   రాజు వాళ్ళ స్కూల్లో   పి యి టీ మాస్టర్ విక్టర్ పిల్లలని అన్నీ రకాల ఆటలు , వ్యాయామం లాంటివి చేయిస్తు     ప్రోత్సహిస్తుండేవాడు . ఆ  రోజు    పి యి టీ  క్లాసులో  పిల్లల్ని   కోతి  కొమ్మచ్చి ఆట ఆడిస్తున్నాడు . అందరూ పిల్లల్లు బాగాడుతున్నారు . కానీ రాజు  ఆడకుండా   నిలబడి  చూస్తుండడం గమనించిన  విక్టర్ మాస్టర్ “ఏం.. రాజు నీవు చెట్టు ఎక్కలేదు ? “ అడిగాడు . రాజు “ అది ..అది.... నేను ఎక్కలేను సార్ “ అన్నాడు .”  రాజు  నీవు ఎందుకు ఎక్కలేవు ? చెప్పు “  అనగానే   “సార్ .. నేను ఎక్కలేను ...  మా నాన్న చెట్టు   ఎక్కవద్దని చెప్పాడు.  అన్నాడు.  “ రాజు మనం చిన్నప్పడినుండి మంచి పనులు ,  వ్యాయామం , క్రీడలు అనేవి చేసేటప్పుడు  భయం లేకుండా ధైర్యం తో  చేయడం  అలవారుచుకోవాలి . .నీవు బయపడకు వీళ్ళ లాగే చెట్టు   ఎక్కు  నేను  వున్నాను కదా .”   అనగానే  “ సరే సార్ ..  ఎక్కుతా  అంటూ చెట్టు ఎక్కి వాళ్ళతో ఆడసాగాడు . 
     మరుసటి రోజు విక్టర్ మాస్టర్ క్యారమ్ బోర్డు ఆడించసాగాడు . రాజు సరిగా ఆడక  పోవడం  గమనించి “  ఎందుకు సరిగ్గా ఆడ లేకపోతున్నావ్ ?  ఏ  కాయ వేయాలన్న నన్ను అడుగుతున్నావ్. గురి చూసి కొట్టలేవా ?  “ అని రాజును  ప్రశ్నించాడు . 
 “ సార్ .. అది .. మా  ఇంట్లో క్యారమ్స్ ఆడేటప్పుడు మా నాన్న  ఆ కాయను ఇక్కడ పెట్టి కొట్టు ,ఈ కాయను  అక్కడపెట్టి కొట్టు అని   ఆట ముగిసే వరకు   చెప్పిస్తుంటాడు.  నాన్న మాటలే  గుర్తు  కొచ్చి  అందు వల్ల అలాగే ఆడుతున్నాను . సార్ “   అన్నాడు . విక్టర్ మాస్టర్ కి రాజు వాళ్ళ నాన్న చేస్తున్న తప్పు అర్ధమైంది . రాజుని ఆట ముగిశాక తన  రూంకి పిలుచుకెళ్ళి , రాజు వాళ్ళ నాన్న గురించి అడిగి అన్నీ విషయాలు తెలుసుకుని   “ చూడు రాజు నీవు చాలా తెలివి గల పిల్ల వాడివి .   నీవు  ఏ పనైనా చేయగలవు దేన్నైనా సాధించ గలవు అన్న    నమ్మకం నాకు వుంది .  మీ నాన్న ..నీవు చేస్తున్న ప్రతి పని గురించి చెప్పే జాగ్రత్తలు  చూస్తుంటే  నీ మీద ప్రేమో , గారాబమో లేదా నీవు ఎక్కడ గాయపడతావో  అనే  భయం అయివుండవచ్చు .  మీ నాన్న లాగే కొందరు తల్లి తండ్రులు తమ పిల్లలని అతి   జాగ్రత్తలు    పాటించమని , భయాన్ని నూరి పోయడం , ధైర్యాన్ని అణచి వేయడం    గూడా  జరుగుతుంది .   దానితో  వాళ్ళు ఏ పనిని  శ్రద్దగా  చేయలేకపోవడం   నిరుత్సాహాo  నిండి   అన్నీ రంగాల్లో   వెనక పడిపోవడం జరగవచ్చు .నీవు నేను చెప్పినట్లు అన్నిట్లో పాల్గొని  ప్రాక్టీసు    చేయి. భారతంలో  రాత్రిళ్ళు కటిక చీకటిలో  అర్జనుడు    ధనుర్విద్య ను  అభ్యసిస్తున్నప్పుడు  ద్రోణుడు  అతని పట్టుదలచూసి    సవ్యసాచిగా తీర్చి దిద్ద గలిగాడు .  నీవుగూడా అలా తయారు కావాలి సరేనా  “   అనగానే  “  సరే సార్... కానీ మా నాన్నా .”. అంటూ నసిగాడు “ చూడు రాజు    మీ నాన్నతో  అన్నీ వివరంగా    మాట్లాడుతాను” . అని రెండవరోజు  విక్టర్  మాస్టర్ రాజు  వాళ్ళనాన్నతో అన్ని వివరంగా మాట్లాడగా అతనిలో మార్పు వచ్చింది .అప్పటినుoడి రాజుని  మాస్టర్ చెప్పినట్లు బాగా చూసుకోసాగాడు .   ఇప్పుడు ఎలాంటి బలహీనతలు లేని  రాజు చదువులోనేకాదు అన్ని క్రీడల్లోనూ విజయం సాధించసాగాడు .      

 


కామెంట్‌లు