పూర్వం కృష్ణ నది తీరంలో ఓ గురుకులం ఉండేది. గోవిందుడు అనే గురువు దాన్ని నడుపుతున్నాడు. ఆయన వద్ద అనేకమంది శిష్యులు చదువుకునేవారు. వారికి నైతిక విలువలతో కూడిన బోధన చేసేవాడు. ఒక రోజు పాఠం చెబుతూ "దేవుడు సర్వాంతర్యామి. చెట్టులోనూ, పుట్టలోనూ, గుట్టలోనూ, ఆకాశంలోనూ ఎక్కడంటే అక్కడ ఉంటాడు. అన్ని వేళలా మనల్ని చూస్తూ ఉంటాడు. మనం తప్పు చేస్తే గుర్తు పెట్టుకుని శిక్షిస్తాడు. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి" అని చెప్పాడు. పిల్లలు ఆసక్తిగా విన్నారు.
పిల్లలకు ఆ పాఠం ఎంత వరకు అర్ధం అయ్యిందో తెలుసుకోవాలి అనుకున్నాడు. ఓ పరీక్ష పెట్టాడు. వారందరికీ తలా ఒక అరటి పండు ఇచ్చాడు. ఎవరూ చూడకుండా తినమన్నాడు. పిల్లలంతా చాటుకు వెళ్లి తిని వచ్చారు. వివేకుడు అనే శిష్యుడు మాత్రం తన పండు తినకుండా వచ్చి గురువుకు ఇచ్చాడు. "అయ్యా! ఎక్కడ తిందామన్న ఒకరు చూస్తున్నారు. అందుకే తినలేకపోయాను" అన్నాడు. "చూస్తుంది ఎవరు ?" అడిగాడు గురువు. "ఆకాశం" అని చెప్పాడు వివేకుడు. "శభాష్!" అంటూ మెచ్చుకున్నాడు గురువు.
ఒకరు చూస్తున్నారు (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి