దొంగ చేతికి తాళపు చెవి....(బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼దార్ల బుజ్జిబాబు

        ఒక చెట్టు మీద పావురాళ్లు జంట ఉండేది. 
       అక్కడే ఒక పిల్లి తిరుగుతుండేది. 
       అది దొంగ పిల్లి.
        పావురాళ్లు బయటకు పోగానే చెట్టుపైకెక్కెది. 
        పెట్టిన గుడ్డును పెట్టినట్టు  తినేది. 
        అందువలన ఒక పక్షి కాపలా ఉంటే, మరో పక్షి ఆహారానికి వెళ్ళేది. 
       ఇలా అవి గుడ్లను కాపాడుకుంటూ ఉండేవి.
       ఒక సారి పక్షుల రాజు పుట్టిన రోజు వేడుకలకు పోవలసి వచ్చింది.
       రెండు పక్షులు తప్పక పోవాలి. 
       లేకపోతే పక్షి రాజు ఊరుకోడు.
        పావురాళ్ళు జంట బాగా ఆలోచించింది.
        వాటికి ఒక ఉపాయం తట్టింది. 
       వెంటనే మగ పావురాయి పిల్లి వద్దకు వెళ్ళింది. 
       “పిల్లి మామ! పిల్లి మామ!! మేము రాజుగారి విందుకు వెళుతున్నాము. 
మా గుడ్లను కాస్తా చూస్తుండు.
       మొత్తం 10 గుడ్లు ఉన్నాయి" అంది.
పిల్లికి ఏం చేయాలో తోచలేదు. 
      పచ్చి వెలక్కాయ నోట్లో పడ్డట్టు అయింది. 
      అవి ఎప్పుడు బయటకు వెళితే అప్పుడు గుటకాయ స్వాహా చేయాలనుకున్న పిల్లి చేసేదిలేక కాపలాకు ఒప్పుకుంది. 
        నోటి ముందు ఆహారం ఉన్నా తినలేక 
       నాలుక చప్పరిస్తూ కాపలా ఉంది. 
       విందుకు వెళ్ళిన పావురాళ్ళు తిరిగి వచ్చాయి.
       గుడ్లను చూసుకొని మురిసి పోయాయి.
కామెంట్‌లు