ఒకానొక నెమలీక:--డా॥ కొండపల్లి నీహారిణి

 బాల్యం ఒక మరచిపోలేని జ్ఞాపిక. గుండె సొరగులో దాచుకొని,తీరిక సమయాలలో నింపాదిగా నెమరువేసుకోవాల్సిన జ్ఞాన దీపిక. మనం ఉన్న ఇప్పటి పరిస్థితులకు మనం గడిపిన అప్పటి పరిస్థితులకూ మధ్య వంతెన వేసుకొని అప్పుడప్పుడు అలా బాల్యానికి వెళ్ళివస్తుండాలి. అప్పుడే భావిజీవితానికి కొంచమైనా  బలం చేకూరుతుంది. ఆ చిలిపి పనులు,ఆ అమాయకత,ఆవేదనలెరుగని ఆ ఏడుపులూ,అమానవీయకోణంలోంచి నవ్వని నవ్వులూ ఎన్నో ఎన్నెన్నో బాల్యానికి మట్టి అంటని అనుభూతులు అన్నీకూడా కళ్ళుమూసుకొని అలా వదిలొచ్చిన తోటలో విహరించిరావాలి. గతం అంతా మధురమైందేమీ కాకున్నవాళ్ళైనాగాని,ఏవోకొన్ని మరచిపోలేని మంచి సంగతులు ఉండే ఉంటాయి. మనసు గతులను మీటుతూ హృదయరాగాలను వినిపించే సుసంగతులుగా 
స్మృతికి తెచ్చుకోవాలి. కొండంత జవాన్నిస్తుంది. అందుకే అంటాను బాల్యం బతుకుపుస్తకంలో భద్రంగా దాచుకున్న నెమలీక అని .ఈ జ్ఞాపకం నాకు అటువంటి ఒకానొక నెమలీక!
     నా చిన్నతనం అంతా శోధన,సాధనలతోనే గడిచింది. ఎప్పుడుచూడూ ఇదేంటి ఎందుకిట్లా అదేంటి ఎందుకట్లా అని అన్నీ తెలుసుకోవడం నేర్చుకోవడంతోనే గడిచింది.బాగా ఆటలు ఆడుకోవాలి,బాగా చదువుకోవాలి.అందరు మెచ్చాలి.ఇదే ఉండేది. అమ్మాబాపు,అన్నయ్యలు,అక్కయ్యా,తమ్ముడూ,బాపమ్మ, దోస్తులు,బడి,తోటోళ్ళు,టీచర్లు అందరూ నిచ్చెనమెట్లే!కన్నతల్లిలా పుట్టిన ఊరు కూడా ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది. ఆ చిన్ననాటి ముచ్చట్లలో నేనో పసిపాపనయిపోతే....
       పచ్చని వరిపొలాల దృశ్యాన్ని చూడగానే అందరికీ ఏమనిపిస్తుందోగాని, నాకు మహదానందాన్నిచ్చేది. ఓ9,10 ఏళ్ళప్పుడు కావచ్చు అమ్మతోబాటు బావిదగ్గరికి వెళ్ళేదాన్ని . ఇరుకుబాయి అనే పేరుతో ఒకటి , వెంకటేశ్వర్ల బాయి అనే పేరుతో మరొక బావి ఉండేవి . పొలం అంతా పచ్చగా పలకరించేసరికి చిన్ని హృదయం కేరింతలు కొట్టదూ?అలా ఏదో తెలియని పిలుపును గాలి మోసుకొస్తుంటే, ముంగురలను సవరించుకున్నట్లే,ఎగురుతున్న పూలపూల కలినేతలంగాను   చేతితో క్రిందకుతోసుకుంటూ పొలాల గట్లమీదినుండి నడిచిన రోజులవి. . అంత దగ్గరనుండి చూస్తేగాని అర్ధంకాలేదు నేనేమని ఊహించుకున్నానో . నా 7,8 ఏళ్ళప్పుడనుకుంటా ఒక తుంటరి ఆలోచన ఆలోచన వచ్చేది . ఇప్పుటికీ ఎప్పుడు గుర్తుచేసుకున్నా నవ్వు వస్తుంది , అంతేకాదు నిజంగా అదే నిజమైతే బావుండుననీ అనిపిస్తూవుంటుంది. దూరం నుండి చూస్తే పచ్చని తివాచీ పరిచినట్లనిపించి ఆకుపచ్చని ఆ పొలంపైన తెల్లని చెద్దరు వేసుకొని పడుకుంటే బావుంటుందనుకునేదాన్ని.పచ్చని ఆ మొలకలక్రింద నల్లని బురద ఉంటుందని ఏం తెలుసు? 
        ఇలాంటి కోరికను చెబితే అమ్మాబాపులైతే నవ్వి ఊరుకుంటారుగాని అక్కయ్య అన్నదమ్ములకు చెప్తే ఇంకేమన్న ఉంటుందా ?ఏడిపించిపెట్టరూ! “ఆ ..పో పో బాగుంటుంది” అని బనాయించిపెట్టరూ !
    వరి పొలంలో కూలీవాళ్ళు కలుపు తీస్తున్నపుడు దగ్గరినుండి చూస్తేగాని తెలిసింది ఒక్కో మొక్కమధ్య ఖాళీ ఉంటుందని! అబ్బో బురదనా అనుకున్నా, అది గడ్డిమొక్కలా అంత పల్చగా సన్నగా ఉంటుందానని ఆశ్చర్యపోయాను . బురదబ్రతుకులేం తెలుస్తాయి? వాళ్ళ జీవితాలకోసమే మా నాన్న పోరాటాలు చేసారని ఏమితెలుస్తుంది?  పక్కనే  కోతకోస్తున్నదీ గమనించాను.      నేలమ్మ గుండెలోంచి ఆకుపచ్చని మొలకలు ఒడ్లగుత్తుల్ని తెచ్చాక, అవి పసుపుపచ్చ రంగులోకి మారుతాయని,వాటిలోంచే తెల్లని బియ్యం వస్తుందనీ తెలుసుకున్నాక “యురేకా” అని అరవకున్నా మనసైతే ఎలుగెత్తింది. 
            ప్రకృతికి మనిషికీ  విడదీయరాని బంధం ఉంటుంది.  ఆ బంధంలోంచి చూస్తే ఎంతైనా ఒక మహా జ్ఞాపకంగా నా చిన్ననాటి ఆ అమాయక ఆలోచన   చెక్కిన బొమ్మలా అట్లా నిలిచిపోయింది . జీవకళ ఉట్టిపడేటువంటి చైతన్యాన్నీ ఇచ్చింది. ఎందుకంటే పల్లెలను వీడి పట్నాల దారిబట్టినందుకు జ్ఞాపకాలే కదా స్థిరసౌందర్య భావనలు పంచేది! ఇప్పుడు ఎప్పుడు గుర్తుకొచ్చినా నవ్వు వస్తుంది. పంటపొలంపై పక్క వేసి పడుకోలేమని తెలియని బాల్యం ఎంత మధుర జ్ఞాపకం! ఎక్కడో ముసుగేసుకొని ఉన్న ఆ తీపి జ్ఞాపకాల మొలకలను మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ మన ‘మొలక’ పత్రిక చిగురింపజేసింది.నా మనసులోని ఒకానొక నెమలీకను చేతిలోకి తెచ్చుకొని చక్కదనాలను చూపించిన ‘మొలక’కు అభినందనలు.
    

కామెంట్‌లు