నెయ్యి బువ్వ (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

       "నెయ్యి బువ్వ తిను నాన్నా.." అని అమ్మ బుజ్జిగాడిని బ్రతిమిలాడింది.
        "ఉహు....నా కొద్దు " అన్నాడు బుజ్జిగాడు.
        "చందమామ ...నువ్వు రా... నెయ్యిబువ్వ పెడతా..." అంది అమ్మ.
         నిజంగా చందమామ వస్తాడేమోనని నోరంతా తెరిచాడు బుజ్జిగాడు.
       అమ్మ ముద్ద పెట్టింది. 
       బుజ్జిగాడు బువ్వను బుగ్గులనిండా కుక్కుకున్నాడు. 
       గుటుక్కున మింగేశాడు.
       బుజ్జిగాడు బువ్వ తింటుంటే చందమామకు నోరూరింది. 
       ఎలాగయిన నెయ్యి బువ్వ తినాలనుకున్నాడు. 
       మారువేషం వేసుకున్నాడు. 
       పేదరాశి పెద్దమ్మ కాడికి వచ్చి  నెయ్యి బువ్వ పెట్టమని అడిగాడు.
       “అయ్యో రామచంద్ర! నేనెక్కడి నుండి తెచ్చేది నెయ్యి బువ్వ.
        'పాడి, పంట' ఉంటేనే కదా నెయ్యి బువ్వ వండేది. 
        నాకు ఆ రెండు లేవు" అంది పేదరాశి పెద్దమ్మ.
       చందమామ పెద్దమ్మకు 'పాడి - పంట' ఇచ్చాడు.
       వెంటనే పెద్దమ్మ వరి పంట వేసింది. 
       పంట పండించింది. 
       వరి కోసి కల్లం చేసింది. 
       ఒడ్లు దంచింది. 
       బియ్యం వండింది. 
       బువ్వ చేసింది. 
       ఆవుకు  వరిగడ్డి మేత వేసింది.
       పాలు తీసింది. 
       తోడుపెట్టింది. 
       పెరుగు చిలికింది. 
       వెన్న తీసింది. 
       కరిగించింది.
       నెయ్యి తయారయింది.
       ఆ రెంటిని కలిపింది. 
       వేడి వేడి ముద్దల్ని చంద్రుడికి పెట్టింది.
       చంద్రుడు నెయ్యి బువ్వ తృప్తిగా తిని వెళ్ళిపోయాడు.
కామెంట్‌లు