శార్దూలము:
*అమ్మా యయ్యయటంచు నెవ్వరినినే | నన్న న్శివా! నిన్ను నే*
*సుమ్మీ! నీ మది తల్లి దండ్రులటం | చు న్జూడగా బోకు నా*
*కిమ్మె తల్లియు తండ్రియున్ గురుడు నీ | వేకాగ సంసారపుం*
*జిమ్మంజీకటి గప్పకుండ గనుమా | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
అమ్మా, నాన్నా అని ఈ భూమి మీద నేను ఎవరినైనా పిలిచి వుండ వచ్చు. కానీ అలా అమ్మా, నాన్నా అని నేను పిలిచింది నిన్నే నయ్యా! ఇంకొకరిని నేను అలా పిలువలేను. నువు ఇచ్చిన ఈ శరీరానికి అమ్మవైనా, నాన్నవైనా, గురువు అయినా నీవే అని ఎంతో నమ్మి వున్నాను. నన్ను ఈ సంసార బంధనంలో కనిపించే కారు చీకటి పొరలు కప్పి వేయకుండా వుంచే దీపాన్ని వెలిగించి నీ దరి చేరే దారి చూపు, భస్మభూషితాంగ! ....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*"శివ శివేతి శివేతి శివేతివా! భవ భవేతి భవేతి భవేతివా!!" అని అనుక్షణమూ నిన్నే నమ్మి వున్న నాకు ఈ శరీరము ఇచ్చింది నీవే కదా, కాలకంఠా! మరి నిన్ను గాక వేరొకరిని అమ్మా, అయ్యా అని పిలుస్తాను అని నీవు ఎలా అనుకోగలవు. అనుకో లేవు. ఎందుకంటే, ఆ వేరొకరిలో కూడా వున్నది నీవే కదా, సర్వలోక పాలకా! అందువల్ల, నేను పిలిచింది నిన్నే, ఇప్పుడు పిలుస్తున్నదీ నిన్నే, ఇకముందు పిలిచేదీ నిన్నే! నీవు కాక నాకు ఇంకొకరు తెలియరు కదా, ఫాలనేత్రా! ఈ నీ మాయా మోహంలో పడి నేను కొట్టుకు పోకుండా, నాకు దారి చూపించే దీపం వెలిగించి, నీ దారి లోకి వచ్చేటట్టు చేయి సామీ. నీ పాద దాసాను దాసుండను ,కదా పార్వతీ నాయకా, పరమేశా పాహిమాం. పాహిమాం.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి