"నిన్ను నీవు ప్రేమించుకో.."*:-చైతన్య భారతి పోతులహైదరాబాద్7013264464
నిన్ను నీవు ప్రేమించుకో..
నీవు అంటే నీ మేను కాదు సుమా!
నీ అంతరాత్మను విశ్వసించడం..
నీ శక్తియుక్తులను బలంగా నమ్మడం

పొరుగువారిని ప్రేమించు..
పొరుగువారంటే నిన్ను పొగిడేవారే కాదు సుమా!
నిన్ను ద్వేషించేవారిని కూడా..
సకల ప్రాణికోటి దైవ స్వరూపాలని నమ్మడం..

అందరిలో ఉంటూ ఏకాంతమవు..
ఏకాంతమంటే ఒంటరి కాదు సుమా!
నీ అంతరంగంలోనున్న అనంతతత్వాన్ని దర్శించుట.. 
సమస్త విశ్వంతో ఏకత్వం చెందుట..

నిన్ను నీవు ప్రేమతత్వన్గా మార్చుకో..
ప్రేమంటే సంకుచిత ఆకర్షణ కాదు సుమా!
విశ్వమంతా ప్రేమ ప్రకంపనామయమని తెలుసుకొనుట
ప్రేమను మించిన అమృతం మరోటి లేదు..

ఆరోగ్యమే మహాభాగ్యము..
ఆరోగ్యమంటే దేహసుఖమే కాదు సుమా!
మనసు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండుట
మనసు కలతపడిన రోగాలపాలు..

ఎల్లప్పుడు ఉపవాసముండు..
ఉపవాసమంటే భోజనం మానివేయుట కాదు సుమా!
పరుగులు పెట్టే మనసుకు కళ్లెం వేసి ఆత్మను పరమాత్మతో లయం చేయుట..

సకల సంపదలు నీ సొంతం..
సంపదలంటే ఆర్థిక లావాదేవీలు కాదు సుమా!
మానసికానందంతో పాటు శరీరారోగ్యం..
సంతృప్తే కదా జీవిత సాఫల్యం..

కళ్ళు రెండూ మూసి రోజూ ధ్యానంచెయ్..
కళ్లంటే బాహ్యనేత్రాలే కాదు సుమా!
చంచలమైన కోతిమనసుకు కళ్లెం వేయుట
అంతా శూన్యమై దివ్య నేత్రముత్తేజితమౌను..

ఇది నా స్వీయరచన. దేనికి అనుకరణ కాదు