రుద్రారం గ్రామంలో కోతుల బెడద ఉండేది. కోతులు కనబడిన వస్తువులనన్నీ అందుకని పోయేవి. ఒకరోజు ఆ గ్రామానికి వచ్చిన శేషగిరి దాహానికి తాళలేక తన చేతిలో నున్న పర్సు పక్కన పెట్టి నీళ్లు త్రాగ సాగాడు. వెంటనే అక్కడకు వచ్చిన ఒక కోతి ఆ పర్సును అందుకొని పారిపోయింది.
శేషగిరి అందులో తన డబ్బు రెండు వేల వరకు ఉందని ,ఇంకా ముఖ్యమైన కాగితాలు కూడా అందులోనే ఉన్నాయని ఊరి వారితో అన్నాడు .వారు కోతిని ఎన్ని రకాలుగా బెదిరించి చూసినా అది ఆ పర్సును క్రింద పడ వేయలేదు. చివరకు శేషు తన చేతిలో కొన్ని రాళ్లు తీసుకుని ఒక్కొక్కటి క్రిందపడ వేయసాగాడు. అలా చేస్తే కోతి కూడా తనలాగే పర్సును క్రిందపడ వేస్తుందని అతని ఉద్దేశం. అయినా కోతి అతని లాగ చేయలేదు.
అప్పుడే అక్కడకు వచ్చిన రాము అనే బాలుడు ఒక మామిడి పండు తెచ్చి కోతికి దూరంగా విసిరాడు.అది పర్సును దూరంగా పడవేసి ఆ మామిడి పండు పడిన ప్రాంతం వైపు పరుగు తీసింది. వెంటనే రాము ఆ పర్సును తీసి శేషగిరికి ఇచ్చాడు. శేషగిరి మారుమాట్లాడకుండా పర్సును తీసుకొని వెళ్ళసాగాడు. ఇది గమనించిన రాము" అయ్యా! నేను చాలా బీదవాడిని. నేను 20 రూపాయలు పెట్టి కొనుక్కున్న మామిడిపండు నేను తినక మీ పర్సు కొరకై దానిని విసిరాను. నాకు నా డబ్బులు మాత్రమే ఇస్తే నేను మరొకపండును కొనుక్కుంటాను" అని అన్నాడు. శేషగిరి "నిన్ను ఎవరు ఆ పండును విసరమన్నారు? కోతి ఆ పర్సును ఆ తర్వాత అయినా క్రింద పడవేయ వచ్చుగా "అని శేషగిరి నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు .
అప్పుడు అక్కడి జనం శేషగిరిని మందలించి "ఆ పిల్లవాడు నీ కొరకు డబ్బు పెట్టి పండును కొని తెచ్చి కోతికి ఇవ్వడం తప్పా! నీ పర్సు కొరకే అతడు అట్లా చేశాడు .అతనికి బహుమతి ఇవ్వాల్సింది పోయి ఇంకా ఇలా అంటున్నావా "అని అన్నారు .దానితో శేషగిరికి తన జేబులోని 20 రూపాయలతో పాటు అదనంగా 30 రూపాయలు కలిపి 50 రూపాయలు ఆ బాలునికి ఇవ్వవలసి వచ్చింది. ఆ డబ్బులు తీసుకొని ఆ బాలుడు సంతోషంతో వెళ్ళాడు .
మరి కొద్ది దూరం వెళ్లేసరికి శేషగిరి తన పర్సును విప్పి చూశాడు .అందులో ఒక్క రూపాయి కూడా లేదు. అవి ఏమైనాయో అతనికి అర్థం కాలేదు. అలాంటి పర్సే మరొక కోతి తెచ్చిందని ,అతని పర్సు మరొక కోతి ఎత్తుకెళ్లిందని పాపం శేషగిరికి తెలియదు. "లోభికి ఇమ్మడి నష్టి" అన్నట్లు అయింది శేషగిరి పరిస్థితి. తన పర్సు తో పాటు 50 రూపాయలు కూడా పోగొట్టుకున్న శేషగిరికి నవ్వాలో ,ఏడవాలో తెలియలేదు .
అందుకే పిసినారితనం మనకు నష్టాన్నే కలిగిస్తుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి