ఆశబోతుతో స్నేహం (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

 పంది, గాడిద మంచి స్నేహితులు.  ఒకరోజు  చెరకు గడలు తినాలనే ఆశ పుట్టింది గాడిదకు. మిత్రుడైన పంది వద్దకు వెళ్ళింది." మిత్రమా!  వాగొడ్డునున్న చెరకుతోటకు వెళ్లి  ఓ గడను రుచిచూసి వద్దాం పదా. చెరకు రసం జీర్ణశక్తికి ఎంతో మంచిది. సర్వరోగ నివారిణి. ఏడాదికోమారు తీపి తినకపోతే ఆరోగ్యానికి హానికరం. పంటకొచ్చిన తీపి గడలు పుష్కలంగా ఉన్నాయి. పా పోదాం" అంది.  "నేను రానులే గార్దభ మిత్రమా!  తిండి కోసం ఆశపడితే తిప్పలు తప్పవు. నాకసలే మధుమేహం. తీపి పడదు. దగ్గరలో దొరికే కాయాగసరా తింటాలే. నీవెళ్ళు" అంది. 
    "అలా అనకు మిత్రమా! కనీసం తోడుకైనారా. స్నేహాధర్మం పాటించు" అంది.  పంది సరే అంది. రెండూ బయలుదేరాయి. వాగు వేగంగా పారుతుంది. గాడిద ఈదగలదు. పందికి ఈతరాదు. అందువల్ల పందిని మీదెక్కించుకుని వాగు దాటింది. చెరకు చేలో దూరాయి. చేను బయటే రైతు బడితే పట్టుకుని నించున్నాడు. పందీ గాడిదను చూసి వెంటపడ్డాడు. గాడిద ఒక్క అంగలో వాగులో దూకి ఒడ్డు చేరింది. ఈతరాని పంది రైతుకు చిక్కి చావు దెబ్బలు తిన్నది. ఇంకెప్పుడు అశబోతుతో స్నేహం చేయకూడదని నిర్ణయించుకుంది పంది.
కామెంట్‌లు