సిజెఐ జస్టిస్‌ రమణకు ఐదో తరగతి బాలిక లేఖ!

 న్యూఢిల్లీ : దేశంలో పరిస్థితులు, న్యాయస్థానాల పని తీరును అవగాహన చేసుకున్న ఓ చిన్నారి.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ రాసింది. న్యాయస్థానం విధి నిర్వహణను వివరించే చిత్రాన్ని లేఖతోపాటు జత చేసింది. సమాజం పట్ల ఆమె చూపుతున్న శ్రద్ధను మెచ్చుకుంటూ సిజెఐ తిరిగి ఆమెకు మరో లేఖను రాయడంతోపాటు 'భారత రాజ్యాంగం' పుస్తకాన్ని బహూకరించారు. త్రిసూర్‌ కేంద్రీయ విద్యాలయంలో ఐదో తరగతి చదువుతున్న లిడ్వినా జోసఫ్‌ అనే బాలిక ఈ లేఖ రాసింది. లేఖలో.. ''ఓ ప్రముఖ పత్రికలో భారతదేశంలోని ప్రధాన వార్తలను చదివాను. కరోనా వైరస్‌ వల్ల ఢిల్లీలోనూ, మిగతా చోట్ల సంభవిస్తున్న మరణాల పట్ల నేను చాలా ఆందోళన చెందుతున్నాను. కరోనా మహమ్మారిపై పోరాటంలో సామాన్యుల బాధలు, మరణాల పట్ల న్యాయస్థానం సమర్థవంతంగా స్పందిస్తున్నట్లు నాకు వార్తా పత్రికల ద్వారా తెలిసింది. ఆక్సిజన్‌ సరఫరా చేయాలని ఆదేశించి, చాలా మంది ప్రాణాలను కాపాడినందుకు నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. దేశంలో, ముఖ్యంగా ఢిల్లీలో కరోనా మహమ్మారిని, దానికి సంబంధించిన మరణాలను తగ్గించడంలో న్యాయస్థానం సమగ్ర చర్యలు తీసుకుంది. ఇందుకు సిజెఐ జస్టిస్‌ ఎన్‌వి రమణకు ధన్యవాదాలు.'' అని పేర్కొంది. ఈ లేఖతోపాటు లిడ్వినా ఓ వర్ణ రంజితమైన చిత్రాన్ని జత చేసింది. దీనిలో న్యాయమూర్తి తన ముందు ఉన్న బల్లపై ఉన్న కరోనా వైరస్‌ను తన చేతిలోని సుత్తితో పారదోలుతున్నట్లు ఉంది.

నీవు జాతి నిర్మాణానికి విశేషంగా కృషి చేస్తావు : లేఖలో జస్టిస్‌ రమణ!
లిడ్వినా రాసిన లేఖపై జస్టిస్‌ ఎన్‌వి రమణ సంతోషంతో ఆమెకు ఓ లేఖ రాశారు. ఆమె పంపిన లేఖ, చిత్రం తనను చాలా ఆకట్టుకున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ధ చూపుతున్నందుకు ఆ బాలికను ప్రశంసించారు. ''నువ్వు చురుకైన, సమాచారం స్పష్టంగా తెలిసిన, బాధ్యతాయుతమైన పౌరురాలిగా ఎదుగుతావు. జాతి నిర్మాణానికి విశేషంగా కృషి చేస్తావు'' అని లిడ్వినాకు రాసిన లేఖలో జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. సర్వతోముఖ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఆమెను దీవించారు. ఈ లేఖతోపాటు 'భారత రాజ్యాంగం' పుస్తకాన్ని లిడ్వినాకు పంపించారు.
(ప్రజాశక్తి దినపత్రిక సౌజన్యం తో )