కుంగ్ ఫూ--కొన్ని నిజాలు!:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

  కుంగ్ ఫూ అనేది ఆయుధాలు లేకుండా కేవలం కాళ్ళు చేతులు ఉపయోగించి చేసే పోరాటం!
     '36త్ ఛాంబర్ ఆఫ్ షోయలిన్','ఎంటర్ ది డ్రాగన్','కుంగ్ ఫూ పాండ'(అనిమేషన్ చిత్రం) వంటి అనేక చిత్రాలలో కుంగ్ ఫూ పోరాటాల్ని చూసి ఉంటారు.
        ఈ కుంగ్ ఫూ పోరాటం చైనాలోని  హినాన్ ప్రావిన్స్ అనే ప్రాంతంలో షోయలిన్ గ్రామంలో షోయలిన్ దేవాలయం లో సుమారు 1500 సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది.షోయలిన్ అంటే 'నూతన అడవి' అని అర్థం.
      క్రీ.శ.495 లో సన్యాసులు అడవి నరకి షోయలిన్ దేవాలయం నిర్మించారు.ఆరో శతాబ్దంలో మన దేశం నుండి 'బోధి ధర్మ' అనే బౌద్ధ సన్యాసి చైనాకు వెళ్ళి షోయలిన్ దగ్గర గుహలో 'ధ్యాన ముద్ర'ను తొమ్మిదేళ్ళు అభ్యసించి,ధ్యానం కుంగ్ ఫూ పోరాటంలో ఉపయోగపడే విధానం తెలిపాడు. అదిగాక పద్దెనిమిది సులభమైన వ్యాయామాలు అక్కడివారికి నేర్పించాడు! నిజానికి ఈ వ్యాయామాలు,ధ్యానం కుంగ్ ఫూ పోరాట పటిమకు నాంది అయి కుంగ్ ఫూ పోరాటం అభివృద్ధి చెందింది. ఈ బోధి ధర్మనే చైనావారు డామో(damo) అని పిలవసాగారు.ఆయన ధ్యానం చేసిన గుహకు డామో గుహ అనిపేరు.
       చైనాను పాలించిన  కమ్యూనిస్టు ప్రభుత్వం 1949 లో కుంగ్ ఫూ పోరాటాన్ని పనికిరానిదిగా భావించి దానిని నిషేదించింది!
       జెట్ లీ సినిమానటుడు కుంగ్ ఫూ పోరాటంలో నిష్ణాతుడు.'షోయలిన్ టెంపుల్' అనే సినిమాను 1981 లో నిర్మించాడు.దాని ప్రభావం వలన అనేకమంది యువకులు కుంగ్ ఫూ నేర్చుకోవడానికి నడుంకట్టారు.1981 లో చైనా ప్రభుత్వం షోయలిన్ దేవాలయం మీద నిషేదం ఎత్తి వేసింది. ఇప్పుడు షోయలిన్ దేవాలయాన్ని సందర్శకులు  పెద్ద ఎత్తున దర్శిస్తున్నారు. 1992 లోషోయలిన్ దేవాలయం 1500 సంవత్సరాల పండుగను ఘనంగా నిర్వహించారు.
       ఈ కుంగ్ ఫూ  పోరాటానికి ఆరాధ్యుడు మనదేశానికి చెందిన బోధిధర్మ అనే బౌద్ధ సన్యాసి.ఇది గర్వించ దగిన విషయం.
       కుంగ్ ఫూ పోరాట పటిమ కేవలం దేహాన్ని శత్రువుల నుండి రక్షించు కోవడానికి మాత్రమే కాదు.మానసికంగా శారీరకంగా ,మానసికంగా మనిషిని ధృఢ పరుస్తుంది.మంచిని ప్రోత్సాహిస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది!
        ఇన్ని విశేషాలు ఉన్న కుంగ్ ఫూ పోరాటాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది ఔత్సాహికులు అభ్యసిస్తున్నారు.