వంట నేర్పు: -ఆర్యసోమయాజుల శరత్--సాఫ్ట్ వేర్ ఇంజనీర్9885668181

   భోజ్యరాజు గారి వంటశాల ముఖ్య అధిపతి బాగా ముసలి వాడు అయిపోయి పదవీ విరమణ కోరుకున్నాడు.జయసేన రాజు గారు అతనికి తగిన ధనం ఇచ్చి పదవీ విరమణ చేయించాడు.
       కొత్త వంటశాల ముఖ్య అధిపతి కోసం చాటింపు వేయించారు రాజుగారు.కొంతమంది అభ్యర్థులు ఆ పదవికోసం రాజు,మంత్రి పెట్టిన పరీక్షలకు హాజరు అయ్యారు.
        అనేక వడపోతల అనంతరం సురుచుడు,నలసేనుడు అనే ఇద్దరు మాత్రం మిగిలారు.
         ఇద్దరినీ తగిన విధంగా పరీక్షించి ఎంపిక చెయ్యమని మంత్రి  మేధాపతి తో చెప్పారు రాజు.
రెండవరోజు నలసేనుణ్ణి పిలచి వంద మంది ఉన్నతాధికారులకు,ఐదువందల మంది సేవకులకు వేరు వేరుగా మంచి భోజనం వండమన్నాడు మంత్రి.
        నలసేనుడు వంద మందికి వంటచేస్తే విందు తరువాత కొన్ని పాకాలు మిగిలి పొయ్యాయి.మరి సేవకులకు చేసిన వంట చాలలేదు! పాకాల రుచి బాగుంది.
        మరుసటిరోజు సురుచుణ్ణి అదేవిధంగా వందమంది అధికారులకు,ఐదువందలమంది సేవకులకు వేరువేరుగా వండమన్నాడు మంత్రి.
     సురుచుడు చేసిన వంటలు అటు అధికారులకు,ఇటు సేవకులకు సరిగ్గా సరిపోయాయి. 
        మంత్రి సురుచుణ్ణి "ఏవిధంగా అంతఖచ్చితంగా వండగలిగావు?" అని అడిగాడు.
        "మంత్రిగారూ,మీ ఉన్నతాధి కారులు రాజావారితో అనేక మార్లు భోంచేసి ఉంటారు,అదిగాక వారు రాచకార్యాలతో సతమతమవుతూ ఎక్కువ తినలేరు.అందుకే వారికి కొంచెం తక్కువ వండాను.మరి సేవకులు కష్టపడేవారు,వారికి శారీరక కష్టంవలన ఆకలి ఎక్కువ,అందుకే ఎక్కువ వండాను.వారు తృప్తిగా తిన్నారు" వివరించాడు సురుచుడు.
            సురుచుడి మాటలువిన్న మంత్రి సంతోషించి రాజుగారి వద్దకు వెళ్ళి ఈవిధంగా చెప్పాడు.
        "మహారాజా,మన వంటశాల ముఖ్య అధిపతిగా సురుచుణ్ణి ఎంపిక చేశాను,ఎందుకంటే అతనికి కేవలం రుచిగా వండటమేకాదు,లౌక్యం కూడా తెలుసు తినే వారి గుణ గణాల్ని బట్టి సరిపోయేంత వండాడు,అందరూ తృప్తిగా తిన్నారు.మరి నలసేనుడు మంచి వంటవాడే కానీ అతనిలో లౌక్యం లోపించింది.అతను మరికొంత శిక్షణ పొందాలి.అందుకే సురుచుణ్ణి వంటశాల అధిపతిగా నియమించి అతనికి సహాయకుడుగా నలసేనుణ్ణి నియమిద్దాం,నలసేనుడు సురుచుడి వద్ద మరిన్ని మెళకువలు నేర్చుకుంటాడు.వంటవాడు వండితే పదార్థాలు మరీ మిగిలి పోకూడదు,'అన్నం పరబ్రహ్మ స్వరూపం' కదా" అని వివరించాడు మంత్రి.
        "మంత్రీ మీరు వంటవారిని గురించి లెస్సగా చెప్పారు,మీరుచెప్పినట్టే చేద్దాం,ఇద్దరికీ మంచి జీతాలు,వసతి ఇద్దాం"అని మంచిగా చెప్పారు  జయసేన మహారాజు.
               

కామెంట్‌లు