మా నాన్నగారి గురించి ఓ పుస్తకం సిద్ధం చేయాలనిపించిన రోజుల్లో ఆయన రాసిన వ్యాసాలకోసం అన్వేషించడం మొదలుపెట్టాను. అప్పుడు కొన్ని వ్యాసాలు నా కంట కనిపించాయి. వాటిలో నాకిష్టమైనది ఆముక్తమాల్యద. ఆంధ్రప్రభలో 1960లలో వచ్చిన వ్యాసమిది. అసలు ఆముక్తమాల్యద కథ ఓ గొప్పకావ్యం. రసవత్తరం.
ఆండాళ్ లేదా గోదాదేవి, శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకుంటారు. యుక్త వయస్సు వచ్చిన తరువాత గోదాదేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని అనుకుంటుంది. విష్ణుచిత్తుల వారు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు, అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగినది. ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా దుఃఖిస్తాడు. స్వామివారికి మాలాధారణ చేయరు. దానితో స్వామి మొహం చిన్నబోతుంది. దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని ఎంతగానో బాధపడతాడు. అప్పుడు స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదనీ, అంతే కాకుండా ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారణే కావాలని ఆదేశిస్తారు, దానితో విష్ణుచిత్తులవారు అలాగే చేస్తారు. తరువాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికీ, రంగనాథస్వామి వారికీ వివాహం జరుగుతుంది.
అటువంటి కావ్యాన్ని ఆధారం చేసుకుని నాన్నగారు రాసిన వ్యాసం ఇక్కడ పూర్తిగా ఇవ్వడం లేదు. ఇది చదువుతున్నప్పుడు మా నాన్నగారు నాకు తెగ నచ్చేశారు. ఇలాటివీ రాస్తారా అని అనుకున్నాను.
నాన్నగారి వ్యాసంలోంచి కొన్ని మాటలు....
".....దండ అంతా చేమంతులతోనే అల్లడం ఏమిటో? నాకు నచ్చలేదు. ఒక్కొక్క తులసీదళంకూడా చేర్చి కూర్చినట్టయితేనే ఈ దండ నిండుగా కనిపిస్తుంది. నాయనకి తెలియదని ఎలా అనుకుంటాను? మహాప్రభువుకి ఏది ఇష్టమో నాయనకి తెలుసు. అసలు ఈ తోటలో వేసిన పూలమొక్కలన్నీ ఎంచి ఎంచి నాటినవే. ఈ మొక్కలన్నీ ప్రభువుకి మాలగా రూపొందడానికి నిత్యమూ పూస్తూ ఉంటాయి.....
నాయన అల్లిన దండ ఎంత ముచ్చటగా ఉంటుందో చూడటానికి. ఏ పువ్వు కూర్చాలో నాన్నకి బాగా తెలిసినట్లు నాకు తెలియదు.
ఇది నాన్న కూర్చిన దండ.
ఒక్కసారి వేసుకుని నిలువుటద్దంలో చూసుకుంటాను. ఆ, వేసుకోవచ్చా! తప్పు కదూ! ప్రభువుకి తెలిసిపోదూ! నేను వేసుకున్నానని! ఎందుకు తెలియదు. అంతర్యామియై ఉండే మహాప్రభువుకి తెలియకుండా ఉంటుందా! అది అపచారమవుతుంది. నేను ముందుగా వేసుకున్న పూదండ స్వామికి వెయ్యడం రెండు విధాల అపచారం. నాన్న అలాగే తీసుకు వెళ్ళి నా స్వామికి సమర్పిస్తాడు. ముందు నాన్నని మోసగించినట్టు అవుతుంది. నేను వేసుకున్నది స్వామికి సమర్పించడం రెండో తప్పు.
శ్రీరంగనాథునికి హారములయ్యే మందారం యశోద అయి ఉంటుంది. ఆనాడు తనివితీరా పాలిచ్చి పెంచిన ప్రేమ మరి. ఎడబాయలేక విశ్వమోహనునికొక పూజాపుష్పమైంది. ఇది ఈ పూదండలో మేరువు. ఔను. ఆనాడు పెంచిన తల్లి. ఈ జన్మలో ప్రధాన స్థానం ఆక్రమించుకోవడం సహజం.
నిజంగా నాడు గోపికలు ధన్యురాండ్రు! వాళ్ళు చేసిన వ్రతం చాలా గొప్పదని నాయన చెప్పగా విన్నాను. ఆ వ్రతం చేస్తే శ్రీరంగనాథుడు నన్ను తప్పక అనుగ్రహిస్తాడు. అయితే వ్రతాలు చెయ్యాలా? చెయ్యాలంటే చెయ్యాలి. ఆ...సత్యభామ ఏదో వ్రతం చేసిందట. ఏమిటది....ఆ....ఆ....జ్ఞాపకం వచ్చింది. పుణ్యకవ్రతం. కాని ఆ వ్రతం ....పతిని చేసిందట. పతిని దానమివ్వాలి. నాకు పతి ఎక్కడ? అదేమిటీ? పతి దానమిచ్చి బ్రతికి ఉండేదెట్లా? అదేమి వ్రతమో? నాకుపతి ఎక్కడ? పతి లేకపోవడమేమిటీ? నా వెర్రిగాని. రంగనాథుడే నా పతి. అమ్మయ్యో! నా పతిని నా గతిని నేను దానమిస్తానా? ఎంత అపచారం. నేను దానమివ్వలేను. నేనసలు నా పతినెవరికీ ఏ అవస్థలోనూ దానమివ్వను. ఇచ్చాననుకుందాం. నా పతిని నా మనోనాథుణ్ణి శ్రీరంగనాథుణ్ణి దానం పట్టే యోగ్యత ఎవరికున్నది? ఎంత ధైర్యం....ఎవరూ నా పతిని దానం పట్టలేరు. అసలు నేనివ్వను. అయినా నన్ను ముందు ఆయన అనుగ్రహించవద్దూ? ఎందుకనుగ్రహించడూ? నాకేం లోపం? అందానికి తక్కువా? నేనే గోపికకు తీసిపోయాను? ముత్తెంలా ఉన్నాను. నేను తగనని ఆయన వంక వారెవరైనా వచ్చి చూసి చెప్పగలరా?....
ఇలా సాగిందీ వ్యాసం. నేనిక్కడ ఇచ్చింది చాలా తక్కువే.
నిజం చెప్పాలంటే నేను మా నాన్నగారి వ్యాస రచన చదవటమన్నది ఇప్పుడే. ఆయన ఉన్న రోజుల్లో ఎప్పుడూ కన్నెత్తయినా వాటి వంక చూడలేదు. ఎంతసేపూ తమిళ కవితలూ తమిళ వ్యాసాలూ చదివేవాడిని. బాగున్నాయనుకుంటే తెలుగులోకి అనువదించే వాడిని. అలాంటి నేను ఇప్పటికైనా మా నాన్నగారి వ్యాసాలు కొన్నయినా చదివినందుకు ఆనందంగా ఉంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి