అల్లుకున్న ఆశాలతలు ( ఉత్తమ కవితగా ఎంపికైనది):-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

ఎడ్డెమoటే తెడ్డెమనే ఇంట్లో 
ఒక్కోక్క బాధ్యతనూ 
ఓర్పు పాదుల్లో నాటి.. 
ఊహల చెలిమలో అట్టడుగు
జలనుండీ ఉబికే 
వ్యయ "సాయం "నీటిని 
పొదుపు యాతాముతో తోడి 
పెంచినాక
అల్లుకు పోయిన ఆశాలతలు, 
మనో వనంలో హర్షాతిరేకాలు!

ఒకపద్ధతిలో పెరగాలి 
వేళ్ళ కొనల్లో కోరికల 
మట్టి రేణువులు పరిమళించి 
శ్రామిక సౌందర్యం 
లతలకు అర్థమైందా లేదా..? 
నిండుగా ప్రవహించే 
కర్తవ్యం కాలువలో 
అమ్మ లాంటి చల్లదనం.. 
వేళ్ళ లో నుండి పీల్చుకొని 
కాండం గట్టిపడి.. 
కృతజ్ఞతల కణుపుల్లో 
సామర్ధ్యం మొగ్గలు పొటమరిస్తే 
ఆమె ఆశల లతల కు 
బంగారు పుష్పాలసింగారం!!

కామెంట్‌లు