మల్లెపూల అరుగు ...!!:------శీరంశెట్టి కాంతారావు రచయిత పాల్వంచ .

 దేశంలో ఎక్కడాలేని విధంగా మాఊళ్ళో మల్లెపూలకు అరుగుంది 
అదీ ఎక్కడంటే ఊరిని రెండుగా విభజిస్తూ వెళ్ళే జాతీయ రహదారిని ఆనుకుని నడిఊళ్ళో కచ్చేరీకి ఆవలి పక్కనున్న రావిచెట్టు చుట్టూ నున్నగా గచ్చుచేసివుంటుంది
అదెందుకంటారా?!
మా ఊరు భూములన్నీ ఎర్రచెక్క నేలలే.. అవి మల్లెతోటలకు అనుకూలమని ఏపల్లెటూరు పరిశోధకులు కనిపెట్టారోగాని ఊరు చుట్టూ తోటలే తోటలు
యాసంగిపంటలన్నీ ఇళ్ళు చేరి
కూలినాలి జనాలకు పనుల్లేని రోజుల్లో
మల్లెతోటల్లో మస్తు పనిదొరుకుతుంది
మాఘమాసం జొరబడగానే ముందుగా ఆడకూలీలొచ్చి  ఆకుదూసి పోయ్యడంతో 
తోట పన్లకు అంకురార్పణ జరుగుతుంది  
మగకూలీలొచ్చి తాటాకుల్తో
పొదల్ని దగ్గరికి గుంజి అంటగడతారు
ఆ కట్లను చూస్తుంటే...
యమునా తటిని వలువలన్నీ ఊడ్చి గట్టునేసి స్నానం కోసం
నగ్నదేహాలతో నదీలో  దిగుతున్న గోపాంగనల మొలనూళ్ళు గుర్తుకొస్తాయి
పొదలచుట్టూ పాదుల్జేసి మాగిన పశువుల ఎరువుతో తిరగేసి 
తోటంతా గడ్డి చెక్కేస్తారు
అప్పుడా తోటను చూస్తుంటే
మాఊరి మైసూరు సాహెబ్
ఏటా తిరుపతి కొండకుపోయి తలనీలాలిచ్చొచ్చినట్టు నున్నగా మెరిసిపోతుంది 
కట్లు విప్పి వదిలేసిన పొదలకు
మొదటి తడి పారించి వెనక్కితిరిగి చూస్తుండగానే  చిగుళ్ళువేసి వయసుకొచ్చిన అమ్మాయిల్లా గుమ్మటంగా
విస్తరించేవి
చిగుళ్ళు ఆకుపచ్చ కన్నులై విస్తరిస్తూ వుండగానే
వాటివెనుక ఎప్పుడొచ్చి దాక్కునేదోగాని ఓరోజు పొద్దున్నే చూస్తే
గుత్తులు గుత్తులుగా తన్నుకొచ్చిన కళ్ళె 
రైతుల చిత్తాలను గమ్మత్తుగా చిత్తుచేసి చూస్తుండగానే మొగ్గలు తొడిగేది
అప్పటిదాకా వేసవి శలవుల్ని 
సీమచింత, ఈత కాయల  వేటల్తోటి 
చెరువుల్లో ఈతల్తోటీ 
గడిపేసిన బడిపిల్లలు  
రేపు చేరబోయే
కొత్త తరగతుల పుస్తకాల కొనుగోలు నిమిత్తం
ఆటల్ని తాత్కాలికంగా అటకెక్కించి
తోటల్లో రింగనపురుగుల్లా తిరుగుతూ 
మహిళల్తోపాటు మల్లెమొగ్గల్ని కోసిపోసే అగ్గిరాముళ్ళయ్యే వాళ్ళు
పదిగంటల్నుండి టప్పాలవాళ్ళొచ్చి ఆసాముల దగ్గర మొగ్గల్ని కాటావేసుకుని పరుగులు తీస్తూ మల్లెపూల అరుగు దగ్గర గుమిగూడి రాష్ట్రం నలుమూలలా వెళ్ళే బస్సుల్నాపి టప్పాల్ని వేసే వాళ్ళు
మాఊరి మల్లెలు లేనిది భద్రాద్రి రామయ్య కళ్యాణంలో కళ వుండేదేకాదు
మాపటిపూట కోతలో అమ్మగా మిగిలినపూలను రైతులు మస్తాన్ షావలి దర్గాలో గుమ్మరించి పోయేవారు ఆవాసనకు రోడ్డునపోయే  వాళ్ళు గుమ్మెత్తిపోయేది
మల్లెపూల పందిట్లో జరిగిన చెల్లిపెళ్ళి మాకో జీవితకాల అనుభూతి
ఇప్పుడు మా ఊళ్ళో
కాలం రోలర్ క్రింద తొక్కివేయబడ్డ మల్లెతోటలు
మచ్చుక్కూడా ఒక్కటిలేదు
ఊరినెప్పుడు చలనశీలంగా వుంచే రోడ్డు దూరంగా వెళ్ళిపోయింది
మల్లెపూల అరుగు మాత్రం శిథిల జ్ఞాపకంగా మిగిలిపోయి వుంది.
                         ***

కామెంట్‌లు