గురువాయూరప్పన్ ఆలయం :-- యామిజాల జగదీశ్


 కేరళ రాష్ట్రంలోని త్రిచూర్ జిల్లాలో ఉంది. ఇక్కడి దేవుడి ఆస్తుల విలువ రెండు వందల యాబై కోట్ల రూపాయలు. ఈ మాట చదువుతుంటే ఒకటనిపించింది. ఆలయ ఆస్తుల విలువ అంటే బాగుండేది. ఎందుకంటే దేవుడు ఎక్కడున్నా దేవుడే. అది చిన్న ఆలయమా పెద్ద ఆలయమా అనేది పక్కన పెడితే దేవుడిమీది విశ్వాసం ప్రధానాంశం. 
ఈ ఆలయంలో అరవైమూడు ఏనుగులున్నాయి. మరే ఆలయంలోనూ ఇన్ని ఏనుగులు లేవు.
ఇక్కడి కృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ప్రధాన కారకులు "గురు - వాయువు"లు కాబట్టే ఈ ప్రదేశాన్ని 'గురువాయూరు' గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి శ్రీకృష్ణుడిని 'గురువాయూరప్పన్' అని భక్తితో పిలుస్తారు. 
గురువాయూరప్పన్ ని కణ్ణన్‌, ఉన్నికృష్ణన్‌, బాలకృష్ణన్‌ వంటి అనేక పేర్లతో పిలుస్తారు..
ముఖ్యంగా వైష్ణవులకు గురువాయూర్‌ పరమపవిత్ర ప్రదేశం.
ఇక్కడి మంటపంలో ఓ కొబ్బరికాయ ఉంది. దానికి కొమ్ములుండటం ఆశ్చర్యం. ఇందుకు సంబంధించి ఓ కథ కోసమే ఈ ఆలయం గురించి ఒకటి రెండు విషయాలు క్లుప్తంగా ప్రస్తావించాను.
కొమ్ములున్న కొబ్బరికాయ విషయా నికొస్తాను.
అనగనగా ఓ పల్లెటూరు. 
ఆ పల్లెటూళ్ళో ఒకడు తన తోటలో అనేక కొబ్బరి పిలకలు నాటాడు. ఈ కొబ్బరి పిలకలు పెద్దవయ్యాక ప్రతి చెట్టులోని  కాసిన మొదటి కొబ్బరి కాయలను కోసి గురువాయూరప్పన్ కి భక్తితో తన కానుకగా సమర్పించాలని సంకల్పించాడు.
అనుకున్నట్టే అతను ప్రతి చెట్టులోని మొదటి కాయలను కోసి ఓ బస్తాలో సర్ది  గురువాయూర్ ఆలయానికి బయలుదేరుతాడు.
మార్గమధ్యంలో ఓ దారిదోపిడీ దొంగ అతనిని అటకాయించి బస్తాలో ఉన్నదంతా తనకివ్వమని బెదిరిస్తాడు. 
కానీ పల్లెటూరు మనిషి "ఈ బస్తాలో ఉన్నవి కొబ్బరికాయలే. అవి నీకు ఉపయోగపడవు" అన్నాడు. "వాటిని నేను గురువాయూరప్పన్ కి కానుకగా తీసుకుపోతున్నాను" అంటాడు.
కానీ దారిదోపిడీ దొంగ ఆగుతాడా...
"ఇది గురువాయూరప్పన్ కొబ్బరి కాయ అని ఎక్కడైనా రాసుందా ...  లేక వాటికేమన్నా ప్రత్యేకించి కొమ్ములొచ్చాయా" అని అరుస్తూ పల్లెటూరి మనిషి దగ్గర నుంచి బస్తా లాక్కున్నాడు.
ఆ లాగడంలో బస్తాలోని కొబ్బరి కాయలు చెల్లాచెదురుగా కింద పడ్డాయి.
ఆశ్చర్యమేమిటంటే ప్రతీ కొబ్బరి కాయకు కొమ్ములొచ్చాయి.
పల్లెటూరు వాసి భక్తినీ,  గురువాయూరప్పన్ చర్యకూ గ్రహించిన దొంగ మనసు మార్చుకుని గురువాయూరప్పన్ని క్షమాపణలు కోరుతాడు. పల్లెటూరు వాసితో ఘర్షణపడక వెళ్ళిపోతాడు.
అనంతరం పల్లెటూరువాసి తాననుకున్నట్టే కొబ్బరికాయలను తీసుకుని గుడికి వెళ్ళి తన సంకల్పం నెరవేర్చుకుంటాడు.
అయితే ఆ పల్లెటూరివాసి కానుకగా తీసుకొచ్చిన కొమ్ములున్న కొబ్బరికాయలను గురువాయూరప్పన్ ఆలయం ముందున్న మంటపంలో వేలాడదీశారు. 
గురువాయూరప్పన్ తలచుకుంటే కొబ్బరికాయలకూ కొమ్ములు వస్తాయి.  మనం గురువాయూరప్పన్ ని భక్తితో  ఆరాధిస్తే మన జీవితమూ క్షేమంగా ఉంటుంది.