గురువులు-సరళ గున్నాల

కం*గురువన నజ్ఞానములను..
గురితో తొలగింపజేయు గురుతరముననే
గురువన విజ్ఞాన నిధులు
గురిపించెడి దివ్యమూర్తి గొలిచిన నెపుడున్


కం*అక్షరలక్షలనిచ్చి సు
శిక్షితులనుజేయనెంచు శ్రేయముగూర్పన్
దక్షతగలిగిననొజ్జలు
రక్షింపగశిష్యగణము రాజిల్లునిలన్

కం*అండగ విద్యలనందున
అండగతానుండిబుద్ధి నందించుటలో
అండయెసంతసమొందగ
దండింపగమనసురాని ధన్యుడుగురువే

🌹సర్వలఘు కందం🌹

కం*గురువుగ విలువలు నిడుచును
తరువుగ నినుగని బరువని దలపడునెపుడున్
మరిమరి చదువుల విధమును
సరియగు పథమున నడుపెడు సదయుడుగురువే

కం*పలుకులు మధురపు గుళికలు
తలపునసద్బుద్ధిగలుగు, తరగనియశమున్
తెలుపును జీవనపథమును
తలపించును దైవమటుల ధరణినగురువే

కం*తప్పులనాడిననొప్పక
చెప్పునుయాతప్పులోని ఛీత్కారములన్
ముప్పులజేరగనీయడు
తప్పింపగజూచు భావిదాతయుగురువే
కామెంట్‌లు