నల్లముత్తు(1896 - 1972):-- యామిజాల జగదీశ్

 తమిళనాడులో మహిళల పురోగతి కోసం కృషి చేసిన అక్కచెల్లెళ్ళల్లో డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆమెలాగే ఆమె చెల్లెలు నల్లముత్తుకూడా ఓ మంచి మనసున్న ముత్యమే. 
డాక్టర్ ముత్తులక్ష్మి చెన్నైకి చదువుకోవడానికి వచ్చినప్పుడు ఆమె కుటుంబంకూడా చెన్నైకి వచ్చేసింది 
నల్లముత్తుకూడా చెన్నై వాసి.
 
ఆమె ఎగ్మూరులోని బాలికల పాఠశాలలో చదువుకున్నారు. చెన్నై ప్రెసిడెన్సీ కాలేజీలో పట్టా పుచ్చుకున్న ఆమె మంచి వక్తకూడా. 
తమిళం తెలుగు ఆంగ్లం, జర్మన్, ఫ్రెంచ్ భాషలలో పట్టున్న ఆమె 1918లో మద్రాసులోని క్వీన్ మేరీస్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరారు. చరిత్ర, జాగ్రఫీ పాఠాలు బోధించిన ఆమెబ్రిటీష్ పాలనలో ఆర్థిక సహకారం పొంది ఉన్నత చదువులకోసం లండన్ వెళ్ళారు.
మొదటి ప్రపంచ యుద్ధానంతరం సర్వదేశ శాంతి సంఘం ఏర్పడింది. ఆ సంఘం ప్రతినిధిగా ప్రపంచ దేశాల నుంచి ఎన్నికైన తొలి మహిళ నల్లముత్తు.
ఆమె పని చేసిన క్వీన్ మేరీస్ కాలేజీలో ఐరోపియా మహిళలే ప్రిన్సిపాల్ గా ఉంటూ వచ్చారు. అయితే ఆ పదవిలో నియమింపబడ్డ తొలి భారతీయ మహిళగా చరిత్ర పుటలకెక్కిన నల్లముత్తు చదువులో ఎంతో ఆసక్తి, అర్హత ఉన్న ఇద్దరు విద్యార్థినులకు హాస్టల్ చేరేందుకు కళాశాల యాజమాన్యం అనుమతి నిరాకరించింది. ఆ ఇద్దరు యువతులు దేవదాసి విధాన నిర్మూలన చట్టం కింద విముక్తి పొందిన కుటుంబానికి చెందినవారవడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో ఆ ఇద్దరు యువతులను ముత్తులక్ష్మి నిర్వహించిన ఓ హోంలో చేర్పించి చదువు కొనసాగించేలా చేసిన ఘనత నల్లముత్తుగారిది.
ఆ ఇద్దరు యువతులలో ఒకరు ఉపాధ్యాయురాలిగానూ, మరొకరు వైద్యురాలిగానూ స్థిరపడటం విశేషం.
1926లో బ్రెజిల్లో జరిగిన బ్రిటీష్ కామన్వవల్త్ దేశాల విద్యా సదస్సులో పాల్గొని ప్రసంగించిన ఆమె భారత దేశ మహిళా సంఘం మద్రాసు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు.
1932లో మహిళలకు వోటు హక్కు కల్పించే విషయమై ఏర్పాటు చేసిన Lothian Committee సమావేశానికి హాజరై తన వంతు అభిప్రాయాలను వివరించారు.
రెడ్ క్రాస్ సంఘం కార్యవర్గ సభ్యురాలిగా ఉండిన ఆమె 1956లో రాజ్యసభకు నామినేటయ్యారు.
వరకట్న నిషేధకోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ సభ్యురాలిగా నియమితులైన ఆమె మహిళల పురోభివృద్ధి కోసం తన వంతు పాత్రను విజయవంతంగా పోషిస్తూ మన్ననలు అందుకున్నారు.

కామెంట్‌లు