ప్రతిజ్ఞ రాసిన 50 సంవత్సరాల తర్వాతగాని రచయిత పేరు వెలుగులోకి వచ్చింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేకమంది తెలంగాణ కవులు,రచయితలు వెలుగులోకి వచ్చారు.అటువంటి వారిలో ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు ఒకరు.ప్రతి సంవత్సరం మనం జనవరి 26 న గణతంత్ర దినోత్సవంని జరుపుకుంటాం.అంబేద్కర్ మహాశయుడు రచించిన రాజ్యాంగం 1950 జనవరి 26 న అమలులోకి వచ్చింది.ప్రతిజ్ఞ లో రాజ్యాంగ విలువలున్నాయి. దేశభక్తి గీతాలు మనలో ఉత్సాహాన్ని నింపుతాయి.స్వాతంత్ర ఉద్యమంలో వందేమాతరం సహా పలు గీతాలు ఆనాటి పౌరులలో దేశభక్తిని పెంచడానికి దోహదపడ్డాయి.స్వాతంత్ర ఉద్యమం అనంతరం వచ్చిన గీతాలలో ప్రతిజ్ఞకి అత్యంత ప్రాముఖ్యత ఉంది.1962 లో చైనా,భారతదేశంల మధ్య యుద్ధం వచ్చినప్పుడు పౌరులలో దేశభక్తిని పెంచడానికి పైడిమర్రి ప్రతిజ్ఞ రాసారు.ఆయన ప్రతిజ్ఞతో పాటు పలు గ్రంథాలు రాశారు. ఆయన 1916 జాన్ 10 న జన్మించారు.పైడిమర్రి ప్రతిజ్ఞ విశిష్టమైనది.దేశభక్తి గీతాలకు, భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞకి తేడా ఉంది.దేశభక్తి గీతాలని రాగయుక్తంగా ఆలపిస్తాం.ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేస్తారు.ప్రతిజ్ఞ అంటే ఒక హామీ.అంటే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం.నల్గొండ జిల్లాలోని అన్నేపర్తి గ్రామానికి చెందిన ప్రముఖ కవి పైడిమర్రి వెంకట సుబ్బారావు 1962 లో ప్రతిజ్ఞ రాసారు.1965 జనవరి 26 న భారత ప్రభుత్వం ప్రతిజ్ఞని జాతీయ ప్రతిజ్ఞగా ఆమోదించింది.కవిగా,రచయితగా,ప్రభుత్వ ఉద్యోగిగా,దేశభక్తుడిగా పైడిమర్రి పేరు పొందారు.
మనం రోజూ భారత దేశం నా మాతృభూమి అని చిన్నప్పుడు పాఠశాలల్లో ప్రతిజ్ఞని ఆలపించాం.కానీ మనలో ఎంతమంది దేశంపట్ల అభిమానం కల్గిఉన్నాము.భారతీయులంతా నా సహోదరులు అని చదివాము.మనము పెద్దవారమయ్యాక మన తోటివారిని అలా చూడగలుతున్నామా? నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని ఆలపించాము.గురజాడ అన్నట్లు "దేశమంటే మట్టికాదోయ్,దేశమంటే మనుషులోయ్"అన్న మాట మనలో ఎంతమందికి గుర్తుంది. పైడిమర్రి ఆశించినట్లు మనం కులమతాలకు అతీతంగా దేశంతోపాటు,ఈ దేశ ప్రజలని ప్రేమిస్తున్నామా?
సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అని చిన్నప్పుడు బాసలు చేసాం.ఈ దేశం అందరిది అని మనలో ఎంతమందికి గుర్తుంది.మనం ఒకప్పుడు ప్రదర్శించిన మత సామరస్యం ఇప్పుడేమైంది?
తల్లిదండ్రులని,ఉపాధ్యాయులని,పెద్దలందరిని గౌరవిస్తానని శపథం చేసాం. మరిప్పుడు అవన్నీ నీటి మూటలేనా? ప్రతివారితో మర్యాదగా ఉంటానని వాగ్ధానం చేసాం. మరి మనలో సహనం నశించిపోతుంది కదా!
నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటామని ప్రతిజ్ఞ చేసాం.ఇప్పుడది ఆచరణలో కన్పించడంలేదు.
సోదరభావాన్ని,దేశభక్తిని పెంచే ప్రతిజ్ఞని ఆలపించటమే కాకుండా,ప్రతిజ్ఞ పదాలని పాటించాలి.అప్పుడే మనదేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది.ప్రతిజ్ఞని అందరిచేత పాడించాలి.ప్రతిజ్ఞ రచయితను పాలకులు గుర్తించాలి.ఆయన జీవితచరిత్రని దేశ వ్యాప్తంగా పుస్తకాలలో చేర్చాలి.ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాల్ని పాఠశాలల్లో జరపాలి.ప్రతిజ్ఞని పాఠశాలల్లోనే కాకుండా, కళాశాలల్లో కూడా ఆలపించేవిధంగా చర్యలు తీసుకోవాలి.కరోనా కాలంలో పాఠశాలలు లేకపోవడంతో విద్యార్థులు ఎటువంటి గీతాలు పాడే అవకాశం లేకుండా పోయింది. పాఠశాలలు ప్రారంభంఅయితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూవిద్యార్థులు చేత ప్రతిఙ్ఞ చేయించేందుకు విద్యా శాఖ చర్యలు తీసుకోవాలి.అప్పుడే మనం పైడిమర్రికి ఘనమైన నివాళులు అర్పించినట్లౌతుంది.
--------------------------------------------
ఆగస్ట్ 13 పైడిమర్రి వర్ధంతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి