అమ్మ :-- యామిజాల జగదీశ్

 అమ్మ మా మధ్య భౌతికంగా లేక పదమూడేళ్ళయ్యింది. క్యాలండర్ ప్రకారం అమ్మ తుది శ్వాస విడిచిన తేదీ 2008 ఆగస్ట్ ఆరు. నాటి తిథి పంచమి. తిథి ప్రకారం ఈ ఏడాది ఆగస్ట్ పదమూడైంది. అనుకున్నట్టే "అమ్మ తిథి"ని కానిచ్చాం. బరువైనదే ఈ కార్యం. అమ్మ ఉన్నంత సేపూ అంతా తేలికే. ఎంతటి ఒత్తిడి అయినా మటుమాయమే అమ్మ రక్షణలో. కానీ అమ్మ కళ్ళముందు లేదనే వాస్తవాన్నెలా జీర్ణించుకోవడం....మనసుని మభ్యపెట్టడమే తప్ప చేసేదేమీ లేదు. 
ఆ మధ్య ఓ తమిళ కథ గురించి విన్నది గుర్తుకొచ్చింది. పుదుమైపిత్తన్ అనే రచయిత రాసిన ఓ కథను ఎస్. రామకృష్ణన్ అనే మరొక రచయిత సమీక్షిస్తూ చెప్పిన విషయం మనసులో బలంగా నాటుకుపోయింది. ఓ భార్యాభర్తలుంటారు. వాళ్ళ పిల్లలు పనుల నిమిత్తం వేర్వేరు ఊళ్ళల్లో ఉంటారు. ఈ వృద్ధ దంపతులు ఓ నగరంలో జీవితం సాగిస్తుంటారు. భార్యకు ఆరోగ్యం బాగుండక ఓ రోజు చనిపోతుంది. ఏదో పని మీద బయటకు వెళ్ళిన భర్త ఇంటికొచ్చేసరికి భార్య మరణించి ఉంటుంది. ఆమె ముందు కూర్చుంటాడు. ఆమెను స్పృశిస్తాడు. బరువుగా అన్పిస్తుందతనికి. నా భార్య ఇంత బరువుండదే....అనుకుంటాడు. గతించిన వారికేమీ తెలీదు కానీ "మరణం" మోయలేని భారమే ఉన్నవారికి. అంతేకాదు, సున్నితమనుకున్న శరీరమూ బరువెక్కుతుంది. శాశ్వతంగా కనులు మూసుకున్న తన అర్ధాంగితో దీర్ఘకాలం సాగించిన జీవితపయనంలోని వివిధ సంఘటనలను సందర్భాలను నెమరువేసుకుంటాడా భర్త. ఒక్కమారు మన సొంతూరుకి వెళ్ళొద్దామని ఆమె అనడం , అలాగేనే అని అనడం, వెళ్ళలేకపోవడం, ఊళ్ళో మనుషుల గురించి కథలు కథలుగా చెప్పుకోవడం, ఇట్టాగే సాగిపోయేవి రోజులు. తమకన్నా ఇతరుల గురించే బోలెడు విషయాలు చెప్పుకోవడం, ఎటూ పోలేక సర్దుకుపోవడమైపోతుంది వారి జీవితమంతా. భార్య మాటలన్నీ మనసులో మెదలుతూ అతని హృదయంకూడా బరువెక్కుతుంది. 
నిజమే, అప్పటి వరకూ కళ్ళ ముందు ఉంటూ అడుగడుగుకూ మిటలతో హెచ్చరికలతో జాగర్తలు చెప్తూ వెన్నంటి ఉండే మనుషులు ఉన్నట్టుండి మరణమనే అధ్యాయంతో అదృశ్యమవడం అన్నది భరించడం ఒకింత కష్టమైనదే. అది అనుభవించిన వారికే తెలుస్తుంది తప్ప దూరంగా ఉన్నవారికి అంతగా తెలీదు. ఓదార్పు కోసం ధైర్యం కోసం చెప్పే ఇతరుల మాటలు ఎన్నున్నా బాధిత హృదయం మానసికంగా బలాన్ని ప్రోది చేసుకోవలసిందే. కాలం గడిచే కొద్దీ వేర్వేరు విషయాలు బాధ్యతలు మరిచిపోయేలా చేసినా జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా మళ్ళీ బరువుగా ఏకాకి అయినట్టు అన్పిస్తుంది. అందులోనూ అమ్మ ఎడబాటన్నది మరీ మరీ భారమే. మోయలేని భారమే. మనందరికీ చిన్నప్పుడు అమ్మే హీరో.  బలవంతురాలు. ధీమంతురాలు. ఎవరన్నా ఏదన్నా అంటే వెంటనే వచ్చే మాట "మా అమ్మకు చెప్తా" అని. ఎవరన్నా బెదిరిస్తే అమ్మే మనకు కొండంత అండ. మనం భూమ్మీదకు రాకముందు నించే అమ్మ తన పొట్టలో ఉన్నఫ్పుడే మనల్ని చూస్తుంది. మనతో మాట్లాడుతుంది. మనం భూమ్మీదకు రావడంతోనే మన కళ్ళు చూసేది అమ్మనే కదా. అప్పటి నించీ మన ప్రతి అడుగులోనూ అమ్మ ఉంటూనే ఉంటుంది. అటువంటి అమ్మనొదిలి ఉండటం భర్తీ చేయలేని లోటే ఎప్పటికీనూ....!!

కామెంట్‌లు