గిట్టని పదం:-- యామిజాల జగదీశ్

 ప్రతి ఒక్కరికీ కొన్ని మాటలు నచ్చుతాయి. మరికొన్ని నచ్చవు. నచ్చినవైతే పరవాలేదుకానీ నచ్చని మాటలతోనే తలనొప్పంతా. ఇలా ఎందుకు చెప్తున్నానంటే నాకసలు నచ్చని మాటే కాదు భయపెట్టే మాటైపోయింది Convert కన్వెర్ట్ అనే మాట. అనుకోని పరిణామం.

నాతో ఓ మాసపత్రిక వారు ప్రతి నెలా ఓ పదిహేను వ్యాసాలు టైప్ చేయించుకుంటూ ఉంటారు. నేను వాటి ప్రూఫ్ లు చూడను. జస్ట్ వాళ్ళిచ్చిన వ్యాసాలు టైప్ చేసి పంపగా నాకు ఓ వెయ్యి రూపాయలు వస్తాయి. ఇది కొన్నేళ్ళుగా జరుగుతున్న తంతే. అయితే ఆ పత్రికవారు మొదటి పేజీలో "సీనియర్ సబ్ ఎడిటర్ అండ్ డిటిపి" అని నా పేరు వేస్తున్నారు. అదీనూ యామిజాల అని నా ఇంటిపేరు మాత్రమే వేస్తుంటారు. మొదటి నెలప్పుడే చెప్పాను వెయ్యవద్దని. కానీ నా మాట వినిపించుకోకుండా ప్రతి నెలా వేస్తూ వస్తున్నారు. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. నిజానికి నా పేరు వెయ్యడం అనవసరం. ఎందుకంటే ఈ పత్రికలో వచ్చే వ్యాసాలతో నాకెలాటి పాత్రా లేదు. నా పనల్లా వ్యాసాలు టైప్ చేసివ్వడమే. వారే  ఇంటికొచ్చి స్క్రిప్ట్ ఇస్తారు. టైప్ చేసిన తర్వాత స్క్రిప్ట్ తీసుకెళ్ళడానికి వస్తారు. చేసిన పేజీలు మెయిల్ ఐడీకి పంపించేస్తాను. ప్రూఫులు ఇద్దరితో చేయిఃచుకుంటారు. అదంతా వారి పనే. వ్యాసాల ఎంపికలో గానీ ప్రూఫ్ చూడటంలోగానీ పేజీలు సెట్ చేయడంలోగానీ నాకెలాటి సంబంధమూ లేదు. 
అయితే ఇటీవల ఆ పత్రిక ప్రచురణకర్త ఒకరి నుంచి ఓ అయిదారు వ్యాసాలు తెప్పించారు. అవి unicode యూనికోడ్ ఫాంట్లో వచ్చిన వ్యాసాలు. ఇవి అట్టాగే పేజ్ మేకర్ లో పెట్టడం కుదరదు కనుక anu 7.0 fontsలో convert కన్వెర్ట్ చేయడం తెలుసు కనుక వాటిని నాకు మెయిల్ ఐడీకి ఫార్వర్డ్ చేయమన్నారు. అవి అందడంతోనే కన్వెర్ట్ చేసి మళ్ళీ మ్యాగజైన్ వారికి పంపించేసాను. 
అనంతరం వ్యాసకర్తకు ఫోన్ చేసి మీరు పంపిన ఐటెమ్స్ అనూ ఫాంట్ లోకి కన్వెర్ట్
చేసానండి అని చెప్పిన మరు నిముషం నా కాల్ కట్ చేసేసారు. మీ ఆర్టికిల్స్ ఎంతో బాగున్నాయని చెప్పేలోపు కాల్ కట్టయిపోయింది. 
కాస్సేపటికి నాకు మ్యాగజైన్ సొంతదారు ఫోన్ చేసారు.
"మీరు రచయితతో ఏం మాట్లాడరని?" అడిగాడు. 
కన్వెర్ట్ చేసిన విషయాన్ని చెప్పినట్టు తెలిపాను. 
ఈ కన్వెర్ట్ అనే మాటను సదరు రచయిత తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఆయన ఐటెమ్స్ అన్నీ రీరైట్ చేసేననుకుని బాధపడ్డారట. ఇప్పటివరకూ ఏ ఒక్కరూ ఏ రోజూ నా వ్యాసాలలో చేయి పెట్టలేదని, ఈయనెలా మారుస్తాడనే రీతిలో మాట్లాడి నా ఐటెమ్స్ ఏవీ వాడకండి అని మెసేజ్ ఇచ్చారు. కాల్ చేయవద్దని చెప్పారు. అక్కడితో ఆగక నాకొక మెసేజ్ పెట్టారు. సీనియర్ సబ్ ఎడిటర్ గారికి నమస్కారాలు. నన్ను చైతన్యపరిచారు. కృతజ్ఞతలు ఆనే మాటలవి.(ఇక్కడ ఓ మాట అటూ ఇటూ అయి ఉండొచ్చు. విషయమైతే ఇదే). నేనా మాటలు చదివి షాకయ్యాను. ఎందుకంటే నాకంటే వయస్సు పరంగా దాదాపు ఇరవై ఏళ్ళు పెద్దవారు. అలాటి పెద్దవారు నన్ను ఆశీర్వదించవలసింది పోయి నమస్కారాలు అనడం, చైతన్యపరిచారనడం వంటి మాటలు చాలా బాధపెట్టాయి. 
కన్వెర్ట్ చేసాననే మాటను ఎంతలా అపార్థం చేసుకున్నారో ఆయన. అంతేకాదు, ఆ మ్యాగజైన్ వారితో తెగతెంపులు చేసుకోవడం, నా మాటను అపార్థం చేసుకుని ఈ విధంగా తమ ఆగ్రహాన్ని తెలియజేయడం మింగుడుపడటం లేదు. 
ఆధ్యాత్మిక అంశాలేకాక దేనిపైనైనా అవలీలగా రాసి బోలెడంత అనుభవమున్న రచయిత కన్వెర్ట్ అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకుని ప్రవర్తించిన తీరు బోధపడటం లేదు. నావల్ల మ్యాగజైన్ కి నష్టం జరిగిందనే బాధ నలిపేస్తోంది. కన్వెర్ట్ ఉదంతాన్ని నేను విడమరిచి చెప్తూ నేనొక అజ్ఞానినని, మీ రచనలో మార్పులూ చేర్పులూ చేసే శక్తి నాకు లేదని, క్షమించమని చెప్పినా ఆయన వైఖరిలో  మార్పు లేకపోవడం కలవరపెడుతోంది. 
అందుకే కన్వెర్ట్ అనే మాటంటే గిట్టకుండా పోయింది. 

కామెంట్‌లు