చెట్టు తల్లి...: - ప్రమోద్ ఆవంచ

 అది ఒక ఊరు. ఆ ఊరిలో అర ఎకరం భూమిలో ఒక ఇల్లు.ఇంటి ముందు విశాలమైన ఖాళీ స్థలం.ఇల్లు ఎడమవైపు పెద్ద చింత చెట్టు.దాని వయసు చాలా పెద్దదే.చింత చిగురు,వనగాయలై,అవి చింతకాయలై
బరువును మోయలేక కొమ్మలు పక్కకు వంగి పోయి
వుంటాయి.వేసవికాలంలో, పశువులు, పక్షులు, మధ్యాహ్నన్నాలు ఆ చెట్టు కిందే సేద తీర్చుకుంటాయి.
ఇంటి యజమాని సీతారామయ్య అప్పుడే పుట్టిన రెండు కుక్కలను సాదుకోవడాని తెచ్చుకున్నారు.ఒక కుక్క గోధుమ రంగులో వుంది, దానికి రాజు అని, రెండవది తెలుపు, నలుపు రంగులో వుంది, దానికి టామీ అని పేర్లు పెట్టాడు.రాజు,టామీలకు,ఇంటి యజమానురాలు ప్రమీలమ్మ పొద్దున్నే పాలు, మధ్యాహ్నం, రాత్రి అన్నం,పెడుతూ చాలా ప్రేమగా చూసుకునేది.పాలు తాగాకా,చింత చెట్టు కింద ఆడుకునేవి,అలసిపోయాక చెట్టు మొదట్లో, గుంతలు తొవ్వి, దాంట్లో పడుకునేవి, చెట్టును తల్లిలా, భావించి అమ్మ ఒడిలో తలనానిచ్చి
నిద్ర పోయేవి.
                     రాజు, టామీ పెరిగి పెద్దయ్యాయి.ఆ చెట్టు, ఇద్దరికీ, తల్లిలా,వేసవిలో,నీడనిస్తూ, వర్షా కాలంలో తడవకుండా,కాపాడుతూ,చలి కాలంలో వెచ్చని తన ఒడిలో కప్పుకునేది.అన్నం పెట్టిన అమ్మను
ఆ చింత చెట్టును ఒకేలా భావించేవి.అవి రెండు రోజూ
ఆడుకుంటూ,కొట్టుకుంటూ, స్నేహంగా పెరిగాయి.
                     ఒక రోజు అర్ధరాత్రి రాజు,టామీలు పెద్దగా అరుస్తుండడంతో సీతారామయ్య గారు, ఉలిక్కిపడి లేచారు.అప్పట్లో ఊర్లలో దర్వాజాలు బార్లా
తెరుచుకుని మగవాళ్ళు ముందర మంచం వేసుకుని పడుకునే వారు.ఆడవాళ్ళు లోపల పడుకునే వారు.
కందీలు దీపాన్ని పెద్దదిగా చేసి, సీతారామయ్య గారు
లోపలికి వెళ్ళి, అంతా వెతగసాగాడు.లోపల దర్వాజా వెనుక నక్కి కూర్చున్న దొంగను కందీలు వెలుతురులో
గమనించాడు.అంతే ఆ తర్వాత ఆ దొంగను జుట్టు పట్టి, బయటకు లాగి పక్కనున్న తాడుతో, చేతులు, కాళ్ళు,కట్టేసాడు.తెల్లవార్లూ ఆ కుటుంబానికి నిద్ర లేదు
ఉదయమే పోలీసులు వచ్చి ఆ దొంగను పట్టుకెళ్ళి పోయారు.ఆ ఇంటి తిన్న విశ్వాసంతో రాజు,టామీలు
దొంగతనం జరగకుండా కాపాడారు.అప్పటినుంచి ఆయనకు వాటిపై ఇంకా ప్రేమ పెరిగింది.సీతారామయ్య
గారికి నలుగురు సంతానం.ఇద్దరమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళకు కూడా రాజు, టామీలంటే పంచప్రాణాలు.
                 
ఇంటికి కొత్త వ్యక్తులే కాదు, ఊరి వాళ్ళు రావడానికి కూడా భయపడేవారు.అంత బాగా కాపలా కాసేవి.కొన్ని రోజుల తరువాత రోడ్డు వెడల్పులో భాగంగా,వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ చింత చెట్టుని,కొట్టేసారు, ప్రభుత్వం వారు.ఆ తరువాత ఆ ప్రాంతమంతా బోసిపోయింది.ఎంతో మందికి నీడనిచ్చే చెట్టు తల్లిని నరికేస్తుంటే,ఊరంతా కదిలి వచ్చింది, సీతారామయ్య గారి కుటుంబం అడ్డుకునేందుకు శాయిశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.ఆ రోజు ఆ కుటుంబంతో సహా, రెండు మూగ జీవాలు తెల్లవార్లూ
ఏడుస్తూనే ఉన్నాయి.ఆ చెట్టును తల్లిలా,ఆ ప్రాంతమంతా తమ ఇల్లులా భావించాయి.అలాంటి తల్లి చెట్టును నరికేసాకా,ఆ దిగులుతో రాజు జబ్బున పడి,చనిపోయాడు.విశ్వాసంతో, కుటుంబంతో మమేకమై, ఎప్పుడూ వెన్నంటే వుండే రాజు చనిపోవడంతో,ఆ కుటుంబం కొద్ది రోజుల వరకు కోలుకోలేకపోయింది.చిన్నప్పటి నుంచి నీడనిచ్చిన తల్లీ పోయి, ప్రాణ స్నేహితుడు చనిపోయాక టామీ ఒంటరివాడయ్యాడు.ఆ బాధలో అన్నం తినడమే మానేసాడు.మిత్రుడికై ఏడుస్తూ, చాలా బలహీనపడిపోయాడు.ఆ తరువాత కొద్ది రోజుల తర్వాత టామీ కూడా చనిపోయాడు.
                    ఆ కుటుంబం జ్ఞాపకాలుగా రాజు,టామీలు ఇప్పటికీ మిగిలిపోయారు.
                                    
కామెంట్‌లు