మా లింగయ్య సేటు గొప్పతనం!:-- దోర్బల బాలశేఖరశర్మ

 మనిషికి 'పెద్దరికం' దేనివల్ల వస్తుంది? అసలు ఏది 'పెద్దరికం'? ఎవరు పెద్దలు? వయసు, చదువు, పదవి, ఆస్తులు, అంతస్తులు, అధికారం.. వంటివన్నీ ఏ రకమైన పెద్దరికాన్ని తెచ్చి పెడతాయి? మంచితనం, మానవత్వం, ఔదార్యం, ప్రేమ, వాత్సల్యం, ఆత్మీయత.. వంటి సుగుణాలు ఏవీ లేని పెద్దరికం వట్టి డాంబికానికే తప్ప వ్యక్తిత్వాన్ని, సమాజాన్ని వికసింప చేసేవి కావు. అటువంటి మర్యాద, మన్నన, గౌరవాభిమానాలను పొందుతున్న పెద్దలు ఇవాళ చాలా అరుదు.
నాకు నాలుగేళ్లప్పుడు తమ్ముడు రాంగోపాల్ శర్మకు ఏడాది వయసు. రామాయంపేటలోని మా ఇంటి ఉత్తరం దర్వాదకు అడ్డంగా కడపపైన చిన్న గేటు (కలపది) వుండేది. చిన్న పిల్లలు తలుపు అవతలకు వెళ్లకుండా ఈ ఏర్పాటు. ఒకరోజు తమ్ముడు అంబాడుతూ ఆ గేటుకు, కడపకు మధ్య వున్న ఖాళీ స్థలంలోకి తల పెట్టి, మళ్లీ బయటకు తీయలేక ఏడుపు అందుకున్నాడు. అమ్మకు, చుట్టుపక్కల వాళ్లకు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్న సమయంలో ఆయన వచ్చారు. చాలా చాకచక్యంగా పసివాడి మెడను వంచి జాగ్రత్తగా బయటికి తీశారు. పిల్లవాడిని కాపాడిన ఆ పెద్దమనిషి ఎవరోకాదు, మా ఎదురింటి యజమాని దివంగత, కీ.శే. చొల్లేటి లింగయ్య సేటు! ఆయన చేసిన ఈ సాయాన్ని అమ్మానాన్న అనేక సందర్భాలలో పలువురి ముందు గుర్తు చేసుకోవడం నాకు తెలుసు. ఇదేకాదు, ఇంకా అనేక సందర్భాలలో ఆయన మా కుటుంబం పట్ల తన పెద్దమనసును చాటుకున్నారు.
నేను ఏడవ తరగతి పాసైన విషయం నన్ను అడిగి తెలుసుకొని, ఎంతో సంతోషించారు. స్కూలుకు వెళ్లే వయసులో మేం పిల్లలమైనా సరే, ఆరు బయట కనిపించగానే 'దండం పంతులు...' అనేవారు. కారణం మేం బ్రాహ్మణులమని! నాకు తెలియక ఆయన పెద్దవారు కదాని, నేను మళ్ళీ ప్రతినమస్కారం చేస్తే 'పంతులూ! మీరు అలా తిరిగి మాకు నమస్కారం చేయకూడదు. మీరు మమ్మల్ని ఆశీర్వదించ వలసినవారు...' అన్నారు. కొన్నేళ్ల తర్వాత రామాయంపేటలో నేను 'ఈనాడు' పేపర్ కు విలేకరిని అయ్యాక కూడా నాకు ఆయనంటే ఎంతో గౌరవం వుండేది. అప్పట్లో ఆయన 'పట్టణ విద్యా కమిటీ' చైర్మన్ గానూ వుండేవారు. ఎన్నో సమావేశాలలో ఆయన ఎప్పుడూ సహనం, గౌరవం కోల్పోలేదు. మొత్తం పట్టణంలోనే ఇంత హుందాగా తనదైన పెద్దరికాన్ని కలిగివున్న వ్యక్తి నాకు మరొకరు కనిపించలేదు.

కామెంట్‌లు